హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కార కేసులో జైలుశిక్షపడ్డ సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి. వెంకటరామిరెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, కొమరవెల్లి మల్లన్నసాగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)గా పనిచేసిన జయచందర్ రెడ్డిలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన పి. వెంకటరామిరెడ్డికి హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం మూడు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లకు రూ.25 వేలు నాలుగు వారాల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఆయన తర్వాత జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణ భాస్కర్‌కు (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్) రూ.2వేల జరిమానా విధించింది.
మల్లన్నసాగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన జయచందర్ రెడ్డికి నాలుగు నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. పిటిషనర్లకు కోర్టు ఖర్చుల కింద రూ.50వేలు నాలుగు వారాల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఈమేరకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలపై ముగ్గురు అధికారులు వేర్వేరుగా ధర్మాసనానికి అప్పీలు చేసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి విధించిన జరిమానా, కోర్టు ఖర్చులను రెండు వారాల్లోగా హైకోర్టులో జమచేయాలని స్పష్టం చేసింది..