ఊరి బడికి ఎసరు

ABN , First Publish Date - 2022-01-28T05:52:50+05:30 IST

స్కూళ్ల విలీనం మీటర్లు.. కిలోమీటర్లు లెక్కన పెరుగుతూ పోయి.. ఆఖరుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉనికే లే కుండా చేస్తోంది.

ఊరి బడికి ఎసరు

విలీనం పేరిట మూసివేసే ఎత్తుగడ

ప్రమాదంలో ప్రాథమిక,

 ప్రాథమికోన్నత పాఠశాలల ఉనికి

జాబితాలో జిల్లాలోని వేలాది పాఠశాలలు

భగ్గుమంటున్న ఉపాధ్యాయులు

ఉద్యమబాట తప్పదని హెచ్చరిక

అనంతపురం విద్య, జనవరి 27: స్కూళ్ల విలీనం మీటర్లు.. కిలోమీటర్లు లెక్కన పెరుగుతూ పోయి.. ఆఖరుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉనికే లే కుండా చేస్తోంది. ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలు మాటున ఊరి బడులుగా పేరుగాంచిన పాఠశాలలను మూసేసే దిశగా అడుగులు వేస్తోంది. గుట్టుగా పావులు కదుపుతోంది. ఈ కారణంగా జిల్లాలో వేలాది పాఠశాలలు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై ఉపాధ్యాయులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. విలీన ప్రక్రియను 250 మీటర్ల పరిధిలోని స్కూళ్లతో మొదలు పెట్టారు. ఆ తరువాత 1, 2, 3 కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లను దాటి అన్ని ప్రైమరీ, యూపీ స్కూళ్లను విలీనం  చేయాలని చూస్తున్నారు. సంస్కరణల పేరుతో సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇప్పటికే రివర్స్‌ పీఆర్సీపై తీవ్ర అసహనంతో ఉన్న ఉపాధ్యాయులు.. త్వరలో  విలీనంపై కూడా ఉద్యమబాట పట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలకు ఎసరు పెట్టిన ప్రభుత్వం, తాజాగా ప్రాథమికోన్నత పాఠశాలలను కూడా విలీనం పేరిట మూసివేసేందుకు పావులు కదుపుతోంది. క్షేత్రస్థాయిలో శాటిలైట్‌ స్కూళ్లు, హైస్కూళ్లు మాత్ర మే ఉంచి, మిగిలిన వాటిని మూసివేసేందుకు సర్కారు చాపకింద నీరులా కసరత్తు ప్రారంభించినట్లు ఉపాధ్యాయవర్గాల్లో చర్చ సాగుతోంది.


‘ప్రైమరీ’పై పిడుగు...

పల్లెలు, గ్రామాల్లో ఊరి బడిని మించిందిలేదు. పిల్లలు ఆఖరి బెల్‌ కొట్టేలోపు ఇంటి గుమ్మం నుంచి స్కూల్‌ గేట్‌లో ఉండొచ్చు. కారణం ఊరి పిల్లలకు అంత దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఇకపై ఇలాంటి ఊరి బడులు గ్రామాల్లో కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరు చెప్పి, వీటిని దగ్గర్లోని ఉన్నత పాఠశాలల్లో విలీనానికి శ్రీకారం చుట్టింది. హైస్కూల్‌కు 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రైమరీ స్కూళ్లను విలీనం చేసేందుకు వి ద్యాశాఖ ఉన్నతాధికారులు  ఆరంభంలో నే పావులు కదపడంతో పెద్ద వ్యతిరేకత వచ్చింది. దీం తో వెనక్కు తగ్గినట్టే తగ్గి... ఆ దూరాన్ని... 250 మీటర్లకు తగ్గించారు. 250 మీటర్ల పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని ప్రకటించారు. గతేడా ది జరిగిన 250 మీటర్ల పరిధిలోని ప్రైమరీ స్కూళ్ల విలీనంతోనే జిల్లావ్యాప్తంగా ఏకంగా 300 పైచిలుకు ప్రైమరీ స్కూళ్లను విలీనం చేశారు. గతేడాది చివర్లో విలీనం చేసే దూరాన్ని 1 కిలోమీటరుకు, తర్వాత 2, ఆ తర్వాత 3 కిలోమీటర్లకు పెం చుతూ... లోగుట్టుగా ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు కిలోమీటర్ల ప్రస్తావనే లేకుండా స్కూళ్ల విలీనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనకు బలం చేకూరుస్తూ... హైస్కూల్‌కు 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రైమరీ స్కూళ్ల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు.. ప్రధానోపాధ్యాయుల నుంచి సేకరిస్తున్నారు. ఇలా 3 కిలోమీటర్ల పరిధిలో సుమారు 1,674 స్కూళ్లు గుర్తించినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. కిలోమీటర్ల ప్రస్తావనే లేకుండా హైస్కూళ్లకు దగ్గరలోని అన్ని స్కూళ్లను అందులో విలీనం చేయాలన్న యోచనతో ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.


గండం తప్పదా..?

