Abn logo
Feb 3 2020 @ 18:22PM

డబ్ల్యుటిఓకు తిలోదకాలు!

స్వేచ్ఛా వాణిజ్యం చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతికి చోదక శక్తి అయితే , అన్ని దేశాలకూ దిగుమతి సుంకాలను చైనా ఎందుకు తగ్గించదు? ‘భారత్ ఇప్పటికే ఆసియాన్, ఇరుగు పొరుగు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నది. డబ్ల్యుటిఓ నుంచి భారత్ వైదొలిగిన పక్షంలో వాణిజ్యం, పెట్టుబడుల రంగాలలో మన దేశానికి ఎటువంటి హాని జరగదని’ ఒక ఆర్థికవేత్త సహేతుకంగానే నొక్కి చెప్పారు.

 

చైనా ఆర్థికవ్యవస్థ పెరుగుదలకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) చేస్తున్న దోహదమేమిటి? చైనాకు అటువంటి తోడ్పాటు అవసరం లేదని బీజింగ్, వాషింగ్టన్‌‍ల మధ్య ఇటీవల కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సూచించింది. అమెరికా నుంచి మరిన్ని సరుకులను దిగుమతి చేసుకోవడానికి చైనా అంగీకరించింది. ఇటీవలి వాణిజ్య సమరంలో చైనాపై విధించిన శిక్షాత్మక దిగుమతి సుంకాలను తగ్గించడానికి అమెరికా అంగీకరించింది.

 

మన ప్రశ్న ఏమిటంటే అమెరికా, చైనాలు డబ్ల్యుటిఓ వెలుపల ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకున్నాయి? డబ్ల్యుటిఓ కింద ఒప్పందం సభ్య దేశాలన్నిటికీ వర్తిస్తుందనే విషయాన్ని మనం మరచిపోకూడదు. ఆ మేరకు, ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం సోయా బీన్‌పై దిగుమతి సుంకాన్ని చైనా తగ్గిస్తే భారతీయ ఎగుమతి దారులు కూడా లబ్ధి పొందుతారు. ఇందుకు భిన్నంగా ద్వైపాక్షిక ఒప్పందం కింద అయితే అమెరికా ఎగుమతిదారులు మాత్రమే లబ్ధిపొందుతారు.

 

స్వేచ్ఛా వాణిజ్యం చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతికి చోదక శక్తి అయితే, అన్ని దేశాలకూ దిగుమతి సుంకాలను చైనా ఎందుకు తగ్గించదు? అమెరికా, చైనాలు రెండూ డబ్ల్యుటిఓ ప్రయోజనకర ఒప్పందం కాదనే నిర్ణయానికి రాలేదని దీన్ని బట్టి భావించాలి. ఆ రెండు దేశాలూ తమ స్వేచ్ఛా వాణిజ్యాన్ని తమ నిర్దిష్ట ద్వైపాక్షిక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం చేసాయి. జయశ్రీ సేన్ గుప్తా (న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫెలో) ఇలా రాసారు: ‘భారత్ ఇప్పటికే ఆసియాన్, ఇరుగు పొరుగు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నది. డబ్ల్యుటిఓ నుంచి భారత్ వైదొలిగిన పక్షంలో వాణిజ్యం, పెట్టుబడుల రంగాలలో మన దేశానికి ఎటువంటి హాని జరగదు’. ఎందుకని? కారణాలు వివరిస్తాను.

 

మన వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు ముఖ్యంగా చిన్న తరహా, మధ్య తరహా కంపెనీలకు సంరక్షణ సమకూర్చుకునే సామర్థ్యం మనకు వున్నది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రక్షణ వల్ల ఉద్యోగాలు సృష్టి అవుతాయి. మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. మన ప్రజలకు నేడు చైనా ఉత్పత్తి చేసిన చౌక వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ చౌక వస్తువులను కొనడానికి డబ్బులు ఉండాలి గదా. పైసలు కావాలంటే ఉద్యోగాలు, ఆదాయాలు ఉండాలి. ఇవే మన ప్రజలకు లేవు: కనుక వారు దుకాణాల కిటికీలలో ఉంచిన వస్తువులను చూస్తూ సంతృప్తి పడవలసిందే. రెండో కారణం ప్రస్తుత పేటెంట్ల చట్టాన్ని మనం రద్దుచేయగలం.

