నగరానికే తలమానికం
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:42 PM
హైదరాబాద్ చరిత్రలో మూసీ నదికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు నగరం పేరు చెప్పగానే మంత్రుముగ్ధులను చేసే మూసీ నది కళ్ల ముందు కదలాడేది. కానీ ప్రస్తుతం మూసీ అంటే.. మురికి కూపం అంటూ చాలా మంది ముక్కు మూసుకుంటారు.
నాటి ముచుకుందానే.. నేటి మూసీ నది
అనంతగిరిలో జన్మించి.. వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలిసి..
గతంలో నగరవాసుల దాహార్తి తీర్చిన మూసీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకే నదీ స్వచ్ఛత
రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 240 కి.మీ. మేర ప్రవాహం
పూర్వవైభవం దిశగా ప్రభుత్వం కార్యాచరణ
హైదరాబాద్ చరిత్రలో మూసీ నదికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు నగరం పేరు చెప్పగానే మంత్రుముగ్ధులను చేసే మూసీ నది కళ్ల ముందు కదలాడేది. కానీ ప్రస్తుతం మూసీ అంటే.. మురికి కూపం అంటూ చాలా మంది ముక్కు మూసుకుంటారు. అయితే ఈ నదికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అనంతగిరి కొండల్లో జన్మించిన ముచుకుందా నదియే మూసీ నది. హైదరాబాద్ నగరానికి తలమానికంగా మారిన మూసీ నది కాలక్రమేణా తన ప్రాశస్త్యాన్ని కోల్పోయింది.
వికారాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మూసీ నది 125 ఏళ్ల కిందట అన్ని నదుల మాదిరిగానే స్వచ్ఛతతో ఉండేది. ఘన చరిత్ర ఉన్న మూసీ కాలక్రమేణ కాలుష్యసాగరంగా మారింది. కాలుష్యం, ఆక్రమణలతో సుందరమైన మూసీ ఘనత మసక బారింది. నది ప్రక్షాళనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఘాటుగా స్పందించడంతో నది పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకట్టుకునేలా సుందరంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. నది అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. లండన్ నగరం మీదుగా ప్రవహించే థేమ్స్ నది మాదిరిగా ఈ మూసీ నదికి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
ఒకప్పుడు నగర దాహార్తిని తీర్చేలా
ముచుకుందా నది కాలక్రమేణా మూసీ నది పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ నది బుగ్గ మీదుగా, ధన్నారం, కొత్తగడి, పెండ్లిమడుగు, మూలమడ, చించల్‌పేట, అత్తాపూర్, అక్నాపూర్, నారేగూడ, పులుమామిడి, గొల్లగూడ, గంగ్యాడ, గుబ్బడి ఫత్తేపూర్, ముబారక్ పూర్, రావులపల్లి, శంకర్‌పల్లి, బుల్కాపూర్, టంగటూరు, రామంతాపూర్, చిన్న శంకర్‌పల్లి, పొద్దటూరు, పిల్లిగుండ్ల శివార్ల మీదుగా ప్రయాణిస్తూ ఉస్మాన్‌సాగర్‌లో కలుస్తుంది. వికారాబాద్ జిల్లాలో మూసీ నది 26 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఈ నది ఒకప్పుడు హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేది. నగర ప్రజల తాగునీటి అవ సరాలు తీర్చేందుకు మూసీ నదిపై రెండు కృత్రిమ జలాశయాలు నిర్మించారు. మూసీ నది హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి ప్రవహిస్తుంది.
చిత్తలూరు వద్ద దక్షిణ దిశగా మలుపు
నగరంలో మూసీ నదిపై ఏడు పురాతన వంతెనలు ఉన్నాయి. మూసీ నది దక్కన్ పీఠభూమిలో కృష్ణా నదికి ప్రధాన ఉప నదిగా ఉంది నగరం మధ్య నుంచి ప్రవహిస్తూ... చారిత్రక పాత నగరాన్ని కొత్త ప్రాంతం నుంచి వేరు చేస్తుంది. అనంతగిరి కొండల్లో 2,168 అడుగుల ఎత్తులో జన్మించిన మూసీ.. తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల మీదుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఆలేరు, పాలేరు ఉప నదులను కలుపుకొని చిత్తలూరు వద్ద దక్షిణ దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు ఉప నది కలిసే సూర్యాపేట చోట 1963లో జలాశయం నిర్మించారు. పాలేరు కలిసే చోట వాడపల్లి వద్ద 200 అడుగుల ఎత్తుకు దిగి ప్రయాణిస్తోంది. అనంతగిరి నుంచి వాడపల్లి వరకు 240 కిలోమీటర్ల దూరం మూసీ ప్రయాణం కొనసాగుతోంది. మూసీ బేసిన్ వైశాల్యం 4,329 చదరపు మైళ్లు కాగా, కృష్ణా నది బేసిన్ వైశాల్యంలో ఇది కేవలం 4.35 శాతమే. 1908లో కురిసిన భారీ వర్షాలతో మూసీ నదికి భారీ వరదలు వచ్చి 15 వేల మందికి పైగానే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాతనే మూసీ నదికి వరదలు వచ్చినా ప్రజలు ఇబ్బందులు పడ కుండా ఉండేలా చర్యలు చేపట్టారు.
పురాణ ప్రాశస్త్యం ఇలా..
అనంతగిరి కొండల్లో అనంతపద్మనాభస్వామి కొలువుదీరిన చోటనే మూసీ నది జన్మించింది. ఈ నదికి పురాణ ప్రశస్త్యం కూడా ఉంది. పురాణాల ప్రకారం.. అనంతగిరి కొండల్లో మార్కండేయ మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో ప్రతీ రోజూ తన యోగ సాధనతో అనంతగిరి నుంచి కాశీ వెళ్లి అక్కడ గంగా నదిలో స్నానమాచరించేవారు. రాజర్షి ముచుకుందుడు అనేక సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయి అనంతగిరి అడవులకు వచ్చి శ్రీమన్నారాయణుడిని స్మరిస్తూ తపస్సు చేస్తారు. అయితే తనకు ఎవరు నిద్రాభంగం కలిగిస్తారో వారు అగ్నికి ఆహుతి అవుతారనే వరాన్ని దేవేంద్రుడు ముచుకుందుడికి ప్రసాదిస్తాడు. అనంతగిరిలో తపోనిష్టలో ఉన్న సమయంలో కాల యవనుడు అనే రాక్షసుడు అనంతగిరికి వచ్చి ముచుకుందుడికి తపోభంగం చేసి అగ్నికి ఆహుతవుతాడు. శ్రీమన్నారాయణుడు ముచుకుందుడికి దర్శనమివ్వగా, ఆయన తన కమండలంలోని జలంతో స్వామి వారి పాదాలను అభిషేకిస్తాడు. సంతోషించిన స్వామి అభిషేకించిన స్థలంలో జీవనది ఉద్భవించి ముచుకుంద పేరుతో శాశ్వతంగా నిలిచిపోతుందని అనుగ్రహించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామి వారి పాదాలను అభిషేకించిన స్థలంలోనే భవనాశిని పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణి నుంచి సన్నటి ధారగా ముచుకుందా నది ప్రయాణం ప్రారంభమై వికారాబాద్ పట్టణం మీదుగా రాజధాని వైపు ముందుకు సాగుతోంది.