అక్రమంగా కలప దందా
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:39 PM
ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వృక్షాలను నేలమట్టం చేస్తూ యథేచ్ఛగా అక్రమంగా కలపను తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
మర్పల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వృక్షాలను నేలమట్టం చేస్తూ యథేచ్ఛగా అక్రమంగా కలపను తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని వివిధ గ్రామాల్లో నుంచి నిత్యం పదుల సంఖ్యలో అక్రమార్కులు కలపను యథేచ్ఛగా తరలిస్తున్నారు. చెట్టును నరకాలంటే ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఇవేమి పట్టనట్లు అటవీ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వానికి రుసుము చెల్లించకుండా నిత్యం వందలాది చెట్లను నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం చెట్లను నరకరాదని, నరికిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేస్తున్నా అక్రమార్కులు మాత్రం యథేచ్ఛగా కలప దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ కలప వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.