Share News

PRP Therapy Scam: పీఆర్‌పీ చికిత్స ఓ భారీ స్కామ్.. తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల ఫిర్యాదు..

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:44 PM

పీఆర్‌పీ చికిత్స ఓ స్కామ్ అని తెలంగాణకు చెందిన పలువురు ఆర్థొపెడిక్ సర్జన్లు స్పష్టం చేశారు. వైద్య ప్రయోజనాలు లేని పీఆర్‌పీని చికిత్సగా ప్రచారం చేయడం అనైతికమంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.

PRP Therapy Scam: పీఆర్‌పీ చికిత్స ఓ భారీ స్కామ్.. తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల ఫిర్యాదు..
PRT Treatment Arthritis TMC complaint

వైద్య ప్రయోజనాలు లేని పీఆర్‌పీ చికిత్సను రోగులకు సూచించడం అనైతికమని తెలంగాణకు చెందిన పలువురు వైద్యులు స్పష్టం చేశారు. ఇదో పెద్ద స్కామ్ అని తేల్చి చెప్పారు. ఈ విషయంపై దృష్టి సారించాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఆర్థొపెడిక్ సర్జన్లు తెలంగాణ వైద్య మండలికి ఫిర్యాదు చేశారు. ఒస్మానియా, గాంధీ, నిమ్స్ సహా పలు ఆసుపత్రులకు చెందిన సుమారు 75 మంది ఆర్థొపెడిక్ సర్జన్లు టీఎమ్‌సీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పీఆర్‌పీ చికిత్స ప్రభావం, రోగులకు దీన్ని సూచిస్తున్న వైనంపై తమకు ఫిర్యాదులు అందినట్టు టీఎమ్‌సీ చైర్మన్ డా.కే. మహేశ్ ధ్రువీకరించారు.

గత నాలుగైదు దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న పీఆర్‌పీ చికిత్స ప్రభావశీలతను రుజువు చేసే శాస్త్రపరమైన ఆధారాలేవీ లేవని వైద్యులు చెబుతున్నారు. పీఆర్‌పీ అనేది ప్లాసిబో మాత్రమేనని, దీనితో కార్టిలేజ్ కణజాలాన్ని పునరుత్పత్తి చేయడం సాధ్యం కాదని అన్నారు.


Also Read: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

పేషెంట్ల నుంచి సేకరించిన రక్తంతోనే పీఆర్‌పీ చికిత్స చేస్తారన్న విషయం తెలిసిందే. ఇందుకోసం రోగుల రక్తం నుంచి ప్లేట్‌లెట్స్ అనే కణాలను సేకరించి మళ్లీ రోగిలోని ప్రభావిత ప్రాంతంలో ఇంజెక్ట్ చేస్తారు. దీంతో, ఆ ప్రాంతంలో కణజాలం కోలుకుని, కొత్త కణజాలం పుట్టుకొచ్చి రోగి పరిస్థితి మెరుగవుతుందనేది ఈ చికిత్స వెనకున్న ప్రధాన భావన. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, కీళ్లనొప్పులకు చికిత్సగా పీఆర్‌పీని వినియోగిస్తుంటారు.


అయితే, అర్హతలు లేని కొందరు ఆర్థరైటిస్‌కు చికిత్సగా పీఆర్‌పీని అనైతిక రీతిలో రోగులకు సూచిస్తున్నారని ఆర్థొపెడిక్ సర్జన్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదో విప్లవాత్మక ఔషధంగా ప్రచారం కల్పిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలతో తప్పుదోవ పట్టించే యాడ్స్ ఇస్తున్నారని కూడా అన్నారు. ఇవన్నీ చూసి కొందరు రోగులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి మరీ పీఆర్‌పీ చేయించుకుంటున్నారని అన్నారు. చివరకు పరిస్థితి మరింతగా దిగజారి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 01:53 PM