నెలాఖరుకు 100% వ్యాక్సినేషన్‌!

ABN , First Publish Date - 2021-12-02T09:18:32+05:30 IST

రాష్ట్రంలో ఈ నెలాఖరుకల్లా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం కలెక్టర్లను ఆదేశించింది.

నెలాఖరుకు 100% వ్యాక్సినేషన్‌!

  • ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోండి..
  • జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం
  • వ్యాక్సినేషన్‌ లక్ష్యం పూర్తయితే ప్రోత్సాహకాలు
  • తక్కువగా ఉన్న జిల్లాల్లో అధికారులు పర్యటించాలి
  • సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంపై జాగ్రత్త
  • అధికారులకు మంత్రులు హరీశ్‌, కేటీఆర్‌, సబిత ఆదేశాలు

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ నెలాఖరుకల్లా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం కలెక్టర్లను ఆదేశించింది. అర్హులైన ప్రజలందరికీ టీకా రెండు డోసులూ వేయాలని స్పష్టం చేసింది. టీకా ప్రక్రియను 100 శాతం పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ, మునిసిపిల్‌, విద్య, వైద్యారోగ్యం సహా శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరాలని మార్గనిర్దేశనం చేసింది. వంద శాతం వ్యాక్సినేషన్‌ సాధించిన జిల్లాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. వ్యాక్సినేషన్‌లో జిల్లాలు పోటీ పడాలని సూచించింది. వ్యాక్సినేషన్‌ తక్కువగా జరుగుతున్న జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఆదేశించింది. బుధవారమిక్కడి బీఆర్కే భవన్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌తో పాటు ఒమైక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని ఉపసంఘం సమావేశమైంది.


 ఇందులో కమిటీ సభ్యులైన కేటీఆర్‌, సబిత పాల్గొన్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఒమైక్రాన్‌ వేరియంట్‌, వ్యాక్సినేషన్‌పై జిల్లాల వారీగా సీఎం సమగ్రంగా చర్చించినట్లు మంత్రులు తెలిపారు. ఒమైక్రాన్‌ వంటి కొత్త వేరియంట్‌ను సమర్థంగా అడ్డుకోవాలంటే అందరూ టీకా తీసుకోవడంతో పాటు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందేనని ఉపసంఘం అభిప్రాయపడింది. ఈ నెలాఖరుకు 100ు వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను సాధించడానికి ఆవాసాలు, వార్డులు, సబ్‌సెంటర్లు, మునిసిపాలిటీలు, మండలాల వారీగా కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఏరియా ఆస్పత్రుల అప్‌ గ్రెడేషన్‌, రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, ఆర్టీపీసీఆర్‌ సెంటర్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని, కొత్త మెడికల్‌ కళాశాలల భవనాల నిర్మాణం, అనుబంధ ఆస్పత్రుల్లో అదనపు పడకల ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులతో వెంటనే చర్చించాలని సూచించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. రెండు వేవ్‌లను ఎదుర్కోవడంతో కొవిడ్‌ పరిస్థితిపై అందరికీ అవగాహన వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఒమైక్రాన్‌పై ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు సరైన సమాచారం, సూచనలు అందించేందుకు గతంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను తిరిగి ప్రారంభించి, నిరంతరాయంగా పనిచేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో కొవిడ్‌ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన చోట విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు.  


రాష్ట్రంలో కొత్త కేసులు 193 

హైదరాబాద్‌ : రాష్ట్రంలో బుధవారం 40,018 మందికి కొవిడ్‌ టెస్టులు చేయగా 193 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇన్ఫెక్షన్‌తో ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,993కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,630 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 73, మేడ్చల్‌లో 14, రంగారెడ్డిలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-12-02T09:18:32+05:30 IST