బాబోయ్.. ఇవేం పెళ్లిళ్లు.. తనను తానే పెళ్లాడాడో ఘనుడు.. నివ్వెరపరిచే వింత వివాహాలు

ABN , First Publish Date - 2021-06-15T22:53:17+05:30 IST

వింత పెళ్లిళ్లు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.

బాబోయ్.. ఇవేం పెళ్లిళ్లు.. తనను తానే పెళ్లాడాడో ఘనుడు.. నివ్వెరపరిచే వింత వివాహాలు

ప్రేమ అనేది ఇద్దరి మనుషుల మధ్యే ఉండనక్కర్లేదు.. మనల్ని మనం ప్రేమించుకోవచ్చు.. మన పెంపుడు జంతువులను కూడా ప్రేమించవచ్చు.. తాజ్‌మహల్‌ను ఇష్టపడొచ్చు.. అయితే పెళ్లి మాత్రం ఇద్దరు మనుషుల మధ్యే జరుగుతుంది. అదేం కాదు.. మేం ఎంతగానో ప్రేమించిన పెంపుడు జంతువులతోనే, వస్తువులతోనే జీవితాలను పంచుకుంటామంటూ కొందరు వాటినే పెళ్లి చేసుకున్నారు. అలాంటి వింత పెళ్లిళ్లు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. 


పిల్లిని పెళ్లి చేసుకున్నాడు


జర్మనీకి చెందిన ఓ పోస్ట్ మ్యాన్ తన పెంపుడు పిల్లిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రోజు తన పిల్లికి తెలుపు దుస్తులు వేసి పెళ్లి కూతురిలా ముస్తాబు చేశాడు. అయితే పిల్లితో పెళ్లి చేయడానికి రిజిస్ట్రార్ అధికారులు మాత్రం ముందుకు రాలేదు. దీంతో ఒక నటి రిజిస్ట్రార్ పాత్ర పోషించాల్సి వచ్చింది.


ఈఫిల్ టవర్‌ను పెళ్లాడింది 


శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన మాజీ సైనికురాలు ఎరికా లా టూర్ (37)కు ఈఫిల్ టవర్ అంటే చాలా ఇష్టం. స్నేహితుల సమక్షంలో ఆమె ఈఫిల్ టవర్‌ను పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన పేరును చట్టబద్ధంగా ఎరికా లా టూర్ ఈఫిల్‌గా మార్చుకుంది.


 తనను తానే పెళ్లి చేసుకున్నాడు


చైనాకు చెందిన ఒక వ్యక్తి 2007లో తనను తానే పెళ్లి చేసుకున్నాడు. ఆడ గెటప్‌లో ఉన్న తన ఫొటోను పెళ్లాడాడు. ఈ వేడుకకు 100 మంది అతిథులు హాజరయ్యారు.


 తలగడను వివాహమాడాడు


కొరియాకు చెందిన లీ జిన్ గ్యూ ఓ తలగడను వివాహం చేసుకున్నాడు. `మేజికల్ గర్ల్` యానిమేషన్ సిరీస్‌లోని ఫేట్ టెస్టొరెస్సా చిత్రం ఉన్న తలగడతో ప్రేమలో పడ్డాడు. ఎక్కడకు వెళ్లినా తనతోపాటే దానినీ తీసుకెళ్లేవాడు. ఒక శుభ ముహూర్తాన ఆ తలగడకు పెళ్లి దుస్తులు తొడిగి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.


 డాల్ఫిన్‌తో పెళ్లి


లండన్‌కు చెందిన మిలియనీర్ షరాన్ టెండ్లర్ 2005లో సిండీ అనే డాల్ఫిన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి దుస్తులు ధరించి తలలో పూలు పెట్టుకుని సాంప్రదాయ పద్ధతిలో డాల్ఫిన్‌ను మనువాడింది. అనంతరం డాల్ఫిన్‌తో కలిసి కొద్దిసేపు ఈత కొట్టింది.


 పామును పెళ్లి చేసుకుంది


పాముతో ప్రేమలో పడిన ఒడిశాకు చెందిన బింబాలా దాస్ అనే మహిళ హిందూ సాంప్రదాయం ప్రకారం దానిని వివాహం చేసుకుంది. చీమల కొండ దగ్గర బింబాలా పాలు పెట్టినప్పుడల్లా, పాము తాగడానికి బయటకు వచ్చేది. పామును వివాహం చేసుకోవాలనే తన ఆలోచనను బింబాలా వెల్లడించినప్పుడు, గ్రామస్తులు ఆమెను అభినందించారు. ఈ వివాహానికి భారీ విందు కూడా ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-06-15T22:53:17+05:30 IST