Electric Vehicles: ఈవీ.. ట్యాక్స్ ఫ్రీ
ABN, Publish Date - Nov 18 , 2024 | 02:50 AM
ఇంధన ధరలకు తాళలేక ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వైపు చూస్తున్నారా? ఇదే సదవకాశం!! ఎలక్ట్రిక్ కారో.. లేదా బైకో కొన్నవారికి బంపర్ ఆఫర్! ఈవీలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
2026 దాకా రోడ్‌ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు
ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మినహాయింపులు
బైక్‌లు, ఫోర్‌వీలర్లు, క్యాబ్‌లు, ఆటోలు,
బస్సులు, ట్రాక్టర్లకు వర్తింపు
గతంలో రోడ్‌ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుకు పరిమితులు.. తొలి 2లక్షల బైక్‌లు, 8వేల కార్లు, 2వేల ఆటోలకే
మినహాయింపులపై ఇప్పుడు ఎలాంటి పరిమితీ లేదు.. కాలుష్య నియంత్రణకే ప్రోత్సాహకాలు: పొన్నం
రోడ్ ట్యాక్స్ మిగులు ఇలా..
17%
10లక్షలపై చిలుకు కారు కొంటే..
12%
ద్విచక్రవాహనాలు కొంటే..
10001500
ఆదా అయ్యే రిజిస్ట్రేషన్ ఫీజు..
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇంధన ధరలకు తాళలేక ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వైపు చూస్తున్నారా? ఇదే సదవకాశం!! ఎలక్ట్రిక్ కారో.. లేదా బైకో కొన్నవారికి బంపర్ ఆఫర్! ఈవీలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాహన కాలుష్యాన్ని నియంత్రించే ప్రధాన లక్ష్యంతో 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ మోటారు వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఢిల్లీలో వాహన కాలుష్యంతో ఏర్పడిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోనూ వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గతంలో ఉన్న పరిమితులను రద్దు చేసి మరో రెండేళ్ల వరకు ట్యాక్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం సచివాలయంలో రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్‌తో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. శబ్ద, వాయు కాలుష్యాన్ని నిరోధించే ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులకు రోడ్‌ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొన్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకూ ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు జీవో జారీ చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్, డి ప్యూటీ సీఎం భట్టిల నేతృత్వంలో రాజధాని హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేకుండా రాయితీలు అందించి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈవీ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రస్త్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.7 లక్షల ఈవీలు రిజిస్ట్రేషన్ అయినట్లు వెల్లడించారు. కాగా కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో 83, పటాన్‌చెరులో 82, సంగారెడ్డిలో 79 పాయింట్లకు తీవ్రత నమోదైనట్లు వివరించారు. కాలుష్య సమస్యను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేటర్‌లో మూడువేల ఈవీసిటీ బస్సులు ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించినట్టు గుర్తు చేశారు. 15ఏళ్లు దాటిన పాత వాహనాలకోసం స్కారప్ పాలసీ తీసుకువచ్చినట్టు తెలిపారు. త్వర లో రెండు స్ర్కాప్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలకు త్వరలో ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. దేశంలో ఏటా 1.60లక్షల మంది, రాష్ట్రంలో రోజుకు సగటున 20 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్టు పేర్కొన్నారు.
రోడ్ ట్యాక్స్ 17శాతం మిగులు
రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులివ్వడంతో ఈవీలు కొన్నవారికి ప్రయోజనం కలుగనుంది. కార్ల ధర 10 లక్షల లోపు అయితే 14శాతం, ధర 10 లక్షలపైన అయితే 17శాతం రోడ్ ట్యాక్స్ మిగులుతుంది. ఒకవేళ కొనుగోలుదారు పేరిట అప్పటికే బైక్ గనక ఉంటే 2 శాతం అదనంగా ట్యాక్స్ పడుతుంది. అంటే మొత్తం 19శాతం మిగులుతుంది. ఆ రకంగా ఈవీ కారు కొన్నవారికి రూ.1.40 లక్షల నుంచి రూ.1.90 లక్షల దాకా మిగులుతుంది. ద్విచక్రవాహనాలయితే కొన్న ధరలో 12శాతం రోడ్ ట్యాక్స్ మిగులుతుంది. బైక్‌లు, కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1500-2వేల వరకు మిగలనుంది. వాస్తవానికి ఈ మినహాయింపు పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబరు 29న పరిమితులతో అమల్లోకి తెచ్చింది. తొలి 2లక్షలు బైక్‌లు కొన్నవారికి, తొలి 8వేల కార్లు కొన్నవారికి, తొలి 2వేల ఆటోలు కొన్నవారికి రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పరిమితి విధించలేదు.
