ఎన్నాళ్లీ నిరీక్షణ!
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:16 AM
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అయోధ్య చౌరస్తా రైల్వే గేటుతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు.
అయోధ్య చౌరస్తా రైల్వేగేటుతో ప్రయాణికుల అవస్థలు
అరగంటకోసారి గేటు వేస్తున్న సిబ్బంది
నాలుగేళ్లుగా ముందుకు సాగని రైల్వే అండర్ పాస్ పనులు
మేడ్చల్ టౌన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అయోధ్య చౌరస్తా రైల్వే గేటుతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు. రైళ్ల రాకపోకలతో గేటు గడిగడిక్కి గేటు పడటంతో గేటుకు ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల పొడవున నిలిచిపోతున్నాయి. ఫలితంగా గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడ్చల్ చెక్‌పో్‌స్ట్ట-గండిమైసమ్మ రోడ్డులోని అయోధ్య చౌరస్తా రైల్వేగేటు వాహనదారులకు ఆటంకంగా నలిచింది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈరోడ్డుపై వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మేడ్చల్ పట్టణం నుంచి గుండ్లపోచంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, చందానగర్, హైటెక్ సిటీ, పటాన్‌చెరు వెళ్లే వాహనాలకు ఈ రోడ్డు షార్ట్‌కట్ మార్గం కావడంతో 24గంటల పాటు వాహనాల రాకపోకలు కొనసాగుతాయి. తరచూ రైల్వేగేటు పడటంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గంలేక తంటా
మండలంలోని మేడ్చల్, గుండ్లపోచంపల్లి, గౌడవెల్లి గ్రామాల రైల్వేగేట్లను తొలగించి వాటి స్థానంలో అండర్ పాస్ ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. ఈపనులు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. దీంతో రైల్వేగేటు దాటి అటువైపు వెళ్లే వాహనాలకు మేడ్చల్-గండిమైసమ్మ రోడ్డు తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదు. దీంతో స్థానికులు గత్యంతరం లేక మేడ్చల్-గండిమైసమ్మ రోడ్డుపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పలుమార్లు రైల్వే అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ గంటల తరబడి నిరీక్షించలేక కొందరు వాహనదారులు టోల్‌చార్జీలు చెల్లించి రింగ్‌రోడ్డు పైనుంచి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులకు ఇబ్బందులు
గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ ప్రాంతాల్లో కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వేర్‌హౌజ్‌లలో పనిచేసే ఉద్యోగులు అనుకున్న సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ప్రతీ అరగంటకు ఓసారి గేటు పడుతుండటంతో ఒక్కసారిగా గేడు ఇరువైపులా వాహనాలు కిక్కిరిసి ముందుకు సాగని పరిస్థితి నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో వేసిన గేటును గంటవరకు తీయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గేటు వద్ద పెద్దఎత్తున వాహనాలు నిలిచి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు కళాశాలలు, కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైల్వే వంతెన ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వంతెన ఏర్పాటు చేయాలి: బేరి బాలరాజ్, గుండ్లపోచంపల్లి
అయోధ్య చౌరస్తా రైల్వే గేటును తొలగించి వంతెన ఏర్పాటు చేయాలి. మేడ్చల్ నుంచి గుండ్లపోచంపల్లికి వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం గేటు పడటంతో అటు వైపు నుంచి వెళ్లాలంటే స్థానికులు భయపడుతున్నారు. రైల్వే శాఖ అధికారులు వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి.
అండర్ పాస్ పనులు పూర్తి చేయాలి : అమరం హేమంత్ రెడ్డి, గుండ్లపోచంపల్లి
నాలుగు సంవత్సరాల నుంచి నత్తనడకన కొనసాగుతున్నకండ్లకోయం-గుండ్లపోచంపల్లి రైల్వేఅండర్ పాస్ పనులు త్వరగా పూర్తిచేస్తే ఇబ్బందులు తొలుగుతాయి. గత్యంతరం లేక చాలామంది అయోధ్య చౌరస్తా వైపు నుంచి వచ్చి రైల్వేగేటు వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:16 AM