Share News

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:29 PM

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం 22రోజుల తర్వాత లభ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని చెన్‌గోముల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

నవాబుపేట/పూడూరు నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అదృశ్యమైన వ్యక్తి మృతదేహం 22రోజుల తర్వాత లభ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని చెన్‌గోముల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేట మండలం అక్నాపూర్‌ గ్రామానికి చెందిన రాణా ప్రతాప్‌(28) అక్టోబరు 25వ తేదీన పూడూరు మండల పరిధిలోని చీలాపూర్‌లోని పెద్దగొల్ల శ్రీకాంత్‌ కూతురి శుభకార్యానికి వచ్చాడు. అదేరోజు రాత్రి బయటికి వెళ్లివస్తానని రాణా ప్రతాప్‌ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ రావడంతో చుట్టుపక్కల, తెలిసిన వారిని ఆరాతీసినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు చెన్‌గోముల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా, శనివారం పూడూరు మండలంలోని కండ్లపల్లి గేటు వద్ద ఓ గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి చూడగా, కాలిపోయిన స్థితిలో ఉన్న యువకుడి మృత దేహం, పక్కనే బైకును చూసి రాణాప్రతాప్‌ మృతదేహంగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తండ్రి పెద్ద గొల్లశేఖర్‌ రోదనలు మిన్నంటాయి. పోలీ్‌సస్టేషన్‌కు కూత వేటు దూరంలో మృతదేహం లభ్యం కావడంతో ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.

Updated Date - Nov 16 , 2024 | 11:29 PM