Abn logo
Apr 8 2021 @ 17:00PM

మిథున్ చక్రవర్తి రోడ్‌షోకి అధికారులు నో... బీజేపీ ఫైర్!

కోల్‌కతా: బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్‌ షోకి కోల్‌కతా  అధికారులు అనుమతి నిరాకరించారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బెహలా ప్రాంతంలోని స్థానిక పోలీస్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపాయి. బెహలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేస్తున్న ప్రముఖ బెంగాలీ నటుడు శ్రబంతి చటర్జీ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. ‘‘నా తరపున ప్రచారం చేసేందుకు మా నాయకుడు మిథున్ చక్రవర్తికి కోల్‌కతా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందుకు ఎలాంటి కారణం కూడా చూపించలేదు...’’ అని శ్రబంతి చటర్జీ పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికల ప్రచారాన్ని అడ్డకున్నంత మాత్రాన ఓటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పించుకోలేదని ఆయన అన్నారు.


‘‘అధికారం కోల్పోతామని రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందా?..’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాగా బుధవారం రాత్రి బెహలా ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో... మిథున్ చక్రవర్తితో ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ అనుమతి కోరినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ‘‘చివరి నిమిషంలో ఇంటింటి ప్రచారానికి కూడా పోలీసులు అనుమతించలేదు...’’ అని బీజేపీ నేతలు ఆరోపించారు. చివరికి మిథున్ చక్రవర్తి లేకుండానే స్థానిక బీజేపీ అభ్యర్థి రోడ్‌షో నిర్వహించారు.  కాగా ఈ వ్యవహారంపై కోల్‌కతా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మరోవైపు మిథున్ చక్రవర్తి ఏ కార్యక్రమం చేపట్టినా మాకు అభ్యంతరం లేదనీ... బెహలా ప్రజల మద్దతు తమకే ఉందని అధికార టీఎంసీ నాయకుడొకరు పేర్కొన్నారు. బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. బెహలా నియోజకవర్గంలో రోడ్‌ షోకి అనుమతి లేకపోవడంతో... మిథున్ చక్రవర్తి చివరికి కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి బాబూలాల్ సుప్రియో నియోజవర్గం టాలీగంజ్‌లో రోడ్‌షో నిర్వహించారు. 




Advertisement
Advertisement