‘గ్రౌండ్‌ ఫ్లోర్‌’ కుటుంబానికి 10 వేలు

ABN , First Publish Date - 2020-10-22T07:28:12+05:30 IST

హైదరాబాద్‌లో భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీలు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. వరద ప్రభావానికి గురైన

‘గ్రౌండ్‌ ఫ్లోర్‌’ కుటుంబానికి 10 వేలు

డోర్‌లాక్‌ చేసిన వారు వస్తే వారికీ అందజేత..

బాధిత కుటుంబాలన్నింటీకీ ఆర్థిక సాయం


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీలు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. వరద ప్రభావానికి గురైన బస్తీల్లోని పేదల ఇళ్లతో పాటు కాలనీల్లోని గ్రౌండ్‌ ఫ్లోర్లలో అద్దెకున్నవారందరికీ అధికారులు రూ.10 వేల పరిహారం ఇస్తున్నారు.


చార్మినార్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌, ఎల్‌బీనగర్‌లో జోన్లలో గుర్తించిన 235 కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మంది బాధితులకు  అధికారు లు సాయం అందజేస్తున్నారు. ఇద్దరు జీహెచ్‌ఎంసీ, ఒకరు రెవెన్యూశాఖకు చెందిన అధికారి బృందంగా ఏర్పడి నీట మునిగిన ప్రతి ఇంటికి నగదు ఇస్తున్నారు. మంగళవారం 6 జోన్లలో కలిపి సుమారు 25 వేల కుటుంబాలకు ఇవ్వగా, బుధవారం మరో 80 వేల కుటుంబాలకుపంపిణీ చేసినట్లు తెలిసింది. 


పాక్షికంగా దెబ్బతింటే 50 వేల పరిహారం

వరదల ధాటికి ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తిస్తే ఆ ఇళ్ల యజమానులకు రూ.50 వేల చొప్పు న ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇంటింటికి పరిహారం పంపిణీ చేస్తున్న క్రమంలోనే పాక్షికంగా దెబ్బతిన్న, పూర్తిగా నేలమట్టమైన ఇళ్ల వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటున్నారు.


కాగా, వరద ఉధృతితో ఇంటికి తాళాలు వేసుకుని బంధువులు, తెలిసిన వారి వద్దకు వెళ్లిన బాధితులు తమను సంప్రదిస్తే త్వర లో వారికీ పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. వరద బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించడంతోపాటు డివిజన్ల వారీగా ఎంత నష్టం వాటిల్లిందో సమగ్రంగా పరిశీలిస్తున్నారు. పాక్షికంగా, పూర్తిగా ఇళ్లను కోల్పోయిన వారి జాబితాను అధికారులు వేర్వేరుగా తయారు చేస్తున్నారు. 


Updated Date - 2020-10-22T07:28:12+05:30 IST