Share News

ఆరుగాలం కష్టం రోడ్డు పాలు..

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:30 AM

ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించడానికి తీసుకెళ్తుండగా రోడ్డు పాలైంది.

ఆరుగాలం కష్టం రోడ్డు పాలు..
ట్రాక్టర్‌ ట్రాలీ నుంచి రోడ్డుపై పడిపోయిన ధాన్యం

ధాన్యం ట్రాక్టర్‌ను ఢీకొన్న డీసీఎం.. రోడ్డుపై పడిపోయిన ధాన్యం

వేములపల్లి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించడానికి తీసుకెళ్తుండగా రోడ్డు పాలైంది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన రైతు జక్కలి మంగయ్య శనివారం సాయంత్రం రెండు ఎకరాల పొలం కోసి తన ట్రాక్టర్‌లో ఆదివారం ఉదయం వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులోగల మిల్లుల వద్దకు చేరుకున్నాడు. మహర్షి రైస్‌మిల్లు సమీపంలో మిర్యాలగూడ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. ట్రాక్టర్‌ ట్రాలీలో ఉన్న సుమారు 75బస్తాల ధాన్యం(44 క్వింటాళ్లు) రోడ్డుపై పడింది. ట్రాక్టర్‌ ఇంజన్‌ దెబ్బతిని రెండుగా విడిపోయింది. రైతు మంగయ్య స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ధాన్యాన్ని మరో ట్రాక్టర్‌లో లోడ్‌ చేయించి మిల్లుకు తరలించారు. 40 క్వింటాళ్లు విక్రయించగా, సుమారు నాలుగు క్వింటాళ్ల ధాన్యం మట్టి పాలైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రూ.10వేల నష్టం వాటిల్లిందని, ట్రాక్టర్‌ ఇంజన్‌, ట్రక్కు దెబ్బతినడంతో సుమారు రూ.7లక్షల వరకు నష్టపోయానని వాపోయాడు.

Updated Date - Nov 11 , 2024 | 12:30 AM