కరోనా శవాల దహనానికి 1000 టన్నుల కలప

ABN , First Publish Date - 2021-05-05T07:46:29+05:30 IST

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను దహనం చేసేందుకు శ్మశానాల్లో తీవ్రంగా కలప కొరత ఉండడంతో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) స్పందించింది.

కరోనా శవాల దహనానికి 1000 టన్నుల కలప

                  టీఎస్ఎఫ్డీసి నుంచి ఉచితంగా అందిస్తాం

                  కొరత లేకుండా చూస్తాం: వంటేరు

హైదరాబాద్‌, మే 4(ఆంధ్రజ్యోతి): కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను దహనం చేసేందుకు శ్మశానాల్లో తీవ్రంగా కలప కొరత ఉండడంతో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) స్పందించింది. మానవత దృక్పథంతో రూ.20 లక్షల విలువైన 1000 టన్నుల కలపను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీతో పాటు మిగతా పట్టణాల్లోనూ కలపను అందుబాటులో ఉంచుతున్నామని, కలప కొరత లేకుండా చూస్తామని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. పెరిగిన కలప ధరలు పేదలకు భారంగా మారడంతో తమవంతు సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రంగారెడ్డి డివిజన్‌లో 3,500 టన్నులు, ఖమ్మం-సత్తుపల్లి, అశ్వారావుపేట-భద్రాచలం డివిజన్లలో 4 వేల టన్నులు, మంచిర్యాల-కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 860 టన్నులు, వరంగల్‌ డివిజన్‌లో 200 టన్నుల కలప అందుబాటులో ఉందని వివరించారు. అంత్యక్రియలకు అవసరమైన వెదురును కూడా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిధిలోని అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, ఆసి్‌ఫనగర్‌, ఈఎస్ఐ శ్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామని తెలిపారు. అంత్యక్రియలకు అవసరమైన కలప కోసం స్థానిక మున్సిపల్‌ అధికారులను సంప్రదించాలని టీఎస్ఎఫ్డీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ జి. చంద్రశేఖర్‌ రెడ్డి సూచించారు. కలపను ఉచితంగా శ్మశానవాటికలకు తరలించేందుకు స్థానిక లారీ ఓనర్స్‌ అసోసియేషన్లు ముందుకువచ్చాయని తెలిపారు. 


Updated Date - 2021-05-05T07:46:29+05:30 IST