మలుపులు.. ప్రమాదాలకు పిలుపులు
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:20 PM
షాద్‌నగర్ పట్టణం నుంచి చించోడు- అయ్యవారిపల్లి వెళ్లే రోడ్డు వెంట ఉన్న మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి రోడ్డు విస్తరణ చేయకపోవడంతో మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.
హెచ్చరిక బోర్డులు లేక నిత్యం యాక్సిడెంట్లు
మృత్యువాత పడుతున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు.. ప్రజాప్రతినిధులు
షాద్‌నగర్ రూరల్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): షాద్‌నగర్ పట్టణం నుంచి చించోడు- అయ్యవారిపల్లి వెళ్లే రోడ్డు వెంట ఉన్న మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి రోడ్డు విస్తరణ చేయకపోవడంతో మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. మలుపుల వద్ద రోడ్డు వెడల్పు చేయాలని ఏళ్ల తరబడి కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ నుంచి అయ్యవారిపల్లి నుంచి బీమారం వరకు రోడ్డు విస్తరణ చేశారు. కానీ, కిషన్‌నగర్ నుంచి షాద్‌నగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదు. దాంతో మలుపులు ప్రమాదకరంగా మారాయి. కిషన్‌నగర్ శివారులోని సోలార్ ప్లాంట్ మలుపు ప్రమాదాలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. సోలార్ ప్లాంట్ వద్ద ఉన్న మలుపు వద్ద గతంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండల పరిధి చౌలపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్దకు స్కూటర్‌పై వెళ్తుండగా అదే మలుపు వద్ద వేగంగా రోడ్డు కిందికి వెళ్లిన ద్విచక్ర వాహనదారుడు కింద ఉన్న రాళ్లపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అదేవిధంగా ఆగిర్యాలకు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై షాద్‌నగర్ వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొనడంతో ఆగిర్యాల గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.
కోసుకుపోయిన రోడ్డుతో నానా ఇబ్బందులు
షాద్‌నగర్ పట్టణం నుంచి కిషన్‌నగర్ వరకు సింగిల్ రోడ్డు ఉండటం.. అది కూడా రెండు వైపులా కోసుకుపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చేందుకు రోడ్డు దిగితే మళ్లీ ఎక్కడానికి పాట్లు పడాల్సివస్తుంది. ఈక్రమంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు కిరువైపులా చెట్లు పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. రోడ్డు కిరువైపులా మట్టి పోస్తే కొంత వరకు ప్రమాదాలు నివారించవచ్చని వాహదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మలుపుల వద్ద రోడ్లను వెడల్పు చేయాలి
షాద్‌నగర్ నుంచి కిషన్‌నగర్ వరకు రోడ్డు వెడల్పు చేయాలని చాలా ఏళ్ల నుంచి కోరుతున్నాం. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తరచూ వాహనదారులు ప్ర మాదాలకు గురవుతున్నారు. కనీ సం మలుపుల వద్దనైనా రోడ్డును వెడల్పు చేయాలి.
- కట్టా వెంకటే్‌షగౌడ్, కిషన్‌నగర్