Share News

PCB Financial Loss CT: ఛాంపియన్స్ ట్రోఫీతో పాక్‌కు షాక్.. రూ.869 కోట్ల నష్టం

ABN , Publish Date - Mar 17 , 2025 | 09:44 PM

ఈసారి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ క్రికెట్ బోర్డుకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ట్రోఫీలో అవమానకర నిష్క్రమణకు తోడు టోర్నీ నిర్వహణ బోర్డుకు ఏకంగా రూ.869 కోట్ల నష్టం మిగిల్చిందట. దీంతో, క్రీడాకారుల ఫీజులో పీసీబీ 90 శాతం వరకూ కోత విధించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

PCB Financial Loss CT: ఛాంపియన్స్ ట్రోఫీతో పాక్‌కు షాక్.. రూ.869 కోట్ల నష్టం
Champions Trophy PCB Financial Loss

ఇంటర్నెట్ డెస్క్: పాక్ క్రికెట్ బోర్డు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. ఓవైపు జాతీయ జట్టు ఓటమి, మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం మిగిల్చిన భారీ అర్థిక నష్టంతో పీసీబీ పరిస్థితి తలకిందులైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఏర్పాట్లకు భారీగా ఖర్చు కాగా రాబడి మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో ఏకంగా 869 కోట్ల నష్టం వాటిల్లిందట.

ఛాంపియన్స్ ట్రోఫీ ఏర్పాట్లలో భాగంగా పీసీబీ మొత్తం మూడు స్టేడియంల్లో మ్యాచులు నిర్వహించింది. ఇందుకోసం రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియమ్‌లను మెరుగుపరిచేందుకు దాదాపు 58 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. వాస్తవానికి ఈ ఖర్చు 30 మిలియన్ డాలర్లలోపే ఉంటుందని పీసీబీ మొదట అంచనా వేసినా చివరకు మాత్రం ఖర్చులు మోపెడయ్యాయి. అయినా, తుదకు గిట్టుబాటు అవుతుందన్న అంచనాతో పీసీబీ ధైర్యంగా ముందడుగు వేసింది. స్టేడియంలు మెరుగుపరచడంతో పాటు ఇతర ఏర్పాట్లపై పీసీబీ మరో 40 మిలియన్ డాలర్ల వరకూ ఖర్చు చేసిందట. టోర్నీ హిట్ అయితే కాసుల పంట పడుతుందని భావించిందట. కానీ టోర్నీ చివరకు వచ్చే సరికి పాక్ ఆశలన్నీ గల్లంతయ్యాయి.


Also Read: కోహ్లీ, రోహిత్‌ కోసం కాదు..ఈ ముగ్గురు ముద్దుగుమ్మల కోసం కూడా ఐపీఎల్‌ చూసే వాళ్లు ఉన్నారని తెలుసా..

స్థానిక మీడియా కథనాల ప్రకారం, టోర్నీకి టిక్కెట్లు ఆశించిన మేరకు అమ్ముడు పోకపోవడంతో భారీగా నష్టం మిగిలిందట. దాదాపు 100 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెట్టిన ఆతిథ్య ఫీజు కింద 6 మిలియన్ డాలర్లు మినహా, ఇతర మార్గాల్లో ఆదాయం పెద్దగా వచ్చిందేమీ లేదట.

టోర్నీలో పాక్ జట్టు ఘోరంగా పరాజయం పాలై అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చిన విషయం తెలిసిందే. గ్రూప్ ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో లాహోర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ ఓటమి చవి చూసింది. ఆ తరువాత దుబాయ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ మ్యాచ్ వాష్ అవుట్ అయ్యింది. దీంతో, పాక్ టోర్నీ నుంచి అవమాన భారంతో తప్పుకోవాల్సి వచ్చింది.


Also Read: ఫ్యామిలీ ఉండాల్సిందే!

ఇలా అన్ని రకాలుగా నష్టపోవడంతో పీసీబీ చివరకు పలు కీలక మార్పులకు తెరతీసింది. జాతీయ టీ20 మ్యాచుల్లో క్రీడాకారులకు చెల్లించే ఫీజులో ఏకంగా 90 శాతం కోత విధించింది. ఇక రిజర్వ్ ప్లేయర్ల ఫీజులోనూ 87.5 శాతం కోత పెట్టింది. అయితే, పీసీబీ చైర్మన్ మాత్రం ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అధికారులకు సూచించారట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2025 | 09:44 PM