Share News

అటెండర్లే దిక్కు

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:00 AM

విజ్ఞాన భాండాగారాలుగా పేరొందిన గ్రంథాలయాల నిర్వహణకు అటెండర్లే దిక్కయ్యారు. జిల్లాలోని అనేక లైబ్రరీల్లో గ్రంథపాలకుల పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో నిర్వహణ బాధ్యత చూసేవారులేక గ్రంథాలయాల్లో సమస్యలు తిష్ట వేశాయి.

అటెండర్లే దిక్కు
శిథిలావస్థలో ఉన్న చేవెళ్ల గ్రంథాలయం

లైబ్రరీల్లో గ్రంథపాలకుల పోస్టులు ఖాళీ

అధ్వానంగా గ్రామీణ ప్రాంత గ్రంథాలయాలు

కొరవడిన మౌలిక సదుపాయాలు

శిథిలావస్థకు చేరిన భవనాలు

భయం గుప్పిట్లో పాఠకులు

విజ్ఞాన భాండాగారాలుగా పేరొందిన గ్రంథాలయాల నిర్వహణకు అటెండర్లే దిక్కయ్యారు. జిల్లాలోని అనేక లైబ్రరీల్లో గ్రంథపాలకుల పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో నిర్వహణ బాధ్యత చూసేవారులేక గ్రంథాలయాల్లో సమస్యలు తిష్ట వేశాయి. కనీస వసతులు లేక పాఠకులు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజ్ఞానాన్ని పంచే వీటిని ఆధునికీకరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలను పట్టించుకునేవారే లేరు. అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేక కాంపిటేటివ్‌ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. చాలాచోట్ల గ్రంథాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. భయం గుప్పిట్లో పుస్తక పఠనం సాగిస్తున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 24 గ్రంథాలయాలు ఉండగా.. మొత్తం 3.20 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయం బడంగ్‌పేట్‌లో కొనసాగుతోంది. 24 గ్రంథాలయాలకు గాను 16 మంది గ్రంథపాలకులు మాత్రమే ఉన్నారు. 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో గ్రంథ పాలకుడు రెండు నుంచి మూడు గ్రంథాలయాల నిర్వహణ బాధ్యత చూసుకుంటున్నారు. కొన్నిచోట్ల అటెండర్లే నిర్వహణ బాధ్యత చూస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా, అటెండర్లకు ప్రతీనెల అందించే జీతం కూడా అందడం లేదని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భయం గుప్పిట్లో పాఠకులు

జిల్లాలోని ప్రతీ మండలంలో ఒక గ్రంథాలయం నిర్మించారు. తర్వాత వాటి బాగోగులు పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీంతో చేవెళ్ల, మొయినాబాద్‌ మండల కేంద్రంలోని గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అవి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం లైబ్రరీకి వచ్చే పాఠకులు భయాందోళనకు గురవుతున్నారు. చేవెళ్లలో గ్రంథాలయ భవన నిర్మాణానికి 2023 ఆగస్టు 23న అప్పటి సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రూ.1.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ.. ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభించ లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మధుసూదన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. చేవెళ్లలో శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయాన్ని పరిశీలించారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. అలాగే మొయినాబాద్‌ మండలంలో గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ గ్రంథపాలకుడు రిటైర్డ్‌ కావడంతో అటెండరే లైబ్రరీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నాడు. వనస్థలిపురంలో కొత్త గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.1.95కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. షాబాద్‌ మండల కేంద్రంలో రూ.80 లక్షలతో కొత్తగా గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. అలాగే కొత్తూరులో రూ.75 లక్షలతో కొత్త భవనాన్ని నిర్మించారు. అయితే ఈ భవనాల్లో ఫర్నిచర్‌ ఏర్పాటు చేయలేదు. డిస్ట్రిక్‌ లెవల్‌ పర్‌చేసింగ్‌ కమిటీ వద్ద ఫైల్‌ ఆగి ఉంది. షాబాద్‌, కొత్తూరులో కొత్తగా నిర్మించిన గ్రంథాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఫర్నిచర్‌ లేకపోవడంతో వాటిని ప్రారంభించలేదని సమాచారం. ఇకపోతే శేరిలింగంపల్లిలో గ్రంథాలయ నిర్మాణానికి రూ.2.95 కోట్లు మంజూరయ్యాయి. కానీ, పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కొందుర్గు మండలంలో పశువైద్యశాల భవనంలోనే ప్రస్తుతం గ్రంథాలయం కొనసాగుతోంది.

పేరుకుపోయిన సెస్సు బకాయిలు

జిల్లాలోని గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు ఏటా వసూలు చేసే ఆస్తి పనుల్లో 8శాతం గ్రంథాలయ సెస్సును చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాలో జమ చేయాలి. యేటా ఈ ప్రక్రియ వంద శాతం జరగకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో రూ.4 కోట్ల సెస్సు వసూలు కావాల్సి ఉంది. ఈ ఫండ్‌తోనే దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, తాత్కాలిక ఉద్యోగుల జీతాలు, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుంటారు. సకాలంలో సెస్సు వసూలు కాకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అభివృద్ధి పనులు, మరమ్మతులు, శాశ్వత భవనాలు, గదుల నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

కొత్త మండలాల్లో లైబ్రరీలు కరువు

2016లో జిల్లాల పునర్విభన జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 10 మండలాలు రంగారెడ్డి జిల్లాలోకి వచ్చాయి. తర్వాత కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ కొత్త మండలాల్లో ఇప్పటివరకు గ్రంథాలయాలు ఏర్పాటు చేయలేదు. చౌదరిగడూడ, నందిగామ, అబ్ధుల్లాపూర్‌మెట్‌, కడ్తాల్‌ మండలాల్లో కూడా లైబ్రరీలు లేవు.

పెంచిన సమయం.. కల్పించిన భోజన వసతి

గ్రూప్‌-2, గ్రూప్‌-3 కోసం సిద్ధమతుతున్న అభ్యర్థుల అభ్యర్థన మేరకు జిల్లా కేంద్ర గ్రంథాలయం నిర్వహణ సమయాన్ని పొడిగించారు. రాత్రి సమయం 10 గంటల నుంచి 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎలుగంటి మధుసూదన్‌ సొంత ఖర్చులతో అభ్యర్థులకు 45 రోజుల పాటు భోజన వసతి కల్పిస్తున్నారు. జిల్లాలోని సరూర్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, ఆమగల్లు, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ గ్రంథాలయంలో గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు పుస్తకాలు అందుటుబాటులో ఉంచారు. కాగా, మిగతాచోట్ల కూడా లేవు.

మా మండలంలో గ్రంథాలయమే లేదు

2016లో చౌదరిగూడ కొత్త మండలంగా ఏర్పడింది. ఇప్పటివరకు గ్రంథాలయం ఏర్పాటు చేయలేదు. ఇక్కడ లైబ్రరీ లేకపోవడంతో పక్క మండలం కొందుర్గు వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. పోటీ పరీక్షలకు కావాల్సి పుస్తకాలను అభ్యర్థులు ఇతర మండలాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు.

- అఫ్రోస్‌ అలీ, చౌదరిగూడ

Updated Date - Nov 16 , 2024 | 12:00 AM