బెంగాల్‌కు వెయ్యికోట్లు: మోదీ

ABN , First Publish Date - 2020-05-23T08:31:36+05:30 IST

‘ఆంఫన్‌’ తుఫాను అల్లకల్లోలం రేపిన పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం అండగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కలిసి ఆయన తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఏరియల్‌ సర్వే...

బెంగాల్‌కు వెయ్యికోట్లు: మోదీ

  • ‘ఆంఫన్‌’తో అతలాకుతలమైన రాష్ట్రానికి తక్షణ సాయం


కోల్‌కతా, భువనేశ్వర్‌, మే 22 : ‘ఆంఫన్‌’ తుఫాను అల్లకల్లోలం రేపిన పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం అండగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కలిసి ఆయన తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం బషీర్‌హత్‌లో గవర్నర్‌ జగ్దీప్‌ ధన్కర్‌, మమతతో కలిసి తుఫాను అనంతర పరిస్థితులను  సమీక్షించారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్‌, కోల్‌కతా, హౌరా, హుగ్లీ జిల్లాలు అపారంగా నష్టపోయినట్టు గుర్తించారు. తుఫాను బంగ్లాదేశ్‌ వైపు తీరం దాటే సమయంలో సృష్టించిన విలయానికి కోల్‌కతా సహా పలు నగరాలు, 24 పరగణాల జిల్లా, గ్రామీణ ప్రాంతాలు విలవిల్లాడాయి. రోడ్లు, టెలీ కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌, విద్యుత్‌ వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఈ నష్టతీవ్రతను ప్రధానమంత్రి భేటీలోనూ, విలేకరుల సమావేశంలోనూ మమత వివరించారు. ఒక్కమాటలో.. జాతీయ విపత్తును మించిన కష్టం రాష్ట్రానికి వచ్చిందని, తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుందని ఆమె చెప్పారు.


అనంతరం పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర సాయం వివరాలను మోదీ తెలిపారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. రెండు లక్షలు చొప్పున, గాయపడినవారికి రూ.యాభై వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. కష్టంలో ఉన్న బెంగాల్‌కు దేశం, కేంద్రం అండగా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన ఒడిసా చేరుకొని.. తుఫాను వల్ల దెబ్బ తిన్న ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే జరిపారు. రూ.500 కోట్ల తాత్కాలిక సాయాన్ని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో నాలుగు జిల్లాలు విపత్తుబారిన పడ్డాయి. 40 లక్షల మంది బాధితులుగా మారారు. పెద్దఎత్తున ఇళ్లు నేలమట్టమయ్యాయి. అయితే, ఎవరూ చనిపోలేదని నవీన్‌ ప్రభుత్వం ప్రకటించింది. 

Updated Date - 2020-05-23T08:31:36+05:30 IST