ప్రతిష్టాత్మకంగా దళితబంధు

ABN , First Publish Date - 2022-01-28T04:59:21+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రఆర్థిక, వైద్యఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు

ప్రతిష్టాత్మకంగా దళితబంధు
దళితబంధు అమలుపై ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

ఫిబ్రవరి మొదటివారంలో వంద మంది లబ్ధిదారుల ఎంపిక 

మార్చి 5 వరకు గ్రౌండింగ్‌ పూర్తవ్వాలి

లబ్దిదారుల ఖాతాల్లోకి  నేరుగా రూ.9.90లక్షలు జమ

మిగతా రూ. 10 వేలు దళిత రక్షణ నిధికి

దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్‌ కృషి

ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దళితబంధు అమలుపై సమీక్ష


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి/మెదక్‌రూరల్‌/నర్సాపూర్‌ జనవరి27: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రఆర్థిక, వైద్యఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ అరణ్యభవన్‌లోని తన కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలన్నారు. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగానే దళితబంధు ప్రత్యేక బ్యాంకుఖాతాలు తెరవాలని ఆయన సూచించారు. మార్చి5లోగా ఈ పథకం అమలుకోసం  ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే రూ.10లక్షల్లో గరిష్టంగా మూడు యూనిట్లు పెట్టుకునే అవకాశమున్నదన్నారు. ఒకరు లేదా, ఇద్దరు, లేదా ముగ్గురు కలిసి ఒకే యూనిట్‌ పెట్టుకునే అవకాశము కూడా ఉన్నదన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.9.9లక్షలు వెళ్తాయని, మిగిలిన పదివేలకు తోడు ప్రభుత్వం మరో పదివేలు కలిపి దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో లబ్ధిదారులు నష్టపోతే కలెక్టర్ల వద్ద ఉండే దళిత రక్షణ నిధి అందుబాటులో ఉంటుందన్నారు. దళితబంధులో లబ్ధిదారుల మొదలుకుని వారు తమ ఇష్టమైన యూనిట్‌ను ఎంచుకునే వరకు శాసనసభ్యులు, అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. 


లబ్ధిదారులకు ‘డబుల్‌’ ఇళ్లు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సమావేశంలో మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను వెంటనే అర్హులకు అందజేయాలన్నారు. మౌలిక వసతులు అన్ని ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూంలను పొందిన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మెదక్‌- సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైన భూసేకరణ పనులు  వెంటనే  పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. వీలైనంత త్వరగా టెండర్‌ ప్రక్రియకు వెళ్లాలని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌ రెడ్డి, క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, సతీ్‌షకుమార్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల కలెక్టర్లు హన్మంతరావు, హరీశ్‌, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, రమేష్‌, విజయలక్ష్మి, డీఎ్‌సవోశ్రీనివాస్‌, ఆర్డీవో శ్యాం ప్రకాష్‌, మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. 


నర్సాపూర్‌ మున్సిపల్‌పై సమీక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండేళ్ల క్రితం మంజూరు చేసిన రూ.25కోట్లతో నర్సాపూర్‌లో చేపట్టాల్సిన సమీకృతమార్కెట్‌, మున్సిపల్‌భవనం, డంప్‌యార్డు తదితర పనుల గురించి చర్చించారు. వీటిని త్వరగా ప్రారంభించాలని సూచించారు. మున్సిపల్‌ భవనాన్ని నీటిపారుదలశాఖ కార్యాలయ సమీపంలోనే నిర్మించాలని అందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.  సమావేశానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, కమిషనర్‌ చాముండేశ్వరీ తదితరులు హాజరయ్యారు. అయితే మున్సిపల్‌చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.


================================================================================================================================================================================================

Updated Date - 2022-01-28T04:59:21+05:30 IST