Share News

రైతులకు రాయితీపై యంత్రాలు!

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:56 AM

యాసంగి సీజన్‌ నుంచి రైతులకు అవసరమైన ఉపకరణాలు, యంత్రాలను రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

రైతులకు రాయితీపై యంత్రాలు!

  • యాసంగి సీజన్‌ నుంచి అందజేత: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌ నుంచి రైతులకు అవసరమైన ఉపకరణాలు, యంత్రాలను రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా తయారు చేసినట్లు తెలిపారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ బి.గోపి, ఇతర అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. పనిముట్లు, యంత్రాల తయారీ సంస్థల సహకారంతో రైతుల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాల వారీగా ప్రదర్శనలు నిర్వహిస్తామని తుమ్మల చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్‌ స్ర్పేయర్లు, పవర్‌ వీడర్లు, మొక్కజొన్న ఒలిచే యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్‌ డ్రోన్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. 2018-23 మధ్యకాలంలో యంత్రాలు రాకపోవడంతో రైతులకు ఇబ్బంది కలిగిందని చెప్పారు. తాజాగా రైతుల్లో అవగాహన పెంపొందించడానికి ప్రదర్శనలను ప్రభావవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులకు సీజన్‌ ప్రారంభంలోనే పనిముట్లను అందజేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ఈ ప్రదర్శనల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.


  • సోయా సేకరణలో తెలంగాణ టాప్‌

దేశవ్యాప్తంగా సోయా సేకరణలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సంప్రదాయ సోయా సాగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ను తెలంగాణ అధిగమించిందని తుమ్మల చెప్పారు. తెలంగాణలో 47 కేంద్రాల ద్వారా సోయా సేకరణ జరుగుతోందని, రూ.4892 మద్దతు ధర చెల్లిస్తూ, ఇప్పటికి 24,252 మెట్రిక్‌ టన్నుల సోయా చిక్కుడును సేకరించినట్లు తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 05:57 AM