Share News

ఐటీ పార్కు ఏర్పాటయ్యేనా?

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:34 PM

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా మారింది మాదారం ఐటీ పార్కు పరిస్థితి. ఈ ప్రాంతంలోకి పరిశ్రమలు వస్తే తమ పిల్లలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఆశతో అక్కడి రైతులు తమ భూములను ప్రభుత్వానికి కట్టబెట్టారు.

ఐటీ పార్కు ఏర్పాటయ్యేనా?
మాదారం ఐటీ పార్కుకు ప్రభుత్వం సేకరించిన భూమి

  • భూ సేకరణకు 11ఏళ్లు కాలయాపన

  • రైతులకు పరిహారం చెల్లించి రెండేళ్లు

  • అభివృద్ధి జాడలేని మాదారం ఐటీ పార్కు

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా మారింది మాదారం ఐటీ పార్కు పరిస్థితి. ఈ ప్రాంతంలోకి పరిశ్రమలు వస్తే తమ పిల్లలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఆశతో అక్కడి రైతులు తమ భూములను ప్రభుత్వానికి కట్టబెట్టారు. అధికారుల తాత్సారం వల్ల 2011 నుంచి చేపట్టిన భూసేకరణ సుదీర్ఘకాలం కొనసాగి 2022లో పూర్తయ్యింది. రైతులకు అదే ఏడాది జూలైలో పరిహారం అందజేశారు. కానీ ఇంత వరకు మాదారం ఐటీ పార్కు మాత్రం ఏర్పాటు కాలేదు.

ఏళ్ల తరబడి కాలయాపన

మేడ్చల్‌ జిల్లా, ఘట్‌కేసర్‌ మండలం, మాదారం సర్వేనెంబర్‌ 225లో మొత్తం 319ఎకరాల అసైన్డ్‌భూమి ఉంది. అందులో నుంచి 219 ఎకరాల భూమిని 1978లో 89మంది రైతులకు ప్రభుత్వం అసైన్డ్‌పట్టాలు ఇచ్చింది. మిగతా భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కొంతమంది అసైన్డ్‌పట్టాదారులు భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగించారు. తిరిగి ఈ భూమిని స్వాధీనం చేసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 2011లో సర్వేలు ప్రారంభించింది. అనేకసార్లు అధికారులు అసైన్డ్‌ రైతులతో గ్రామసభలు ఏర్పాటుచేశారు. సర్వేల పేరుతో అధికారులు దాదాపు 11ఏళ్లు కాలయాపన చేసి, సర్వే ప్రక్రియ పూర్తిచేసిన అధికారులు జూలై 2022లో ఎకరాకు రూ.32లక్షల పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుంది. కానీ 14అసైన్డ్‌పట్టాదారుల వద్ద రికార్డులు సక్రమంగా లేకపోవడంతో 54ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదు. సేకరించిన భూమిని ప్రభుత్వం ఐటీపార్కు కోసం టీఎ్‌సఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ)కు కట్టబెట్టింది. సర్వేల పేరుతో ఏళ్ల తరబడి కాలయాపన చేసిన అధికారులు పరిహారం చెల్లించి రెండేళ్లు దాటిన మాదారం ఐటీ పార్కులో ఎలాంటి అభివృద్ధి కనిపించడంలేదని స్థానికులు వాపోతున్నారు. తమ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే తమ పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆశతో భూమిని అప్పగిస్తే అధికారులు తాత్సారం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరిగే విధంగా పరిశ్రమలు ఉండాలని, కాలుష్యరహిత పరిశ్రమలు రావాలని మాదారం పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా ప్రభుత్వ కృషిచేయాలని కోరుతున్నారు.

ఐటీపార్కు ఏర్పడితేనే అభివృద్ధి: జవ్వాజీ లింగం, ఎదులాబాద్‌

మాదారంలో ఐటీ పార్కు ఏర్పడితేనే చుట్టుపక్కల గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. మంచి పరిశ్రమలు వస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. స్థానికులకు ఉపాధి లభిస్తుంది. అధికారులు ఇప్పటికైనా చొరవ చూపి మాదారం ఐటీపార్కు వచ్చేలా చూడాలి.

ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు : నల్లోల యాదగిరి, మాజీ సర్పంచ్‌, మాదారం

మాదారంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అధికారులు సర్వే నిర్వహించి, సేకరించిన భూమికి పరిహారం చెల్లించి రెండేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు తాత్సారం చేయకుండా పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేయాలి.

Updated Date - Nov 16 , 2024 | 11:34 PM