Share News

రూ.5 భోజన కేంద్రాలను ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:22 PM

రూ.5 భోజన కేంద్రాలను జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

రూ.5 భోజన కేంద్రాలను ఏర్పాటు చేయాలి

తాండూరు, ఆగస్టు 31: రూ.5 భోజన కేంద్రాలను జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించినప్పటికీ కొన్నాళ్లకే మూతపడ్డాయి. గత ప్రభుత్వ హయంలో ఇస్కాన్‌ వారి సహకారంతో అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం విధితమే. వ్యాపార, వాణిజ్య కేంద్రమే కాకుండా సమీపంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని ప్రజలు అవసరాల పనులు వ్యాపార, విద్య, వైద్య కోసం తాండూరు వస్తుంటారు. ముఖ్యంగా నియోజకవర్గం కేంద్రమైన తాండూరుకు కర్ణాటకలోని చించోళి, కుంచారం, సేడం ప్రాంతాల ప్రజలు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం పోటీ పరీక్షల నేపథ్యంలో నిరుద్యోగులు గ్రంథాలయానికి వస్తుంటారు. వీరందరికి మధ్యాహ్నంవేళ చౌక ధరలో భోజనం అందించే రూ.5 భోజన కేంద్రాలు ఉండడంలేదు. చాలా మంది చాయ్‌, సమోసాలతో ఆకలి తీర్చుకుంటున్నారు. హోటళ్లలో భోజనం చేస్తే కనీసం రూ.100కావడంతో పేదలకు భారమవుతుంది. తాండూరులో చించోళి రోడ్డులోని శివాజీచౌక్‌, ఇందిరాచైక్‌లో అంబేడ్కర్‌ చౌరస్తా, రైల్వేస్టేషన్‌ మోర్‌ సూపర్‌ మార్కెట్‌, భదేశ్వర్‌ చౌక్‌లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 31 , 2024 | 11:22 PM