ఇన్నాళ్లు ప్రైమరీ స్కూళ్లకు మాత్రమే గండం అనుకుంటున్న తరుణంలో ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. ప్రైమరీ స్కూళ్లతోపాటు, యూపీ స్కూళ్లపై కూడా ప్రభుత్వం కన్నేసినట్లు సమాచారం. హైస్కూల్‌కు దగ్గరలోని యూపీ స్కూళ్లను సైతం మెర్జ్‌ (విలీనం) చేయాలని చూస్తున్నట్లు విద్యాశాఖ, ఉపాధ్యాయవర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రైమరీ, యూపీ స్కూళ్ల సమాచారం సేకరించే పనిలో జిల్లా విద్యాశాఖ బిజీగా ఉంది. ఈ ప్రక్రియపై విద్యాశాఖ వేగం పెంచింది. ఇటీవల ఈనెల 20వ తేదీ సైతం అన్ని యాజమాన్య స్కూళ్ల ప్రధానోపాధ్యాయులతోపాటు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలతో ఈ స్కూళ్ల విలీనంపై జిల్లాకేంద్రంలో సమావేశం కూడా పెట్టారు. రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్యేలకు సైతం వర్క్‌షాప్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది.


పసిపిల్లలకు ప్రాణ సంకటమే !

ఊరి బడి ఇక మరుగునపడనుందనడంలో సందేహం లేదు. ప్రైమరీలోని 3, 4, 5 క్లాసులు సైతం విలీనం చేసిన హైస్కూళ్లలో ఉండనున్నాయి. ఆ స్కూల్‌కు వెళ్లాలంటే... ఇక పిల్లలకు ప్రాణసంకటమనే చెప్పాలి. గతంలో 250 మీటర్ల పరిధిలోని స్కూళ్ల విలీనం చేసే క్రమంలో నదులు, వంకలు, వాగులు, బావులు, జాతీయ రహదారులు ఎక్కడెక్కడ పిల్లలు దాటాల్సి వస్తుందో ఆరా తీసి, అలాంటి పరిస్థితులున్న స్కూళ్లకు కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. విలీనం చేసే క్రమంలో అలాంటి పరిస్థితులు ఏం లేవు అన్నట్టు చెప్పాలంటూ... ప్రధానోపాధ్యాయులపై సైతం విద్యాశాఖాధిరులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 2,787 వరకూ ప్రైమరీ స్కూళ్లు, మరో 470 వరకూ యూపీ స్కూళ్లున్నాయి. కిలోమీటర్ల ప్రస్తావన లేకుండా విలీనం చేస్తే మాత్రం వీటిలో వేలాది స్కూళ్లు కనుమరుగుకానున్నాయనడంలో సందేహం లేదు. ఇదే గనుక జరిగే... స్కూల్‌కు వెళ్లాంటే... పిల్లలు రహదారులు, వాగులు, వంకలు దాటి కిలోమీటర్ల కొద్దీ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. విలీనంపై, ప్రభుత్వం, విద్యాశాఖ నిర్ణయాలపై ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.



కసరత్తు వాస్తవమే.. 

స్కూళ్ల మెర్జింగ్‌పై కసరత్తు జరుగతున్న మాట వాస్తవమే. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి అవుతుందనుకుంటున్నాం. యూపీ స్కూళ్లను మెర్జ్‌ చేస్తాం లేదా... భారీ స్థాయిలో విద్యార్థుల సంఖ్యతోపాటు మైదానం, విద్యార్థులకు సరిపడా గదులు, ఇతర మౌలిక సదుపాయాలు యూపీ స్కూళ్లలో ఉంటే నిబంధనలు సరిపోతే వాటినే హైస్కూల్‌గా మార్చే అవకాశం కూడా ఉంది. మెర్జింగ్‌ స్కూళ్ల వివరాలు త్వరలో చెబుతాం.

- శామ్యూల్‌, డీఈఓ


ప్రాథమిక విద్య దూరం.. 

ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 క్లాసులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల  సుమారు నాలుగైదు కిలోమీటర్లు పిల్లలు వెళ్లాల్సి వస్తుంది. చాలాచోట్ల పిల్లలు అంతదూరం వెళ్లేందుకు ఇబ్బందిపడే అవకాశం ఉంది. దీనివల్ల ప్రైమరీ విద్యకు పిల్లలు దూరమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. జాతీయ రహదారులు, వాగులు, వంకలు ఉన్నచోట కూడా స్కూళ్లను విలీనం చేయాలనుకోవడం దారుణం. ఫలితంగా పిల్లలు వెళ్లేందుకు ఇష్టపడరు. దీంతో డ్రాపౌట్స్‌ సంఖ్య పెరుగే ప్రమా దం ఉంది. ప్రభుత్వం పునరాలోచింలి.

-  విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ, జిల్లా అధ్యక్షుడు



ఉద్యమం తప్పదు..

రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం 2020 అమలు పర్చాలనుకోవడంతో ప్రాథమిక విద్య.. బడుగు, బలహీన వర్గాలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయేలా ఉంది. ఈ విద్యావిధానంలో 3, 4, 5 తరగతులను విలీనం చేయాలని ఎక్కడా లేకపోయినా... ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రభుత్వం టీచర్‌ పోస్టులను సైతం తగ్గించడానికి ప్రభుత్వం ఈ తంతుకు నడుం బిగించింది. ఇప్పటికే 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు.. రివర్స్‌ పీఆర్సీపై రోడ్లపైకి వచ్చిన సమయంలో ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియను వేగంగా చేయాలని చూస్తోంది. ఇది దుర్మార్గం. ప్రజలను చైతన్యపరచి, విలీన పక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తాం.

 - రవీంద్ర, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Updated Date - 2022-01-28T05:52:50+05:30 IST