బీఎస్‌పీకి మద్దతు ఇచ్చిన 10 రాజకీయ పార్టీలు

ABN , First Publish Date - 2022-01-19T00:29:42+05:30 IST

గౌరవనీయ మాయావతి అభివృద్ధికి ప్రేరేపితులై 10 రాజకీయ పార్టీల నేతలు బహుజన్ సమాజ్ పార్టీకి తమ భేషరతు మద్దతు ప్రకటించారు. అలాగే ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’ యొక్క కార్యరూపాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు..

బీఎస్‌పీకి మద్దతు ఇచ్చిన 10 రాజకీయ పార్టీలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బహుజన్ సమాజ్‌ పార్టీకి పది రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే ఈ పార్టీల ప్రభావంలో రాష్ట్రంలో పెద్దగా లేనప్పటికీ ఓటు బ్యాంకును పెంచడంలో ఉపయోగపడతాయని అంటున్నారు. మంగళవారం బీఎస్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా, రాష్ట్రంలోని పలు పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఎస్‌పీకి తాము భేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు పది పార్టీలు ప్రకటించాయి. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.


‘‘గౌరవనీయ మాయావతి అభివృద్ధికి ప్రేరేపితులై 10 రాజకీయ పార్టీల నేతలు బహుజన్ సమాజ్ పార్టీకి తమ భేషరతు మద్దతు ప్రకటించారు. అలాగే ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’ యొక్క కార్యరూపాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పం తీసుకున్నారు’’ అని సతీష్ చంద్ర మిశ్రా ట్వీట్ చేశారు. మరో ట్వీట్ చేస్తూ ‘‘మీ అందరి మద్దతు, సహకారంతో బహుజన్ సమాజ్ పార్టీకి మరింత శక్తి, ఊపు వస్తుందని.. అలాగే ప్రజల ఆశీస్సులతో మాయావతిని 5వ సారి యూపీలో ముఖ్యమంత్రిని చేస్తామనే పూర్తి విశ్వాసం మాకు ఉంది. మన ఉత్తరప్రదేశ్ మళ్లీ పురోగతిలో పయనిస్తుంది’’ అని రాసుకొచ్చారు.


ఇక బహుజన్ సమాజ్‌ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీలను ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

1. ఇండియా జనశక్తి పార్టీ

2. పచ్చాసీ పరివర్తన్ సమాజ్ పార్టీ

3. విశ్వ్ శాంతి పార్టీ

4. సంయుక్త్ జనాదేశ్ పార్టీ

5. ఆదర్శ్ సంగ్రామ్ పార్టీ

6. అఖండ్ వికాస్ భారత్ పార్టీ

7. సర్వజన్ ఆవాజ్ పార్టీ

8. ఆధీ ఆబాదీ పార్టీ

9. జాగరూక్ జనతా పార్టీ

10. సర్వజన్ సేవా పార్టీ


ఈ పార్టీల వివరాలు వెల్లడించిన అనంతరం ‘‘బహుజన కుటుంబంలోకి హృదయపూర్వక స్వాగతం’’ అని సతీష్ చంద్ర మిశ్రా పేర్కొన్నారు. వాస్తవానికి సీట్ల పంపకాల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకపోయినప్పటికీ 10 పార్టీల నుంచి ఎన్నికల మద్దతు బీఎస్‌పీ సాధించింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకోగా.. బీజేపీ మాత్రం ఇప్పటికే ఎన్డీయేలో ఉన్న అప్నాదళ్‌, నిషాద్ పార్టీలతోనే బరిలోకి దిగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతోంది. వీటితో పాటు లెఫ్ట్ పార్టీల కూటమి, ఆప్, ఏఐఎంఐఎం, ఇతర పార్టీలు పోటీలో ఉన్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, ఎస్పీ, బీఎస్పీల మధ్యే కొనసాగనుందనేది స్పష్టం.

Updated Date - 2022-01-19T00:29:42+05:30 IST