Share News

సజావుగా గ్రూప్‌-3 పరీక్షలు

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:18 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న గ్రూప్‌-3 పరీక్షలు జిల్లాలో సజావుగా జరిగాయి. మొయినాబాద్‌, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో సుమారు 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సజావుగా గ్రూప్‌-3 పరీక్షలు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న గ్రూప్‌-3 పరీక్షలు జిల్లాలో సజావుగా జరిగాయి. మొయినాబాద్‌, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో సుమారు 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 40,649 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 20,714 మంది పరీక్షలు రాశారు. 19,935 మంది గైర్హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం పరిధిలో 20 పరీక్ష కేంద్రాల్లో 13,388 మంది అభ్యర్థులకు గాను 6,735 మంది హాజరయ్యారు. 6,653 మంది గైర్హాజరయ్యారు. అలాగే మొయినాబాద్‌ మండలంలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో 6,726 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 1,733 మంది పరీక్షలు రాశారు. 4,993 మంది హాజరు కాలేకపోయారు. హయత్‌నగర్‌లో పరిధిలో 14 సెంటర్లలో 3,375 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 2,457 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 918 మంది హాజరు కాలేదు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 14 సెంటర్లలో 17,160 మంది అభ్యర్థులకు గాను 9,789 మంది హాజరయ్యారు. 7371 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష నిర్వహించారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. 9.30 గంటల తర్వాత గేట్లు మూసి వేశారు.

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు

శేరిగూడలోని శ్రీదత్త ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూపు-3 పరీక్షా కేంద్రానికి నలుగురు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. వీరు 9.30 గంటల తర్వాత సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో అధికారులు వీరిని లోనికి అనుమతించలేదు. అభ్యర్థులు వారిని బతిమిలాడినా ఎంట్రీ చేయలేదు. దీంతో ఆ అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. అలాగే మొయినాబాద్‌లోని భాస్కర ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి కూడా ఇద్దరు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు.

కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

జిల్లాలో మొదటి రోజు జరిగిన గ్రూప్‌-3 పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. తట్టి అన్నారంలోని శ్రేయస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, హయత్‌నగర్‌లోని వర్డ్‌ అండ్‌ డీడ్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీలో ఏర్పాటుచేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లోని సౌకర్యాలను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దారు, తదితరులున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 11:18 PM