పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రత్యక్ష తరగతులు

ABN , First Publish Date - 2021-01-11T07:44:41+05:30 IST

ఉన్నత పాఠశాలలు, ఇంటర్‌ విద్యకు సంబంఽధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యక్ష తరగతులు వారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రత్యక్ష తరగతులు

తల్లిదండ్రులు సమ్మతి తెలిపిన విద్యార్థులకే అనుమతి

70 శాతం సిలబస్‌కే బోధన

వార్షిక పరీక్షల్లో 6 పేపర్లే

సగం సిలబస్‌ చదివినా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నలు

18 నుంచి 9, 10, ఇంటర్మీడియట్‌ తరగతులు?

నేడు కేసీఆర్‌ ప్రకటించే చాన్స్‌

ఏప్రిల్‌ ఆఖర్లో ఇంటర్‌ పరీక్షలు


హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఉన్నత పాఠశాలలు, ఇంటర్‌ విద్యకు సంబంఽధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యక్ష తరగతులు వారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదో తరగతి విద్యార్థులకు కనీసం 100 రోజులు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. సంక్రాంతి సెలవుల తర్వాత 18 నుంచి తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నా కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ఇప్పటికే తెరచుకున్న విషయాన్ని పేర్కొంది.


ఈ నేపథ్యంలో.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ కూడా తరగతులు ప్రారంభించేలా విద్యాశాఖ ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం వివిధ అంశాలతోపాటు విద్యాశాఖపైనా సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 18 నుంచి 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్‌ తరగతుల ప్రారంభంపై ఆయన ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, తరగతులకు ప్రభుత్వం అనుమతిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఆ వివరాలు.. 


కనీసం 100 తరగతులు.. 

ప్రతి ఏటా విద్యాసంవత్సరం జూన్‌ రెండోవారంలో ప్రారంభమవుతుండగా.. పదో తరగతి సిలబస్‌ డిసెంబరులో పూర్తవుతుంది. దీనికోసం 100-120 పనిదినాలు కేటాయిస్తారు. ఈసారి ఇంతవరకు ప్రత్యక్ష పాఠాలు లేకపోవడంతో.. జనవరి మూడోవారంలో తరగతులు ప్రారంభించి 3-4 నెలలపాటు కనీసం 100 ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రతి ఏటా వేసవి సెలవులను ఏప్రిల్‌లో ప్రకటిస్తుండగా.. ఈసారి వేసవి సెలవుల్లోనూ ఒంటిపూట తరగతులు నిర్వహించి పదో తరగతి సిలబ్‌సను పూర్తిచేయించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఉంది. పాఠశాలలు ప్రారంభమైతే కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించనున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకే తరగతి విద్యార్థులను వేర్వేరు బ్యాచ్‌లుగా చేయనున్నారు. ఉదాహరణకు.. 10వ తరగతిలో విద్యార్థుల సంఖ్య 25 లోపు ఉంటే ఒక బ్యాచ్‌, 50 మంది వరకు ఉంటే రెండు బ్యాచ్‌లు, అంతకంటే ఎక్కువగా ఉంటే మూడు బ్యాచ్‌ల చొప్పున విభజిస్తారు. ఉపాధ్యాయుడు ఒకే పాఠాన్ని వేర్వేరు బ్యాచ్‌లకు బోధించాల్సి ఉంటుంది. 


70 శాతం సిలబ్‌సకే తరగతులు.. 

ఈసారి 30 శాతం సిలబ్‌సను తగ్గించాలని పాఠశాల విద్యాశాఖతోపాటు ఇంటర్‌ విద్య కూడా ప్రకటించింది. కుదించిన పాఠ్యాంశాల వివరాలను సబ్జెక్టుల వారీగా ఇప్పటికే స్పష్టం చేసింది. మిగిలిన 70 శాతం సిలబ్‌సకే తరగతులు నిర్వహిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ ఇందులోనుంచే ప్రశ్నలు ఉంటాయి. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షల్లో మొత్తం 11 పేపర్లను 6కు తగ్గించాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉండగా.. ఈసారి అమలు చేయాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. మొత్తం సిలబ్‌సలో నుంచి ప్రశ్నలు, ఆప్షన్స్‌ తక్కువగా ఉంటుండగా.. ఈసారి ఈ విధానాన్ని సమూలంగా మార్చనున్నారు. అన్ని సబ్జెక్టుల పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్స్‌ ఇవ్వనున్నారు. ప్రతి ప్రశ్నకు రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. విద్యార్థి కనీసం సగం సిలబస్‌ చదివినా అన్ని ప్రశ్నలు రాయగలిగేలా ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నారు. 


తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి.. 

కరోనా నేపథ్యంలో తరగతులు ప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రత్యక్ష తరగతులకు వారి అనుమతిని తప్పనిసరి చేయనున్నారు. తల్లిదండ్రుల సంతకంతో అంగీకార పత్రాన్ని సమర్పించిన విద్యార్థులనే తరగతులకు అనుమతిస్తారు. ఒకసారి అంగీకరించిన తల్లిదండ్రులు తర్వాత వద్దనుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. విద్యార్థితోపాటు అతడి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారిని అనుమతించరు. ఏమాత్రం అనుమానం ఉన్నా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తారు. కాగా, సీబీఎ్‌సఈ 10, 12వ తరగతుల వార్షిక పరీక్షలు మే-4 నుంచి జూన్‌-10 మధ్యలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో తరగతులు ప్రారంభమైతే ఏప్రిల్‌ రెండోవారం వరకు ఇంటర్‌ సెకండియర్‌ తరగతులు, ప్రాక్టికల్స్‌ పూర్తిచేసి ఏప్రిల్‌ ఆఖర్లో వార్షిక పరీక్షలు పూర్తిచేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఈసారి ఇంటర్‌ తరగతులతో పాటు జేఈఈ, నీట్‌ పరీక్షలకు సంబంధించిన బోధన ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది. 

Updated Date - 2021-01-11T07:44:41+05:30 IST