మూడు ఇళ్లు, ఒక దుకాణంలో చోరీ
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:12 AM
మండలంలోని నాగారంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు ఇళ్లు, ఒక దుకాణంలో చోరీ జరిగింది.
ధారూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నాగారంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు ఇళ్లు, ఒక దుకాణంలో చోరీ జరిగింది. దుండగులు బంగారం, వెండి వస్తువులు, నగదును అపహరించుకెళ్లారు. బాధితులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కావలి నర్సింహులు కుటుంబం ఇంటి తాళంవేసి రెండు రోజల క్రితం యాలాల మండలం దేవనూర్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా ఇంటి తాళాలను విరగగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు వేర్వేరు గదుల్లో ఉన్న రెండు బీరువా లాకర్లను పగలగొట్టారు. అందులో ఉన్న మూడు తులాల బంగారం వస్తువులు(నాను, పుస్తె, చిన్న ఉంగరాలు), 45 తులాల వెండి గొలుసులు, కడియాలు, రూ.17వేలు నగదును చోరీ చేశారు. అదేవిధంగా వడ్డె సంజయ్య ఇంటి తాళాలను విరగొట్టి పెట్టెలో ఉన్న రెండున్నర తులాల బంగారం వస్తువులు, రూ.50వేల నగదును ఎత్తుకెళ్లారు. పెట్టెను గ్రామ శివారులోని పీతిరోని వాడుకలో పడేశారు. ఎరుకల లక్ష్మి దుకాణం వెనుక నుంచి తలుపులకు ఉన్న తాళంను విరగొట్టి దుకాణంలో ఉన్న రూ.10వేల నగదును చోరీ చేశారు. కాగా హైదరాబాద్‌లో ఉంటున్న మరొకరి ఇంటి తాళాలు విరగొట్టగా ఆఇంట్లో దొంగలకు ఏమి దొరకలేదు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ సిబ్బందితో గ్రామానికి వెళ్లి చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. పీతిరోని వాడుకలో దొంగలు పడేసిన పెట్టెను పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై బాధితులు కావలి నర్సింహులు, సంజయ్యలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరుపుతున్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:12 AM