Abn logo
Jan 12 2021 @ 21:18PM

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఎంతమందికి ఆమోదయోగ్యం?

న్యూఢిల్లీ: వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన వివాదాస్పద ప్రైవసీ పాలసీపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. దాదాపు సగం మంది యూజర్లు వాట్సాప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దేశంలోని వాట్సాప్ వినియోగదారుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు వాట్సాప్ ప్రైవసీ పాలసీని వ్యతిరేకిస్తున్నట్లు ఓ సర్వేలో బయటపడింది.


వాట్సాప్ నయా పాలసీ వచ్చే నెల 8 నుంచి అమల్లోకి రానుంది. వాట్సాప్‌ను ఇకపైనా ఉపయోగించాలనుకుంటే కనుక తప్పనిసరిగా ప్రైవసీ పాలసీ షరతులను ఆమోదించాల్సి ఉంటుంది. అంగీకరించకుంటే సేవలు నిలిచిపోతాయి. ఇంగ్లిష్ న్యూస్ యాప్ ‘ఇన్‌షార్ట్స్’ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది కొత్త పాలసీని అంగీకరించబోమని తెగేసి చెప్పేశారు.

తామిప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాలవైపు చూస్తున్నట్టు చెప్పారు. 14 శాతం మంది మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ప్రైవసీ పాలసీని అంగీకరించినట్టు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది మాత్రం తమకు ప్రత్యామ్నాయాల గురించి తెలియదని, కాబట్టి వాట్సాప్ ప్రైవసీ పాలసీని అంగీకరిస్తామని చెప్పుకొచ్చారు. సర్వేలో మొత్తం 1.8 లక్షల మంది యూజర్లు పాల్గొన్నారు. 


తమ ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో వాట్సాప్ స్పందించింది. తమ కొత్త విధానంతో వ్యక్తిగత చాటింగులకు ఎలాంటి భంగం కలగబోదని వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 400 మిలియన్ల మంది వాట్సాప్ యూజర్లు గత వారం ఇన్-యాప్ నోటిఫికేషన్లు అందుకున్నారు. ఫిబ్రవరి 8 నుంచి సరికొత్త విధానం అందుబాటులోకి వస్తుందని, కొత్త విధానాన్ని అంగీకరించాలని అందులో పేర్కొంది. అంగీకరించకుంటే కనుక ఖాతాలు డిలీట్ అవుతాయని హెచ్చరించింది. 

Advertisement
Advertisement
Advertisement