రవాణా శాఖకు కొత్త లోగో
రవాణా శాఖ అధికారులు, ఉద్యోగులను గుర్తించేందుకు కొత్తగా లోగో రూపొందించనున్నట్టు మంత్రి పొన్నం తెలిపారు. డీటీసీ స్థాయి అధికారులందరికీ వాహనాలు సమకూర్చనున్నట్లు వివరించారు. రహదారి నిబంధనలు కచ్చితంగా పాటించే విధంగా వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు కొత్తగా నియమితులైన ఏఎంవీఐల సేవలను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్టీఏ చెక్‌పోస్టుల కొనసాగింపు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కోసం పది రోజుల్లో జీహెచ్‌ఎంసీ,. రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసిన వివిధ రకాల
ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు
టూ వీలర్స్ 143535
ఫోర్ వీలర్స్ (కార్లు) 8000
ఫోర్ వీలర్స్ (టాక్సీక్యాబ్స్) 2000
ఆటోలు (జీహెచ్‌ఎంసీ) 2007
ఆటోలు (జిలాల్లో) 933
చిన్న తరహా గూడ్స్ (జీహెచ్‌ఎంసీ) 2000
చిన్న తరహా గూడ్స్ (జిల్లాల్లో ) 2323
మరో 80 ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్‌లో ఏర్పాటుకు టీజీ రెడ్కో కసరత్తు.. 20 స్థలాల పరిశీలన
హైదరాబాద్ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): నగరంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేదిశగా టీజీరెడ్కో (తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్) చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్‌జోన్ పరిధిలో 70 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన టీజీరెడ్కో మరో 80 ఏర్పాటుచేసే దిశగా ముందుకువెళ్తుంది. అందులో భాగంగా 20 ప్రాంతాల్లో స్థలాలు కూడా పరిశీలించింది. త్వరలో ఆయా ప్రాంతాల్లో ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం 2026 డిసెంబరు 31 వరకు ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని కొనసాగిస్తునట్లు ప్రకటించడంతో ఈవీ వాహనాల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలుంటాయని టీజీ రెడ్కోకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. గ్రేటర్‌జోన్ పరిధిలో 2025 నాటికి 600 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యంగా చర్యలు తీసుకుంటునట్లు అధికారులు చెబుతున్నారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు లక్ష్యంగా టీజీ రెడ్కో ముందుకువెళ్తోంది. కాగా గ్రేటర్‌లో ప్రతి 22 ఈవీ వాహనాలకు ఒక పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉందని టీజీరెడ్కో అధికారులు తెలిపారు. గ్రేటర్‌పరిధిలో 17 వేల ఈవీ ద్విచక్ర వాహనాలుండగా, 4800 వరకు త్రీ, ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయి. టీజీరెడ్కో ఏర్పాటుచేసిన ఈవీ చార్జింగ్ స్టేషన్ల వివరాలు ఎలక్ట్రిక్ వాహనదారులు సులభంగా తెలుసుకునేందుకు వీలుగా టీజీఈవీ యాప్‌ను రెడ్కో ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది. టీజీఈవీ యాప్‌లో ప్రైవేట్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల వివరాలను అనుసంధానం చేసే దిశగా టీజీరెడ్కో పలు ప్రైవేట్ కంపెనీలతో సంప్రదింపులు చేస్తోంది. టీజీరెడ్కో ఈవీ చార్జింగ్ స్టేషన్లలో జీఎస్టీతో కలిపి ఒక్క యూనిట్‌కు రూ. 15.38 పైసలు వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ఈవీ చార్జింగ్ స్టేషన్లలో రూ. 25-28 వరకు వసూలు చేస్తున్నారు. గ్రేటర్‌లో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఓ ఈవీ చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Nov 18 , 2024 | 02:50 AM