‘జులై నెలలో.. రోజుకు కోటి corona vaccine డోసులు..’

ABN , First Publish Date - 2021-06-01T23:56:24+05:30 IST

జులై 15 లేదా.. ఆగస్టు నెల ప్రారంభంలో దేశంలో రోజుకు కోటి డోసుల చొప్పున అందుబాటులోకి వస్తాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్) చీఫ్ డా. బలరామ్ భార్గవ మంగళవారం నాడు తెలిపారు.

‘జులై నెలలో.. రోజుకు కోటి corona vaccine డోసులు..’

న్యూఢిల్లీ: జులై 15 లేదా.. ఆగస్టు నెల ప్రారంభంలో దేశంలో రోజుకు కోటి కరోనా టీకా డోసుల చొప్పున అందుబాటులో ఉంటాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్) చీఫ్ డా. బలరామ్ భార్గవ మంగళవారం నాడు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ప్రజలందరకీ కరోనా టీకా వేస్తామని కేంద్రం ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభా అధికంగా ఉన్న దృష్ట్యా కరోనా టీకా ఉత్పత్తి పెరిగే వరకూ ఓర్పు వహించాలని కూడా ఆయన సూచించారు. విరివిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, కంటైన్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం ద్వారా కరోనా రెండో వేవ్ ఉధృతి తగ్గిందని డా. భార్గవ తెలిపారు. అయితే..ఈ వ్యూహం సుదీర్ఘకాలం పాటు అనుసరించదగినది కాదని స్పష్టం చేశారు. 


 ‘‘దేశంలో టీకాల కొరత లేదు. అయితే..అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్ల జనాభా ఉన్న దేశంలో ప్రజలందరికీ ఒక నెలలో టీకాలు వేయాలనుకుంటే మాత్రం వ్యాక్సిన్ కొరత ఉందనే భావన కలుగుతుంది. ప్రస్తుతం మనం కాస్తంత ఓర్పు పట్టాల్సిన అవసరం ఉంది. జులై 15 కల్లా..లేదా ఆగస్టు నెల ప్రారంభంలో దేశంలో రోజుకు కోటి దాకా కరోనా డోసులు అందుబాటులోకి రావచ్చు. డిసెంబర్ కల్లా ప్రజలందరికీ టీకాలు అందుతాయని నేను భావిస్తున్నాను’’ అని డా. భార్గవ కామెంట్ చేశారు. సోమవారం నాడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇదే తరహా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ కల్లా దేశ ప్రజలందరికీ టీకా అందుబాటులో ఉంటుందని ఇటీవలే కేంద్రం కూడా సుప్రీం కోర్టులో పేర్కొంది. డిసెంబర్ నెలకల్లా దాదాపు 200 కోట్ల కరోనా డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ సలహాదారు ఒకరు గత నెలలో ప్రకటించారు. 

Updated Date - 2021-06-01T23:56:24+05:30 IST