1.31 లక్షల కేసులు

ABN , First Publish Date - 2021-04-10T07:11:00+05:30 IST

దేశంలో కరోనా కొత్త కేసులే ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయంటే.. మరణాలూ అందుకుతగ్గట్లే పెరుగుతూ కలవరపెడుతున్నాయి

1.31 లక్షల కేసులు

దేశంలో ఒక్కరోజులో వచ్చిన పాజిటివ్‌లు

780 మరణాలు.. మహారాష్ట్రలోనే 376

రాష్ట్రాలకు సమృద్ధిగా టీకాలు: అమిత్‌ షా

నాగ్‌పూర్‌లోని కొవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భాగవత్‌కు కరోనా


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: దేశంలో కరోనా కొత్త కేసులే ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయంటే.. మరణాలూ అందుకుతగ్గట్లే పెరుగుతూ కలవరపెడుతున్నాయి. ఎన్న డూ లేని విధంగా గురువారం 1,31,968 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా.. 780 మంది మృతి చెందారు. గత నాలుగు రోజుల్లోనే 2,500 మందిపైగా(446, 630, 685, 780) ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాల్లో మహారాష్ట్రలో 376, ఛత్తీ్‌సగఢ్‌లో 94, పంజాబ్‌లో 56 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌(36), గుజరాత్‌(36), మధ్యప్రదేశ్‌(27), ఢిల్లీ (24), తమిళనాడు(19)ల్లోనూ పరిస్థితి తీవ్రమవుతోంది. గత 11 రోజుల్లోనే 10 లక్షల కేసులు రావడం, వరుసగా 30 రోజుల నుంచి పాజిటివ్‌లు పెరుగుతూ పోతుండటంతో యాక్టివ్‌ కేసులు 9.79 లక్షలకు చేరాయి. కొత్త కేసుల్లో మహారాష్ట్రలో 56 వేలు, కర్ణాటకలో 6,500, మధ్యప్రదేశ్‌, తమిళనాడులో 5 వేలపైగా వచ్చాయి. ఛత్తీ్‌సగఢ్‌లో రెండో రోజు బాధితులు 10వేలపైనే ఉన్నారు. 149 జిల్లాల్లో గత వారం రోజుల్లో ఒక్క కేసూ రాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. దేశంలో టీకా కొరత అవాస్తవమని.. అన్ని రాష్ట్రాలకు తగినంత సరఫరా చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కోల్‌కతాలో అన్నారు.  ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌కు కరోనా సోకింది. 


మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో లాక్‌డౌన్‌పై స్పష్టత వచ్చే వీలుంది. ఢిల్లీలో గురువారం 7 వేల మందికి వైరస్‌ సోకింది. స్కూళ్లను నిరవధికంగా మూసివేయాలని కేజ్రీ సర్కారు నిర్ణయించింది. జేఎన్‌యూలో 24 మంది విద్యార్థులకు, సర్‌ గంగారామ్‌ ఆస్పత్రి వైద్యులు 37 మందికి కరోనా సోకింది. యూపీ రాజధాని లఖ్‌నవూ సహా 8 పెద్ద నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కింగ్‌జార్జి మెడికల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సహా 40 మంది వైద్యులు వైరస్‌ బారినపడ్డారు. పుదుచ్చేరిలో రాత్రి కర్ఫ్యూ విధించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు కరోనా సోకింది. సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌కు వైరస్‌ నిర్ధారణ అయింది. పంజాబ్‌లో కొత్తగా వైరస్‌ సోకుతున్న ప్రతి ఇద్దరిలో ఒకరు 40 ఏళ్లలోపు వారే. ఢిల్లీలో 30-50 ఏళ్లలోపు వారు భారీగా కొవిడ్‌ బారినపడుతున్నారు. 

 

ముంబైలో 75 టీకా కేంద్రాల మూత 

టీకా కొరత ప్రభావం దేశ వాణిజ్య రాజధాని ముంబైపై స్పష్టంగా కనిపిస్తోంది. నిల్వలు అయిపోవడంతో.. శుక్రవారం నగరంలోని 120 టీకా కేంద్రాలకుగానూ 75 చోట్ల వ్యాక్సినేషన్‌ నిలిచిపోయింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ పరిధిలోని అతిపెద్ద కొవిడ్‌-19 టీకా కేంద్రాన్ని కూడా మూసేశారు. రెండు రోజుల్లో రాష్ట్రంలో టీకా నిల్వలు అయిపోతాయంటూ ప్రధానికి రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ లేఖ రాశారు. వ్యాక్సినేషన్‌లో ధనిక దేశాలకు గణనీయ ప్రాధాన్యమిస్తూ పేద దేశాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపడం దిగ్ర్భాంతి కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు.


కొవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురి మృతి

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని వాడి ప్రాంతంలో ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 27 మంది రోగులను వేరే ప్రాంతానికి తరలించారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ఎయిమ్స్‌లో 53 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 38 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. మిగతావారు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలని అధికారులు చెప్పారు.

Updated Date - 2021-04-10T07:11:00+05:30 IST