Abn logo
Aug 13 2020 @ 01:53AM

మారింది జెండాయే... అజెండా కాదు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని అయోమయంలో ముంచెత్తడంలో బిజెపి నేతలు ఆరితేరారు. రాజధానిగా అమరావతే ఉండాలంటారు ఒకసారి కానీ... మూడు ముక్కలాటలో తాము చేయగలిగింది ఏమీలేదట. ఆంధ్రపదేశ్‌లో ఘనమైన స్థానానికి ఎదగాలనుకుంటున్న ఆ పార్టీ ఇలా చేస్తే ఏవిధంగా బలపడుతుంది? రాష్ట్ర విభజన నాడు చేసిన వాగ్దానాలను గంగలో కలిపి ఆంధ్రా ప్రజలను ఆ పార్టీ వంచిస్తోంది. ప్రత్యేక హోదా గురించి, వైజాగ్‌ రైల్వే డివిజన్‌ గురించి ఒక్క బిజెపి నాయకుడూ ప్రస్తావించడం లేదు. అమరావతి నిర్మాణంపై చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించారని, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడమంటే ప్రజధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపణలు గుప్పించిన బిజెపి నేతలు... నేడు అయోధ్యలో రామమందిర నిర్మాణం రూ. 300 కోట్లతో చేపట్టడానికి ముందుకెళ్తున్నారు.


ఒక దేవాలయానికే ఇంత ఖర్చు చేస్తుంటే నూతన రాజధానికి ఎంత ఖర్చువుతుందో వారే చెప్పాలి. రాజధానికి 33 వేల ఎకరాలను ధారాదత్తం చేసిన రైతుల దుస్థితి నేడు దయనీయంగా మారింది. రైతులకు అన్యాయం జరగనివ్వమని బిజెపి నేతలు చెబుతున్నా అందుకు తీసుకోబోయే చర్యలేమిటో, చేపట్టనున్న కార్యాచరణ ఏమిటో వారికే తెలియదు. నిజంగా రైతుల వెతలపట్ల వారికి అంత ప్రేమ ఉంటే ప్రధాని వద్దకు రైతుల్ని తీసుకెళ్ళి భరోసా కల్పించే యత్నాలు ఎందుకు చేయడం లేదు? ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళి ఉపశమన చర్యలు చేపడితే బిజెపిపై ప్రజలకు ఏర్పడిన అనుమానపు పొరలు తొలగిపోతాయి గదా! గాంధీ–నెహ్రూల విలువలకు తిలోదకాలిచ్చిన కాంగ్రెస్‌కు, శ్యాంప్రసాద్‌ ముఖర్జీ– - వీర సావర్కర్‌ త్యాగ నిరతిని పదేపదే గుర్తు చేస్తూ వారు నిర్మించిన దారిని విస్మరించిన బిజెపి విధానాలకు తేడా ఏమైనా ఉన్నదా? జెండాలు మారాయి గానీ అజెండాలు ఒక్కటే. కష్టకాలంలో ప్రజలవైపు నిలవనివారిని ప్రజలెలా నమ్ముతారు?

తాడేపల్లి శివరామకృష్ణారావు

Advertisement
Advertisement