TG NEWS: కలెక్టర్‌పై రాళ్లతో రైతుల దాడి
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:23 AM
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది. రైతులతో మాట్లాడేందుకు తమ వాహనాలు దిగి సమావేశం జరిగే స్థలానికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేకాధికారులకు వ్యతిరేకంగా గోబ్యాక్, డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేస్తూ దూసుకెళ్లారు.
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన జిల్లా కెలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి చేశారు. కలెక్టర్, అధికారుల కార్లపై మూకుమ్మడిగా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కలెక్టర్‌ను అధికారులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు పెన్‌డౌన్ చేస్తామని వికారాబాద్ జిల్లా అధికారులు ప్రకటించారు.
రణరంగంగా ప్రజాభిప్రాయ సమావేశం ..
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది. రైతులతో మాట్లాడేందుకు తమ వాహనాలు దిగి సమావేశం జరిగే స్థలానికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేకాధికారులకు వ్యతిరేకంగా గోబ్యాక్, డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేస్తూ దూసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ సహ అక్కడకు వచ్చిన అధికారులు.. మీ సమస్య, డిమాండ్లు చెప్పాలంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. అప్పటికీ అధికారులు సంయమనం కోల్పోకుండా రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా... సమావేశానికి వచ్చిన రైతులు, ప్రజలు ఆగ్రహంతో అధికారులపైకి దూసుకువచ్చారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలను ముందుకు తోస్తూ చాలా దురుసుగా వ్యవహరించారు. తమ ఎదురుగా ఉన్నది కలెక్టర్ అనీ కూడా చూడకుండా రణరంగం సృష్టించారు.
లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత
ఊహించని పరిణామానికి అధికారులు, వారి వెంట వచ్చిన సిబ్బంది హాహాకారాలు, రైతుల ఆగ్రహావేశాలు, దూషణలతో లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ చేపట్టేందుకు సోమవారం దుద్యాల మండలం, లగచర్లలో సమావేశం ఏర్పాటు చేశారు. భూములు కోల్పోతున్న పోలెపల్లి, హకీంపేట్, పులిచర్ల కుంట తండా, రోటిబండ తండా, లగచర్ల గ్రామాల రైతులు సమావేశాన్ని బహిష్కరించి.. నిరసనగా లగచర్లలోనే ఉండిపోయారు. సమావేశం ఏర్పాటు చేసిన స్థలం వద్దకు కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఇతర అధికారులు వెళ్లగా అక్కడ కొందరు రైతులు మాత్రమే ఉన్నారు. రైతులు ఎక్కడున్నారని అక్కడున్న వారిని ప్రశ్నించగా, రైతులందరూ లగచర్ల గ్రామంలో ఉన్నారు, అక్కడికి వచ్చి మాట్లాడాలంటూ లగచర్లకు చెందిన బోగమోని సురేశ్‌తో పాటు అక్కడున్న మరికొందరు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి లగచర్లకు వాహనాల్లో చేరుకున్నారు. అధికారులు వాహనాల్లో నుంచి దిగుతుండగానే అక్కడున్న రైతులు ఒక్కసారిగా కలెక్టర్ డౌన్, డౌన్, కలెక్టర్ గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగా, వినిపించుకోకుండా అధికారులపైకి దూసుకువచ్చారు. అధికారులు చెప్పేది వినిపించుకోకుండా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెంటనే అప్రమత్తమై కలెక్టర్‌ను చాకచక్యంగా అక్కడి నుంచి కారులో పంపించేశారు.
Updated Date - Nov 12 , 2024 | 02:26 PM