Abn logo
May 16 2021 @ 00:00AM

అశ్వారావుపేట ఆపద్బాంధవులు

కొవిడ్‌, అనాథ మృతదేహాలకు అన్నీతామై  అంత్యక్రియల నిర్వహణ

వలస కూలీలకు అన్నదానం, రోగులకు రక్తదానం

ప్రశంసలందుకుంటున్న పవన్‌కల్యాణ్‌ సేవా సమితి

అశ్వారావుపేట, మే 16: ఆపద ఎక్కడ ఉంటే వారు అక్కడ ఉంటారు. విపత్తు ఎక్కడ సంభవిస్తే వారు అక్కడ ప్రత్యక్షమవుతారు. దైవం మనుష్య రూపేణా అనే నానుడిని నిజం చేస్తూ అన్నార్థులకు, అభాగ్యులకు మేమున్నామని మీకేం కాదని భరోసా ఇస్తున్నారు. అలాగని వారేమన్న ఆగర్భశ్రీమంతులా అంటే అదీ కాదు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ బతుకు బండిని లాగించేవారే. అయినప్పటికీ సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడుతూ మానవసేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నారు. వారే అశ్వారావుపేటకు చెందిన పవన్‌ కల్యాణ్‌ సేవా సమితి సభ్యులు. ఈ కరోనాకాలంలో పదుల కొద్దీ కొవిడ్‌ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. రోగుల కోసం రక్తదానాలు నిర్వహించారు. వలస కూలీలకు ఆహార పొట్లాల పంపిణీ, వారిని స్వగ్రామాలకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు నిత్యావసరాల అందజేత, ఆహారం పంపిణీ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేయని కార్యక్రమమంటూ లేదు.

వాట్సాప్‌లో మెసెజ్‌ పెడితే చాలు

అశ్వారావుపేటలో పవన్‌ కల్యాణ్‌సేవాసమితి అంటే తెలియని వారుండరు. సుమారు 500 మందితో కూడిన వాట్సాప్‌ గ్రూపులో సమాచారం ఇవ్వగానే సహాయం చేయడానికి క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమవుతారు. అశ్వారావుపేటలో ఇప్పటి వరకూ పదుల కొద్దీ కొవిడ్‌ మృతదేహాలకు, ఒక అనాధ శవానికి ఈ సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు చేసి మానవతను చాటుకున్నారు. 5వేలమందికి పైగా ఇప్పటి వరకు ఉచితంగా రక్తదానం చేశారు.

అశ్వారావుపేటకు చెందిన అంగకుల సత్యనారాయణ పాముకాటుతో అనారోగ్యంకు గురయ్యాడు. ఇతనికి వైద్యఖర్చుల నిమిత్తం రూ.50వేల నగదు, బస్తా బియ్యం, ఆసుపత్రికి వెళ్లడానికి కారును ఏర్పాటు చేసి మానవతీయతను చాటుకున్నారు.

బొల్లిబోయిన నవీన్‌ అనే యువకుడు వింత వ్యాధితో బాధపడుతుండటాన్ని గమనించి ఈ సంఘం ఆధ్వర్యంలో రూ. రెండు లక్షలను అందజేశారు.

గత ఏడాది కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో 120 మంది వలస కార్మికులకు 59 రోజుల పాటు ఉదయం అల్పాహారం, రెండు పూటల భోజనం దాతల సహకారంతో అందజేశారు. సంఘ సభ్యులు నిరంతరం వారందరకి సేవలు అందజేశారు. సరిహద్దులో ఆగిపోయిన అనేక మంది కూలీలకు అల్పాహారం అందజేశారు.

 సంస్థ ఆధ్వర్యంలో ప్రీజర్‌ బాక్సును ఏర్పాటు చేశారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు, కూరగాయలను అందజేశారు. 

పవన్‌కల్యాణ్‌ అభిమానిగా గ్రూపును ఏర్పాటు చేశాం

డేగల రాము, పవన్‌కల్యాణ్‌ సేవా సమితి మండల అధ్యక్షులు, అశ్వారావుపేట

ఈ గ్రూపులో ఉన్నవారికి ఒకరికి ఒకరితో సంబంధంలేదు. కేవలం పవన్‌కల్యాణ్‌ అభిమానిగా గ్రూపును ఏర్పాటు చేశాం. 500 మంది గ్రూపులో ఉన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా తక్షణం స్పందించడమే మా ప్రథమ కర్తవ్యం. గ్రూపులో సభ్యులు ఒక్కోక్కరు ఒక్కో సాయం చేస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకూ ఎన్నో కార్యక్రమాలు చేశాం. మా నుంచి సాయం పొందిన వారు కృతజ్ఞతలు చెబుతుంటే ఆనందం కలుగుతుంది.

Advertisement