అమరావతి కోసం వెచ్చించిన 10 వేల కోట్లు వృథా!

ABN , First Publish Date - 2020-08-01T08:53:12+05:30 IST

సుమారు రూ.48,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావించిన అమరావతి రాజధానికి ఇప్పటి వరకు వెచ్చించిన సుమారు రూ.10,000 కోట్లు వృథాయేనా?

అమరావతి కోసం వెచ్చించిన  10 వేల కోట్లు వృథా!

  • హ్యాపీనెస్ట్‌, ఎన్నార్టీలపై తీవ్ర ప్రభావం
  • లబోదిబోమంటున్న కొనుగోలుదారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సుమారు రూ.48,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావించిన అమరావతి రాజధానికి ఇప్పటి వరకు వెచ్చించిన సుమారు రూ.10,000 కోట్లు వృథాయేనా? ఈ మొ త్తం ప్రజాధనం నీటిపాలు చేసినట్టేనా? తాజాగా పాలన వికేంద్రీకరణ బిల్లు(3రాజధానులు)కు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదముద్ర వేయడంతో ప్రతి ఒక్కరిలోనూ తలెత్తిన సందేహాలివి. నవ నగరాలు, స్టార్టప్‌ ఏరియాలతోపాటు దేశంలోనే ఎన్నదగిన అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందని అందరూ భావించారు. లెక్కకు మిక్కిలిగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయా లు, విద్య, వైద్యం, ఆర్థిక తదితర సంస్థల స్థాపనతో దేశంలోనే ఒక అత్యుత్తమ నగరం ఇక్కడ ఏర్పడుతుందని అనుకున్నారు. అయితే, గవర్నర్‌ తాజా నిర్ణయంతో ఇప్పుడు అమరావతి పూర్తిగా అటకెక్కింది.


సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం కా రణంగా అమరావతిలోని పలు ప్రాజెక్టులపై ఇప్ప టి వరకు వెచ్చించిన రూ.వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరైందనే విమర్శలు వస్తున్నాయి. అమరావతిని తొలిదశలో అభివృద్ధి చేసేందుకు సుమా రు రూ.48,000 కోట్లు అవసరమని అప్పటి టీడీపీ ప్రభుత్వం అంచనా వేసింది. అధికారుల నివాస సముదాయాలు, సచివాలయం, శాఖాధిపతుల కా ర్యాలయాల టవర్లు, శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు, సీడ్‌ యాక్సెస్‌ సహా పలు రహదారులు, మౌలిక వసతుల కల్పన పథకాలు, రైతులకు కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లున్న ఎల్పీఎస్‌ జోన్లు తొలిదశ నిర్మాణాల్లో ఉన్నాయి. వీటిని ప్రాధాన్యతాక్రమంలో చేపట్టిన గత టీడీపీ ప్రభుత్వం గతేడాది గద్దె దిగేనాటికి సుమారు రూ.35,000 కోట్ల విలువైన వివి ధ ప్రాజెక్టులకు టెండర్లను ఖరారు చేసింది.


మిగిలిన ప్రాజెక్టులకూ టెండర్లు పిలవాలనుకునే సమయంలో అధికారాన్ని కోల్పోయింది. అప్పటికి అమరావతిలో పూర్తయిన పనుల విలువ రూ.10,000 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో ప్రధానమైనవి అప్పటి సీఎం చంద్రబాబు ఆశించిన విధంగా చకచకా జరిగాయి. గతేడాది సార్వత్రిక ఎన్నికల నాటికి 45 నుంచి 80ు వరకు పూర్తయ్యాయి. వీటిలో ప్రజా ప్రతినిధుల నుంచి న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులందరికీ నివాస వసతి కల్పించేందుకు ఉద్దేశించిన 225 బంగళాలు, 63 భారీ టవర్లు ఉన్నాయి. సుమారు రూ.3,500 కోట్లతో అత్యధునాతన వసతులతో నిర్మించదలచిన ఇవి గతేడాది చివరికల్లా పూర్తయి, నివాసానికి అనువుగా సిద్ధమవ్వాల్సి ఉంది. ఆ ప్రకారమే ఎన్నికల నాటికి టవర్లలో 35కిపైగా ఇంచుమించు మూడొంతులు పూర్తవగా, కొన్ని మోడల్‌ ఫ్లాట్లు కూడా సిద్ధమయ్యాయి.


మిగిలినవీ 40-60ు మధ్య ఉండగా, పనులను ఆ పివేయాలన్న జగన్‌ సర్కార్‌ ఆదేశాలతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. సుమారు రూ.1100 కోట్లతో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు కూడా వివిధ దశల్లో ఉండగా ఆగిపోయాయి.  దాదాపు రూ.2,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని నిర్ణయించిన శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణం ప్రాథమిక దశ దాటలేదు. బౌద్ధ స్థూపాకృతిలో రూపుదాల్చాల్సిన రూ.1325 కోట్ల శాశ్వత హైకోర్టు భవంతి, రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సెక్రటేరియట్‌-హెచ్‌వోడీ కార్యాలయాల 5 టవర్లు ఫౌండేషన్‌ దశలో నిలిచిపోయాయి.  


అగమ్యగోచరంగా.. హ్యాపీనెస్ట్‌, ఎన్నార్టీ 

అమరావతి ఎంతో అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసంతో దేశ, విదేశాలకు చెందిన వందల మం ది రాజధానిలో ఏపీసీఆర్డీయే నిర్మించ తలపెట్టిన హ్యాపీనె్‌స్టలో అపార్ట్‌మెంట్లను బుక్‌ చేసుకున్నారు. వారితోపాటు ప్రవాసాంధ్రుల కోసం కృష్ణానది తీరాన ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోవాల్సిన భారీ ట్విన్‌ టవర్లలోనూ వందల మంది ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అమరావతి ప్రాధాన్యం పడిపోయినందున ఈ ప్రాజెక్టు లు పడకేశాయి. దీంతో వీటికోసం రూ.లక్షల్లో వెచ్చించిన వారు లబోదిబోమంటున్నారు.

Updated Date - 2020-08-01T08:53:12+05:30 IST