వసూలయ్యేదేలే.. ఏంటీ మతలబు.. 10 రోజులు.. రూ.400 కోట్లు.. !

ABN , First Publish Date - 2022-03-21T15:36:44+05:30 IST

10 రోజులు.. రూ.400 కోట్లు.. నిర్దేశిత లక్ష్యం చేరుకోవాలంటే వసూలు కావాల్సిన ఆస్తి పన్ను ఇది...

వసూలయ్యేదేలే.. ఏంటీ మతలబు.. 10 రోజులు.. రూ.400 కోట్లు.. !

  • ఆస్తి పన్ను వసూలులో మతలబు
  • అంత సీరియస్‌గా తీసుకోని కొందరు టీఐ, బీసీలు
  • పన్ను మదింపులో పాత్ర తగ్గించినందుకేనా..?
  • ఆన్‌లైన్‌లో పూర్తయ్యేలా సర్కారు నిర్ణయం
  • అక్రమార్జన లేదన్నది కొందరి బాధ
  • ఇప్పటి వరకు జరిగిన చెల్లింపులు రూ.1316 కోట్లు మాత్రమే
  • టార్గెట్‌కు రూ.400 కోట్లు తక్కువ

10 రోజులు.. రూ.400 కోట్లు.. నిర్దేశిత లక్ష్యం చేరుకోవాలంటే వసూలు కావాల్సిన ఆస్తి పన్ను ఇది. గతేడాది స్థాయిలో పన్ను ఆదాయం రావాలన్నా.. మరో రూ.317 కోట్లు వసూలు కావాలి. అంటే వచ్చే పది రోజుల్లో సగటున  రోజుకు రూ.30 కోట్లకుపైగా పన్ను చెల్లింపులు జరగాలి. కానీ, కొన్ని రోజులుగా వసూలవుతోన్న పన్ను రూ.కోటి కూడా దాటడం లేదు. ఈ లెక్కన టార్గెట్‌ విషయాన్ని పక్కన పెడితే.. కనీసం కిందటి సంవత్సరం మేర పన్ను వసూలవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


హైదరాబాద్‌ సిటీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1633.76 కోట్ల పన్ను వసూలు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మార్చి 18వ తేదీ వరకు వసూలైన పన్ను రూ.1316.40 కోట్లు మాత్రమే. గత సంవత్సరం కంటే రూ.317.36 కోట్లు తక్కువ పన్ను వసూలైంది. మరో 10 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడం, పన్ను చెల్లింపులు నామమాత్రంగా జరుగుతుండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆర్థిక విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, చేసిన అప్పులకు వడ్డీ, వాయిదాలు చెల్లించాల్సి ఉన్న దృష్ట్యా.. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆస్తి పన్ను వసూలు తగ్గితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. 


ఎప్పుడూ లేనిది..

సాధారణంగా మార్చి నెలలో మొదటి వారాలు నిత్యం రూ.3కోట్ల నుంచి రూ.5 కోట్ల పన్ను వసూలవుతుంది.  చివరి వారంలో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతాయి. ఈసారి మాత్రం పన్ను వసూలు రూ.కోటి దాటడం లేదు. 18వ తేదీన అత్యల్పంగా రూ.52 లక్షల పన్ను చెల్లింపులు జరిగాయి. గతంలో ఎప్పుడూ లేనిది ఇంత తక్కువ పన్ను ఎందుకు వసూలవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఆరా తీయగా.. క్షేత్రస్థాయిలో కొందరు ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు (టీఐ), బిల్‌ కలెక్టర్లు (బీసీ) సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలిసింది. రోజు వారీ టార్గెట్లు నిర్ధేశించినా, పన్ను వసూలుపై వారు అంతగా దృష్టి సారించడం లేదని గుర్తించారు. అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు సర్కారు స్థాయిలో తీసుకున్న కీలక నిర్ణయమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌లోని నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా సర్కిల్‌ డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌ (డీసీ) ఆన్‌లైన్‌లో పన్ను డిమాండ్‌ జనరేట్‌ చేస్తున్నారు. ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు భవనాల వద్దకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయి.


గతంలో డాక్యుమెంట్లు జత చేస్తూ పౌరులు దరఖాస్తు చేస్తే ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌, బిల్‌ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి పన్ను మదింపు చేసేవారు. మొదట ఎక్కువ పన్ను వేసి తగ్గించేందుకు కొందరు బేరసారాలు కుదుర్చుకునే వారు. పన్ను మదింపు, మ్యుటేషన్‌ (ఆస్తి మార్పిడి)లో అవినీతికి పాల్పడుతూ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు కొందరు ఏసీబీకి చిక్కారు. అయినా చాలా మంది తీరు మారలేదు. ఈ క్రమంలో పౌరుల ఫిర్యాదులతో సర్కారు పన్ను మదింపునకు సంబంధించి పారదర్శక సేవలందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అదనపు ఆదాయం తగ్గిందని భావిస్తోన్న కొందరు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు పన్ను వసూలును అంత సీరియ్‌సగా తీసుకోవడం లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. మరో పదిరోజులే ఉన్న దృష్ట్యా టార్గెట్‌ మేరకు వసూలు చేశారా.. లేదా అన్నది పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామని రెవెన్యూ విభాగం వర్గాలు పేర్కొన్నాయి. 


20 నుంచి 40 శాతం తక్కువగా..

ప్రతి నెలా చివరి వారంలో రూ.300కోట్ల నుంచి రూ.400 కోట్ల పన్ను వసూలవుతుంది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.50 కోట్ల పన్ను కూడా వసూలు కాలేదు. మెజార్టీ సర్కిళ్లలో కిందటి యేడాదితో పోలిస్తే 20 నుంచి 40 శాతం వరకు తక్కువ పన్ను వసూలైంది. చార్మినార్‌ సర్కిల్‌లో కిందటి యేడాది రూ.20.26 కోట్లు వసూలు కాగా ఇప్పుడు రూ.10.79, ఫలక్‌నుమాలో గతేడాది రూ.1074 కోట్లు వసూలు కాగా ప్రస్తుతం రూ.6.25 కోట్లు మాత్రమే వసూలైంది. ప్రతి యేటా అత్యధిక పన్ను వసూలు జరిగే ఖైరతాబాద్‌ జోన్‌లోనూ ఈసారి అంతంత మాత్రంగానే పన్ను చెల్లింపులు జరిగాయి. మెహిదీపట్నం సర్కిల్‌లో గత సంవత్సరం రూ.44.48 కోట్లు వసూలు కాగా, ఇప్పుడు రూ.26.31 కోట్లు, ఖైరతాబాద్‌లో గతేడాది రూ.148.85 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.120.28కోట్లు, జూబ్లీహిల్స్‌లో కిందటి సంవత్సరం రూ. 178.05 కోట్లు కాగా ఇప్పుడు రూ. 138.91 కోట్లు వసూలైంది. శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో మాత్రం గతేడాది రూ.280.46 కోట్లు వసూలైతే ప్రస్తుతం రూ.272.53 కోట్లు వసూలయ్యాయి.

Updated Date - 2022-03-21T15:36:44+05:30 IST