కొత్తపట్నం ప్రాంతంలో దెబ్బతిన్న రొయ్యల చెరువు
కొంపముంచిన నాసిరకం సీడ్
రొయ్యల్లో ఎదుగుదల లోపం
ఇంకోవైపు వ్యాధుల బెడద
మధ్యలోనే చెరువులను తీసేస్తున్న రైతులు
ధరలు ఆశాజనకంగా ఉన్నా... ప్రతికూల వాతావరణం
నివర్ తుఫాన్‌తో కోలుకోలేని దెబ్బ
సాగుదారులకు భారీగా నష్టాలు
ఒంగోలు నగరం, డిసెంబర్ 4: ఆక్వా రైతును నాసిరకం సీడ్ ముంచింది. నెలల తరబడి చెరువుల్లో మేత వేస్తున్నా రొయ్య పిల్లల్లో పెరుగుదల ఉండటం లేదు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రొయ్యల సీడ్ నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న హేచరీల నుంచి ఎక్కువగా సీడ్ కొనుగోలు చేసి సాగు చేస్తుంటారు. కొంతమంది ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి పిల్లలను కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చి చెరువుల్లో వేస్తుంటారు. అయితే ఈ ఏడాది జిల్లాతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తెచ్చిన సీడ్ నాసిరకంగా ఉండటం రైతుల కొంపముంచింది. రొయ్యలు గిడసబారిపోతున్నాయి. పులి మీద పుట్రలా నివర్ తుఫాన్ దెబ్బతీసింది. భారీవర్షాలతో చెరువులు దెబ్బతిన్నాయి. దీనికితోడు వ్యాధులు, వైరస్లు కూడా వెంటాడుతుండటంతో రైతులు చెరువులను తీసేస్తున్నారు.
నాసిరకం రొయ్యల సీడ్‌తో జిల్లాలోని రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా చెరువుల్లో రొయ్యలు ఎదుగుదల లేక గిడసబారిపోయాయి. మూడు నెలల క్రితం ఒక్కో రొయ్య పిల్లను 25 పైసలు నుంచి 30పైసల దాకా కొనుగోలు చేసి తెచ్చి చెరువుల్లో వదిలారు. హేచరీల యజమానులు రైతులకు నాసిరకం సీడ్‌ను అంటగట్టారు. తగిన పరీక్షలు చేయకుండానే సీడ్‌ను అమ్మటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు ప్ర స్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేదు. నెల రోజులుగా వరుస వానలతో చలి వాతావరణం నెలకొంది. నివర్ తుఫాన్ కూడా చెరువులకు నష్టం కలి గించింది. వ్యాధుల పీడ అధికం కావటానికి కారణమైంది. దీంతో జిల్లాలో ఆక్వా రంగం నష్టాల బాటలో సాగుతోంది. చలి వాతావరణ నెలకొని చెరువుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. చెరువుల్లోని రొయ్యలు మేత సక్రమంగా తినటం లేదు. ఆరోగ్యంగా ఉన్న రొయ్యలు కూడా ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోలేకపోతున్నాయి. దీంతో ఎదుగుదల ఉండటం లేదు.
వెంటాడుతున్న వైట్‌గట్
జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వైట్‌గట్ వంటి వ్యాధులు రొయ్యలకు సోకుతున్నాయి. దీనిబారిన పడిన రొయ్యలు చచ్చి తేలుతున్నాయి. ఒకవైపు ఎదుగుదల లేకపోవటం, మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించక వ్యాధుల బారినపడి చెరువులు దెబ్బతినటంతో ఆక్వారైతు కుదేలవుతున్నాడు. ఏటా రై తులు శీతాకాలపు పంటపైనే ఆశలు పెట్టుకుంటారు. డిసెంబర్లో యూరోపియన్ దేశాల్లో క్రిస్మస్ వంటి పండుగులను వైభవం గా జరుపుకొంటారు కాబట్టి రొయ్యలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ఇక్కడి వ్యాపారులు నవంబర్, డిసెంబర్ మొదటివారంలో రొయ్యలను అధిక ధరలు పెట్టి కొనుగోలు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ రోజుల్లో ధరలు ఆశాజనంగా ఉంటాయి.
ఆశాజనకంగా ధరలున్నా..
ప్రస్తుతం రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ సాగు మా త్రం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. చెరువుల్లో రొయ్య పిల్లలు వదిలి మూడు నెలలు, నాలుగు నెలలు కావస్తున్నా 100కౌంటు కూడా రావటం లేదు. సాధారణంగా రైతులు ఈ ప్రాంతంలో 60 కౌంటులోనే రొయ్యలను తీసి అమ్ముతుంటారు. మూడు నెలలకే 60 కౌంటు వచ్చే చెరువులు ప్రస్తుతం నాలుగు నెలలు అవుతున్నా రావటం లేదు. దీంతో రైతులు దక్కిన కాడి కే అనుకుంటూ చెరువులను మధ్యలోనే తీసేస్తున్నారు. ఎకరా చెరువుకు లక్ష వంతున పిల్లలు వదిలి సాగు చేస్తున్న రైతులకు ఇప్పటివరకు రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఫీడ్, మందులు, కరెంటు బిల్లులు, కూలీలు ఖర్చు కలుపుకుని రూ.3లక్షలు దాటుతుండగా రొయ్యలు అమ్ముకుంటే రూ.2లక్షలకు మించి రావటం లేదు. దీంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు.
3వేల హెక్టార్లలో సాగు
జిల్లాలో శీతాకాలం పంట మూడు వేల హెక్టార్లలో సాగు చేశారు. అన్ని ప్రాంతాల్లో ఒకే పరిస్థితి, రొయ్యల్లో ఎదుగుదల ఉండటం లేదు. మూడు నెలలు పెంచితే 13 గ్రాముల బరువు రావాల్సిన రొయ్య ప్రస్తుతం ఆరు గ్రాములు మాత్రమే ఉంటోంది. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫీడ్ ధరలు, కరెంటు బిల్లులు, కూలీల ఖర్చులు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు నాణ్యమైన సీడ్ అందేలా చూడాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.