పురావస్తు తవ్వకాల్లో ఆశ్చర్యకర ఘటన.. వెయ్యేళ్ల క్రితం కాలానికి చెందిన ఇదేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-06-15T17:28:31+05:30 IST

దీంతోపాటు ఎముకలతో చేసిన మూడు బొమ్మలు కూడా దొరికాయట. వీటిని అబ్బాసీ కాలంలో చేసేవారట. ఈ అబ్బాసీ సామ్రాజ్యం ఏడవ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య వరకూ పాలించింది. ఈ బొమ్మలతోపాటు ఒక నూనె దీపం కూడా దొరికిందీ గుంతలో.

పురావస్తు తవ్వకాల్లో ఆశ్చర్యకర ఘటన.. వెయ్యేళ్ల క్రితం కాలానికి చెందిన ఇదేంటో తెలిస్తే..

వెయ్యేళ్ల క్రితం ఒక రోజు ఆ కోడి గుడ్డుపెట్టింది. దానికేం తెలుసు ఆ గుడ్డు పిల్ల అవ్వడం జరగదని? అయితే ఆ తర్వాత ఆ కోడి ఏమైందో తెలియదు కానీ ఆ గుడ్డు మాత్రం యావ్నే సిటీలో ఇండస్ట్రియల్ జోన్‌లో ఒక డ్రైనేజీ గుంటలో చేరింది. అక్కడే దాదాపు వెయ్యేళ్లు ఉన్న ఈ గుడ్డు తాజాగా బయటపడింది. ఇజ్రాయెల్‌లో దొరికిన ఈ గుడ్డు అసలు ఎలా దొరికిందో తెలుసా?  ఇండస్ట్రియల్ జోన్‌లో నిర్మాణాలు ప్రారంభించే ముందు తవ్వకాలు చేయడం కోసం ఇజ్రాయెల్ ఆంటిక్విటీస్ అథారిటీకి(ఐఏఏ) చెందిన ఒక బృందం వచ్చింది. ఈ తవ్వకాల సమయంలోనే మెత్తటి వ్యర్థాల మధ్య ఉన్న ఈ గుడ్డు పరిశోధకుల కంటపడింది. దాంతో చాలా జాగ్రత్తగా దీన్ని బయటకు తీశారు. విచిత్రం ఏంటంటే.. అంత జరిగినా ఆ గుడ్డు చెక్కుచెదరలేదు.


ఆ గుడ్డును చూసి తాము షాకయ్యామని ఐఏఏ పరిశోధకులు చెప్పారు. ఆ తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా ల్యాబుకు తీసుకెళ్లి పరిశోధనలు చేశారు. అసలు అది పారిశ్రామిక వ్యర్థాల్లో ఇంతకాలం ఎలా ఉంది? అంటే ఆ గుడ్డు టాయిలెట్ వ్యర్థాల్లో చేరిందట. దీంతో చుట్టూ మెత్తని పదార్థం ఉండటంతో ఈ గుడ్డుపై పెద్దగా ఒత్తిడి పడలేదు. వెయ్యేళ్ల క్రితం నాటి ఈ గుడ్డును ఎంతో భద్రంగా చూసుకోవాలి. కానీ పొరపాటున ఇది ల్యాబులో పగిలిపోయింది! అయితే పరిశోధనల కోసం ఏదో ఒక స్టేజిలో దీన్ని పగలగొట్టాల్సి వచ్చేదని, గుడ్డు పగిలినా కొంత సొన గుడ్డు పెంకుల్లో ఉందని ఐఏఏ అధికారిణి నాగోర్‌స్కీ తెలిపారు. కాబట్టి పరిశోధనలు ముందుకు సాగుతాయని ప్రపంచానికి నచ్చజెప్పారామె.


అసలు ఈ గుడ్డు వెయ్యేళ్ల క్రితం నాటిదని ఎలా గుర్తించారో తెలుసా? ఈ గుడ్డు పక్కన దొరికిన మిగతా వస్తువుల సాయంతో. సుమారు 4 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు ఉన్న గుంతలో ఈ గుడ్డు దొరికింది. దీంతోపాటు ఎముకలతో చేసిన మూడు బొమ్మలు కూడా దొరికాయట. వీటిని అబ్బాసీ కాలంలో చేసేవారట. ఈ అబ్బాసీ సామ్రాజ్యం ఏడవ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య వరకూ పాలించింది. ఈ బొమ్మలతోపాటు ఒక నూనె దీపం కూడా దొరికిందీ గుంతలో. ఇది కూడా అబ్బాసీ కాలానికి చెందిందే అని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అదీ సుమారు వెయ్యేళ్ల క్రితమే దాన్ని తయారు చేసినట్లు భావిస్తున్నారు. ఇలా ఆ గుడ్డు కూడా కనీసం వెయ్యేళ్ల క్రితం నాటిదని గుర్తించారట.



Updated Date - 2021-06-15T17:28:31+05:30 IST