 

విదేశీ సంస్థలు సృజించిన వస్తువుల తరహా వస్తువులను ఉత్పత్తి చేసేందుకు మనం మన వ్యాపార సంస్థలను అనుమతించగలం. దీని వల్ల భారీ పెట్టుబడులకు, అభివృద్ధికి ఆస్కారమేర్పడుతుంది. గతంలో మన ఫార్మా సంస్థలు ఇదే వ్యూహాన్ని అనుసరించి ప్రపంచ అగ్రగాములయ్యాయి. అయితే ఆ తర్వాత, డబ్ల్యుటిఓ పుణ్యంతో అవి తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ఇప్పుడు అసాధ్యమయినది అప్పుడెలా సాధ్యమయింది? అప్పట్లో అమలులో ఉన్న మన పేటెంట్ చట్టం అందుకు దోహదం చేసింది ఎలా? పేటెంట్ హక్కులు గత విదేశీ సంస్థల ఉత్పత్తులను, ఆ హక్కుదారులు తయారీచేసే పద్ధతిన కాకుండా వేరే పద్ధతిలో తయారు చేయడం ద్వారా పేటెంట్ ఆంక్షలను మన పారిశ్రామిక వేత్తలు చట్టబద్ధంగా అధిగమించగలిగారు. మూడో కారణం మనం మన పర్యావరణాన్ని రక్షించుకోగలం.

 

పర్యావరణ రక్షణ పేరిట డబ్ల్యుటిఓ తన నియమాలకు విరుద్ధమైన చర్యలను ప్రకటించిన అప్రతిష్ఠాకర చరిత్ర ఆ సంస్థకు ఉన్నది. అమెరికా స్వ‍చ్ఛతా వాయు చట్టం, అంతరిస్తున్న జీవ జాతుల చట్టం డబ్ల్యుటిఓ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆ సంస్థ గతంలో ప్రకటించింది. చైనా చౌక దిగుమతుల నుంచి మన పరిశ్రమలు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడికి ఒక ప్రధాన కారణం బీజింగ్ పాలకులు తమ పరిశ్రమలు వాయు, నీటి కాలుష్యానికి పాల్పడేందుకు అనుమతించడమే. దీనివల్ల చైనీస్ కంపెనీల ఉత్పత్తి వ్యయాలు తక్కువ స్థాయిలో వుంటున్నాయి. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడం ద్వారా చౌక వస్తువులను ఉత్పత్తి చేస్తున్న చైనాను, ఆ చౌక వస్తువులపై దిగుమతి సుంకాలను పెంపొందించడం ద్వారా సమర్థంగాఎదుర్కోవచ్చు.

 

ఇలా మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వారి ఆదాయాలను పెంపొందించడం సాధ్యమవుతుంది. నాలుగో కారణం రాబోయే దశాబ్దాలలో ప్రపంచ వాణిజ్యం మరింతగా సేవల వాణిజ్యం దిశగా సాగను న్నది. సేవల రంగంలో మన దేశం అగ్రగామిగా వున్నది. సేవల ఎగుమతులు డబ్ల్యుటిఓ పరిధిలోకి రావు. కనుక మన అంతర్జాతీయ వాణిజ్యం ఏ విధంగాను ప్రతికూలంగా ప్రభావితం కాదు. మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గతంలో మన ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వ అధికార యంత్రాంగం పలు అవస్థల పాలుచేసింది. బ్యూరోక్రాట్ బాబులు మళ్ళీ ఆర్థిక వ్యవస్థపై పెత్తనం చెలాయించే పాలనా పద్ధతులకు తిరిగి వెళ్ళలేం. అలాగే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి స్వస్తి చెప్పి తీరాలి. దేశీయంగా పోటీని పెంపొందించాలి. మన వ్యాపార సంస్థలు మరింత సామర్థ్యంతో వ్యవహరించేలా చేసేందుకు అవసరమైతే పరిమిత దిగుమతులను అనుమతించాలి.

 

అధునాతన సాంకేతికతలను మన దేశీయ కంపెనీలు కొనుగోలు చేసేందుకు మన దేశీయ కంపెనీలకు ప్రభుత్వం తగు ఆర్థిక సహాయమందించాలి. మన పరిశ్రమలకు సంరక్షణ సమకూరుస్తూనే ప్రపంచ స్థాయిలో అగ్రగాములుగా పోటీపడేందుకు ప్రయత్నించాలి. ఈ బాధ్యతను మన ప్రభుత్వం సమర్థంగా నిర్వహించగలదనే నమ్మకం నాకు వున్నది. ఇక మన దేశీయ సంస్థలు తమ లాభాలను విదేశాలలో కాకుండా దేశంలోనే మదుపు చేసేందుకు వీలైన చర్యలను చేపట్టాలి. విదేశీ పెట్టుబడుల రూపేణా మనం పొందుతున్న నిధులు, మన దేశం నుంచి చట్టబద్ధంగాను, అక్రమంగాను విదేశీలకు తరలిపోతున్న నిధుల కంటే తక్కువ. విదేశీ మదుపుదారులకోసం పరుగులెత్తకుండా దేశీయ పారిశ్రామిక వేత్తలను అన్ని విధాల ప్రోత్సహించడానికి ప్రాధాన్యమివ్వాలి. 

భరత్ ఝున్‌ఝున్‌వాలా

-(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)


Advertisement
Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...