వంద ఇళ్లు.. కట్టాల్సిందే!

ABN , First Publish Date - 2022-01-25T05:32:50+05:30 IST

ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని ముందుకు సాగకపోతే ఎందుకు అలా జరుగుతుందో ఓసారి పునఃపరిశీలించుకుంటాం.

వంద ఇళ్లు..  కట్టాల్సిందే!
నెల్లూరు : జనార్ధన్‌రెడ్డి నగర్‌లోని జగనన్నకాలనీ

ఒక్కో కాంట్రాక్టరుకు టార్గెట్‌

లేదంటే పాత బిల్లులు ఇవ్వం

కాంట్రాక్టర్లకు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదేశం

భవిష్యత్తులోనూ కష్టాలు తప్పవని బెదిరింపులు?

తమ పరిస్థితి చెప్పినా వినని వైనం


‘‘ప్రతి కాంట్రాక్టర్‌ కనీసం వంద ఇళ్లు నిర్మించాలి. ప్రభుత్వ ఆదేశాలివి. అందరూ తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. లేదంటే పెండింగ్‌ బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు.. కార్పొరేషన్‌ టెండర్లలో పాల్గొనకుండా చేస్తాం’’

- కాంట్రాక్టర్ల సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ అన్న మాటలివి. 


నెల్లూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని ముందుకు సాగకపోతే ఎందుకు అలా జరుగుతుందో ఓసారి పునఃపరిశీలించుకుంటాం. లోటుపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. కానీ జగనన్న కాలనీల విషయంలో మాత్రం ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. గతేడాది జూన్‌లో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టినా జిల్లాలో ముందుకు కదలడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఈ కారణంగానే మొదట్లో కాంట్రాక్టర్లు, ఇప్పుడు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించేందుకు ముందుకు రాలేదు. క్షేత్రస్థాయిలోని అధికారులకు ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే నిర్మాణాల్లో పురోగతి కనిపించకపోవడంతో ప్రభుత్వం కాంట్రాక్టర్ల మెడపై కత్తి పెడుతోంది. ప్రభుత్వ శాఖల్లో నిర్మాణ పనులు చేస్తున్న ప్రతి కాంట్రాక్టరు కనీసం వంద జగనన్న ఇళ్లు నిర్మించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే పాత బిల్లులు ఇచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయమంటూ కాంట్రాక్టర్లు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


కమిషనర్‌ ఘాటు వ్యాఖ్యలు

నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ దినే్‌షకుమార్‌ సోమవారం నెల్లూరులోని కార్పొరేషన్‌ కార్యాలయంలో కాంట్రాక్టర్లను పిలిచి సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్‌ పరిధిలో దాదాపు 90 మంది కాంట్రాక్టర్లు ఉండగా, 30 మందికిపైగా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కమిషనర్‌ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ప్రతి కాంట్రాక్టర్‌కు కనీసం వంద ఇళ్లు నిర్మించాలని టార్గెట్‌ ఇచ్చినట్లు సమాచారం.  ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలని, అందరూ తప్పనిసరిగా పాటించి తీరాల్సిందేనంటూ హుకుం జారీ అయినట్లు కాంట్రాక్టర్ల వర్గాలు చెబుతున్నాయి. లేదంటే పెండింగ్‌ బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నిర్మాణాలు చేయని వారిని భవిష్యత్‌లో కార్పొరేషన్‌ టెండర్లలో పాల్గొనకుండా చేస్తామని కూడా బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించగా వారికి కనీసం ఆ అవకాశం కూడా ఇవ్వలేదని సమాచారం. రూ.1.80 లక్షలకు ఇంటి నిర్మాణం సాధ్యం కాదని చెబుతున్నా అక్కడ ఎవరూ పట్టించుకునేవారు లేకుండా పోయారని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 


ఇప్పటికే చితికిపోయిన కాంట్రాక్టర్లు

ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మొదట మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి.. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం నగదు ఇస్తే లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకోవడం. రెండు.. ప్రభుత్వం మెటీరియల్‌ ఇస్తే లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకోవడం. మూడు.. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం. అయితే ప్రస్తుతమున్న ధరలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడం సాధ్యం కాదు కాబట్టి పేదలంతా మూడో ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. తర్వాత ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది.  కానీ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఏ కాంట్రాక్టరూ ముందుకు రాకపోవడంతో పేదలే ఎవరి ఇళ్లు వారు నిర్మించుకోవాలని సూచించింది. పేదల చేత బలవంతంగా ఆప్షన్‌ను మార్పించారు. మొదటి  దశలో జిల్లాకు 76,024 ఇళ్లు మంజూరయ్యాయి. గడిచిన ఏడు నెలలుగా రకరకాల బలప్రయోగాలు చేసి ఇప్పటివరకు దాదాపు 50 వేల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యేలా అధికారులు చొరవ తీసుకున్నారు. అయితే అందులో మూడో వంతు ఇంకా బేస్‌ లెవల్‌ కూడా దాటకపోవడం గమనార్హం. ఇలా ఆర్భాటంగా ప్రారంభమైన నవరత్నాల పథకంలో ఇళ్ల నిర్మాణాలు జరగకపోతుండడంతో ఇప్పుడు ఆ భారాన్ని కాంట్రాక్టర్లపై మోపేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇప్పటికే కాంట్రాక్టర్ల వ్యవస్థ చితికిపోయింది. గత ప్రభుత్వంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు ఇవ్వకపోవడంతో చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీని మూలంగా గడిచిన రెండేళ్లుగా అనేక వర్కులకు టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్ల నుంచి స్పందన ఉండడం లేదు. పాత బిల్లులు రాకుండా మళ్లీ కొత్తగా నష్టంతో కూడిన నిర్మాణాలు చేపట్టాలంటే ఎలా సాధ్యమని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-01-25T05:32:50+05:30 IST