తొలిరోజే చింత..!

ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST

chintha item

తొలిరోజే  చింత..!

‘పురం’ మార్కెట్‌లో చింతపండు విక్రయాలు ప్రారంభం

మొదటిరోజే ధరలు పతనం

ఇంకా తగ్గుతాయేమోనని అన్నదాతల్లో ఆందోళన

హిందూపురం, జనవరి 27: చింత రైతుకు హిందూపురం మార్కెట్‌లో తొలిరోజే నిరాశ ఎదురైంది. గురువారం వ్యవసాయ మార్కెట్‌లో చింతపండు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు కర్ణాటక నుంచి మార్కెట్‌కు 501 క్వింటాళ్ల కొత్తచింతపండును రైతులు తీసుకొచ్చారు. మార్కెట్‌లో గురువారం మేలిరకం కర్ఫూలీ గరిష్టంగా క్వింటాల్‌ రూ.22500, కనిష్టంగా రూ.9000, సగటున రూ.9000 పలకగా.. ఫ్లవర్‌ రకం గరిష్టంగా రూ.9990, సగటున రూ.7000, కనిష్టంగా రూ.4100 పలికింది. ఇందులో ఫ్లవర్‌ అత్యధికంగా క్వింటాల్‌ రూ.6500 నుంచి రూ.7000 మధ్య పలికింది. హిందూపురం మార్కెట్‌లో మేలిరకం కర్ఫూలీ కూడా అధికంగా క్వింటాల్‌ రూ.9000 నుంచి రూ.15000 మధ్యనే ధర పలికినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది సీజన ప్రారంభంలోనే మేలిరకం కర్ఫూలీ క్వింటాల్‌ గరిష్టంగా రూ.31000, సగటున రూ.21000 కనిష్టంగా రూ.7000 వరకు ధరలు పలికాయి. ఫ్లవర్‌ కూడా క్వింటాల్‌ గరిష్టంగా రూ.26000, సగటున రూ.11000, కనిష్టంగా రూ.6000దాకా పలికింది. గత సీజన కంటే ధరలు తక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందాల్సివస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఫిబ్రవరి, మార్చిలో వేలాది టన్నుల పండు రానున్న నేపథ్యంలో ధరలు ఎలా ఉంటాయో అని రైతులు, చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈసారీ సీజనలో ధరలు ఆశాజనంగా ఉంటాయని కొత్తపండును మార్కెట్‌కు తీసుకొస్తే తొలి మార్కెట్‌లోనే నిరాశపరిచిందని కనీసం పెట్టుబడి, కూలీల ఖర్చులు కూడా లభించవని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో చింతపండు ఈ-నామ్‌ ద్వారానే కొనుగోలు చేయాలని మార్కెట్‌ అధికారులు, పాలకవర్గం ఆర్భాట ప్రకటన చేసినా.. ప్రారంభంలోనే కమీషన ఏజెం ట్లు అంతా చేతి వేలం ద్వారానే కొనుగోలు చేశారు. అనంతరం ఈ-నామ్‌లో చేసినట్లు నమోదు చేయడం మార్కెట్‌ అధికారుల పర్యవేక్షణకు అద్దం పట్టింది. గతేడాది చింతపండు శీతల గిడ్డంగుల్లో ఇంకా నిల్వ ఉండటం వల్లే కొత్తపండుకు మార్కెట్‌లో ధరలు పెరగలేదని ట్రేడర్‌ వర్గాలు చెబుతున్నాయి.


Updated Date - 2022-01-27T05:30:00+05:30 IST