గిరిజనులకూ 10 లక్షలు

ABN , First Publish Date - 2021-08-01T08:01:20+05:30 IST

‘‘దళిత బంధు పఽథకాన్ని ఎవడు ఆపుతాడో చూస్తానంటూ సీఎం కేసీఆర్‌ అంటున్నడు. ఎవడూ ఆపడం లేదు.

గిరిజనులకూ 10 లక్షలు

  • దళిత బంధును ఎవడూ ఆపడం లేదు 
  • 119 నియోజక వర్గాల్లోనూ అమలు చేయాలి
  • డబ్బుల కోసం ప్రగతి భవన్‌నూ అమ్మండి
  • దళితులను మోసం చేసింది కేసీఆర్‌ కాదా?
  • లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ దండోరా సభలు 
  • టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో చావు డప్పులు 
  • మోగిస్తాం: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి 
  • కాంగ్రెస్‌ చేసిన చట్టాల అమలుకు పోరాటం: భట్టి


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘‘దళిత బంధు పఽథకాన్ని ఎవడు ఆపుతాడో చూస్తానంటూ సీఎం కేసీఆర్‌ అంటున్నడు. ఎవడూ ఆపడం లేదు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ దళిత బంధును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నం’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దళిత, గిరిజనుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని, డబ్బుల కోసం ప్రగతి భవన్‌, సచివాలయాన్ని అమ్ముతామని చెప్పినా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. తాను మాట ఇస్తే అమలు చేసి తీరుతానంటూ కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో దళితులను మోసం చేసింది ఆయన కాదా అని ప్రశ్నించారు. ఇందిరాభవన్‌లో శనివారం టీపీసీసీ ఆధ్వర్యంలో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరిగింది. రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, అంజన్‌కుమార్‌ యాదవ్‌, గీతారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలోనూ దళిత, గిరిజన దండోరా సభలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష మందితో ఈ సభలను పెట్టి రూ.10 లక్షలు ఇస్తావా.. చస్తావా అంటూ నినదిస్తామని, టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో చావు డప్పు మోగిస్తామని చెప్పారు.


ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో దండు కట్టి దండోరా వేస్తున్నామని చెప్పారు. అడవిని నమ్ముకున్న గిరిజనులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో దళిత, గిరిజనులకు పంపిణీ చేసిన భూమిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అటవీ భూములకు సంబంధించి కాంగ్రెస్‌ హయాంలో చేసిన చట్టా లు అమలయ్యేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చా రు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. హరితహారం పేరుతో గిరిజన భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్‌ చెప్పింది ఏదీ ఇంతవరకు జరగలేదని గీతారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆమె మాట్లాడారు. జానారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కాగా, నాంపల్లిలో కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం ఆధ్వ ర్యంలో జరిగిన సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ మైనారిటీలకు సీఎం కేసీఆర్‌చేసిందేమీ లేదన్నారు.


ఉప ఎన్నిక కోసమే ఆ పథకమా?

జగిత్యాల టౌన్‌: ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సహాయం చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ప్రతిజ్ఞ చేయాలని కేసీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం జగిత్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈపథకం హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా? దళితుల కోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు. 


నిర్ణయాలు ఉమ్మడిగా ఉండాలి 

ఇంద్రవెల్లిలో టీపీసీసీ తలపెట్టిన దళిత, గిరిజన దండోరా సభపై టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నేతనైన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా వేదికను ప్రకటించారంటూ రేవంత్‌తో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. టీపీసీసీ అధ్యక్షుడిగా సందర్భాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు ప్రకటించాల్సి ఉంటుందని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. నిర్ణయాలు సమష్టిగా ఉండేలా చూసుకోవాలన్న అభిప్రాయాన్నీ ఈ సందర్భంగా పలువురు నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యక్రమాల పురోగతిపై శనివారం గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమవేశం అయింది. ఈ నెల 9న ఇంద్రవెల్లిలో తలపెట్టిన సభకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాగా పేరు పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇంద్రవెల్లి సభకు ఇన్‌చార్జిగా జగ్గారెడ్డికి బాధ్యతలను అప్పగించారు. సమావేశం అనంతరం మహే్‌షకుమార్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై ఈ నెల 4న కరీంనగర్‌ జిల్లా నేతలతో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-08-01T08:01:20+05:30 IST