గంటకు 10 కోట్లు!

ABN , First Publish Date - 2021-12-08T07:42:24+05:30 IST

గంటకు 10 కోట్లు!

గంటకు 10 కోట్లు!

మద్యం అమ్మకాలపై ఇదీ టార్గెట్‌

రోజుకు 84 కోట్లకు తగ్గకూడదు.. నెలకు 2,500 కోట్లు రావాల్సిందే 

మద్యం అమ్మకాలపై సర్కారు లక్ష్యం.. ‘నిషేధం’ అంటూనే సొమ్ములపై గురి

గతేడాదికంటే 10వేల కోట్ల అదనపు లక్ష్యం!.. అమ్మకాలు తగ్గితే తనిఖీలు 

ఎందుకు తగ్గాయంటూ ప్రశ్నల వర్షం.. టార్గెట్లతో ఎక్సైజ్‌లో గుబులు 


‘‘గంటకు రూ.10 కోట్ల వ్యాపారం చేయాల్సిందే. రోజువారీ అమ్మకాలు రూ.84 కోట్లకు ఏమాత్రం తగ్గకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా వారానికి రూ.585 కోట్ల సరుకు అమ్మి తీరాలి’’...! సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయనున్న రాష్ట్రంలో ఎక్సైజ్‌కు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఇవి. మాకు మద్యం ఆదాయం ముఖ్యం కాదన్న సర్కారే ఇలా టార్గెట్లు పెట్టడమేంటని ఆశ్చర్యం కలుగుతోందా?... మీరు ఆశ్చర్యపోయినా, అవాక్కయినా ఇదే నిజం!  


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

దశలవారీ మద్య నిషేధం.. అమ్మకాలు తగ్గించేందుకు ప్రయత్నం... ఇది ప్రచారం!

మద్యం విక్రయాలు పెరగాలి. ఆదాయం పెంచాలి... ఇది అసలు వాస్తవం!

మద్యంపై సర్కారు కొత్త టార్గెట్లు పెట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.20,895 కోట్ల విలువైన మద్యం రాష్ట్రంలో అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30,535 కోట్ల సరుకు విక్రయించాలని ఆదేశించింది. గతేడాదికంటే ఏకంగా రూ.10వేల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్మాలని టార్గెట్‌ విధించడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు లక్ష్యమని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇంత టార్గెట్‌ పెట్టిందో అధికార యంత్రాంగానికి సైతం అంతుపట్టడం లేదు. ఇప్పుడు ఆ లక్ష్యాలను చేరుకోవడం కోసం అధికారుల గొంతుపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తోంది. రాత్రింబవళ్లు పనిచేసినా అంత మద్యాన్ని ఎలా అమ్మాలని క్షేత్రస్థాయి యం త్రాంగం ఆందోళన చెందుతోంది. 


షాపుల వర్గీకరణ 

అమ్మకాల విలువ ఆధారంగా మద్యం షాపులను ఏ, బీ, సీ అంటూ మూడు రకాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. అమ్మకాలు ఎక్కువగా ఉంటే ఏ, మధ్యస్తంగా ఉంటే బీ, తక్కువగా ఉంటే సీ కేటగిరీగా పేర్కొంటోంది. ప్రతివారం ఏ-కేటగిరీలో ఎన్ని షాపులున్నాయనే వివరాలు సేకరిస్తోంది. షాపులన్నీ వీలైనంత త్వరగా ఏ-కేటగిరీలోకి వచ్చేయాలని ఒత్తిడి పెంచుతోంది. వారం వారం ఎన్ని షాపులు కేటగిరీలు మారుతున్నాయో నివేదిక రూపొందిస్తోంది. నవంబరు 14 నుంచి 20వరకు రూ.419కోట్లు, 21 నుంచి 27 వరకు రూ.440కోట్లు, నవంబరు 28 నుంచి డిసెంబరు 4వరకు రూ.441 కోట్ల అమ్మకాలు జరిగినట్లు వారాంతపు లెక్కలు తీసింది. ఇప్పటి వరకూ రోజుకు సగటున రూ.63కోట్ల విలువైన మద్యం అమ్ముతుంటే, ఇప్పుడు దాన్ని రూ.84కోట్లకు పెంచాలని, ఈ మేరకు అన్ని జిల్లాలు టార్గెట్లు చేరుకోవాలని అధికారులను ఆదేశిస్తోంది. అమ్మకాలు తగ్గిన షాపులను అధికారులు తనిఖీలు చేస్తూ, ఎందుకు తగ్గాయని ప్రశ్నిస్తున్నారు. జనం మందు కొనకపోతే తామేం చేయాలని ఎక్సైజ్‌ షాపుల్లోని సిబ్బంది నోరెళ్లబెడుతున్నారు. 


25వేల కోట్ల ఆదాయం 

మద్యనిషేధం అని చెప్పిన జగన్‌ ప్రభుత్వం... మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా రూ.18వేల కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది రూ.25వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వంలో 4,380 షాపులుంటే వైసీపీ ప్రభుత్వం దశలవారీగా వాటిని 2,934కు తగ్గించింది. పనివేళలు కుదించింది. బెల్టు షాపులు రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా అమ్మకాలు పెంచాలని ప్రయత్నించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇక్కడ అమ్మకాలు పెంచుకోవడం కోసం మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టింది. పక్క రాష్ర్టాల నుంచి ఒక్క సీసా మద్యం రాకూడదంటూ ఏకంగా ఎక్సైజ్‌ చట్టానికి సవరణ చేసింది. ఇదంతా తాగుడు తగ్గించడం కోసమేనని ప్రజలు భావించేలోపే ఈ టార్గెట్లు పెట్టింది. అంటే పక్క రాష్ర్టాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధించడంలో అసలు ఉద్దేశం ఇక్కడి అమ్మకాలు పెంచడమేనని స్పష్టమైంది. 




Updated Date - 2021-12-08T07:42:24+05:30 IST