ఇప్పటికి పన్నెండేళ్లు..!

ABN , First Publish Date - 2021-10-19T05:53:53+05:30 IST

పట్టణ సుందరీకరణ, కాలుష్య నివారణ లక్ష్యంగా భూగర్భ డైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికి పన్నెండేళ్లు..!

  1. పూర్తిగాని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
  2. ఏళ్లతరబడి కొనసాగుతున్న పనులు
  3. కరిగిపోయిన రూ.44 కోట్ల నిధులు
  4. ధ్వంసమవుతున్న మ్యాన్‌ హోల్స్‌
  5. పూడిపోతున్న భూగర్భంలోని పైపులైన్లు


ఎమ్మిగనూరు, అక్టోబరు 18: పట్టణ సుందరీకరణ, కాలుష్య నివారణ లక్ష్యంగా భూగర్భ డైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2036 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేశారు. రూ.కోట్లు కుమ్మరించారు. కానీ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఫలితంగా ప్రజాధనం వృథా అయింది. లక్ష్యం నెరవేరలేదు. ఇది ఎమ్మిగనూరు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కథ. 2009 ఫిబ్రవరిలో రూ.44 కోట్లతో ఎమ్మిగనూరు పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టారు. రాంకీ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. పనులను నిర్మల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థకు అప్పగించింది. కాంట్రాక్టరు రెండేళ్లలోపు పనులను పూర్తిచేయాల్సి ఉంది. గడువు దాటి దశాబ్దం గడిచింది. ఇప్పటికీ పూర్తికాలేదు. ప్రభుత్వం పలుమార్లు గడువును పొడిగించింది. పన్నెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. 


ఎంతవరకు వచ్చింది..?


భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలో భాగంగా పట్టణంలో 128 కిలోమీటర్ల పైపులైన్‌ వేయాల్సి ఉంది. ఈ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. 772 మ్యాన్‌ హోల్స్‌ పనులు దాదాపు పూర్తికాచ్చాయి. కొన్నిచోట్ల మాత్రమే చేయాల్సి ఉంది. 9,900 అంతర్గత ఛానెల్స్‌లో 8,700 పూర్తి చేశారు. సోగనూరు గ్రామ సమీపంలో ట్యాంకు మాత్రమే ఏర్పాటు చేశారు. 


కొన్ని ప్రాంతాల్లో మెయిన్‌ ట్రంక్‌ పనులు, ఇంటర్‌ కనెక్షన్‌, రోడ్డు రెస్టోరేషన్‌ పనులు (ప్యాచ్‌వర్క్‌లు), ఎస్‌టీపీ (సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ పనులు) పూర్తి చేయాల్సి ఉంది. ఎస్‌టీపీలో బండ్‌ పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. ఎస్టీపీ ట్యాంకులో ట్రిట్‌మెంట్‌ ప్లాంటు, ట్యాంకు, విద్యుత్‌ కనెక్షన్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. 


నాణ్యతకు తిలోదకాలు


ఇప్పటి వరకు జరిగిన పనుల్లో నాణ్యత పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. భూగర్భంలో ఏర్పాటు చేసిన పైపులను వరుస క్రమంలో పొందుపరచడంలోను, అడుగు భాగాన ఇసుక వేయడంలోను ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఛాంబర్లు నాసిరకంగా నిర్మించారు. క్యూరింగ్‌ లేకపోవడంతో పనులు పూర్తి కాక ముందే పూడిపోయాయి. మరి కొన్నిచోట్ల పగిలిపోయాయి. పట్టణంలో చాలా చోట్ల మ్యాన్‌హోల్స్‌ పూడిపోయాయి, ధ్వంసమయ్యాయి. వర్షాలకు పైపులైన్లలో నీరు చేరిందని, మట్టి పేరుకపోయి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్‌ నుంచి రోడ్లపైకి, ఇళ్లలోకి నీరు వస్తోందని పట్టణవాసులు వాపోతున్నారు. సోగనూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, ట్యాంకులకు వేసిన మట్టి కిందకు జరిగిపోతోంది. లోపలి భాగంలో వేసిన బండపరుపు ధ్వంసమౌతోంది.


శివారు కాలనీ శివన్న నగర్‌లో 50కి పైగా మ్యాన్‌హోల్స్‌ ధ్వంసమయ్యాయని కౌన్సిల్‌ మీటింగ్‌లో టీడీపీ కౌన్సిలర్‌ దయాసాగర్‌ ఆరోపించారు. పనులను ఎప్పుడు పూర్తిచేస్తారని ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం లేకపోయింది. ప్రజాప్రతినిధులు మాత్రం త్వరలో పూర్తిచేయిస్తామని అంటున్నారు. 


రూ.కోట్లు కరిగిపోయాయి..


అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రూ.44 కోట్లు కేటాయించారు. ఇందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 10 శాతం మున్సిపాలిటీ భరించాల్సి ఉంది. మిగిలిన 80 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చింది. పన్నెండేళ్ల క్రితం ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోయినా, నిధులు మాత్రం ఖర్చు అయిపోయాయి. 


ఇబ్బంది పడుతున్నాం 


మా కాలనీలో రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు. అండర్‌గ్రౌండ్‌ పైపులైన్‌ మాత్రం వేశారు. అవి కనిపించకుండా పోయాయి. వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లముందే నిలిచిపోతోంది. ఇబ్బంది పడుతున్నాము. 


- శిరీష, శివన్ననగర్‌


ప్రభుత్వ నిర్లక్ష్యమే..


రూ.కోట్లుపెట్టి యూజీడీ పనులు చేపట్టారు. పనులు పూర్తిచేసే విషయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. పనులు పూర్తి అయిన ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్‌ పగిలిపోయాయి. పైపుల్లో మట్టిపేరుకుపోయింది.


- రాముడు, సీపీఎం, ఎమ్మిగనూరు 


త్వరలో పూర్తి చేస్తాం..


యూజీడీ పనులలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పనులు పూర్తికావటం ఆలస్యమైంది. త్వరలో పనులు పూర్తి చేస్తాము. 


- వెంకటేశ్వర్లు, డీఈ, ఎమ్మిగనూరు 

Updated Date - 2021-10-19T05:53:53+05:30 IST