మన్యం పాఠశాలల్లో ‘101 రోజుల గిరి అభ్యాసం’

ABN , First Publish Date - 2022-01-21T06:08:42+05:30 IST

మన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాలల్లో ‘గిరి అభ్యాసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఏజెన్సీ డీఈవో డాక్టర్‌ పి.రమేశ్‌ తెలిపారు.

మన్యం పాఠశాలల్లో ‘101 రోజుల గిరి అభ్యాసం’
మాలివలస పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఏజెన్సీ డీఈవో రమేశ్‌

రాయడం, చదవడంపై విద్యార్థుల సామర్థ్యం పెంపు

ఏజెన్సీ డీఈవో డాక్టర్‌ రమేశ్‌ వెల్లడి


అరకురూరల్‌, జనవరి 20: మన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాలల్లో ‘గిరి అభ్యాసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఏజెన్సీ డీఈవో డాక్టర్‌ పి.రమేశ్‌ తెలిపారు. గురువారం చినలబుడు పంచాయతీ మాలివలస ప్రాఽథమిక పాఠశాలలో ‘గిరి అభ్యాసం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, కొవిడ్‌ కారణంగా రెండు సంవత్సరాల నుంచి పాఠశాలలు సరిగా పని చేయకపోవడంతో చాలా మంది విద్యార్థులు రాయడం, చదవడం వంటివి మరిచిపోయారని అన్నారు. ‘గిరి అభ్యాసం’ కార్యక్రమం ద్వారా రాయడం, చదవడంపై  సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. 101 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం ఏప్రిల్‌ 30న ముగుస్తుందని చెప్పారు. కాగా ఎంఈవో పి.భారతీ రత్నం మండలంలోని మాడగడ, జనంగుడ, రవ్వల గుడ పాఠశాలల్లో గిరి అభ్యాసం కార్యక్రమాలను ప్రారంభించారు. ఏటీడబ్ల్యూవో ఎం.మల్లికార్జునరావు, స్యూలు కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు నపిరి రామారావు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.


అల్లంపుట్టులో.. 

హుకుంపేట: మండలంలోని అల్లంపుట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ‘101 రోజుల గిరి అభ్యాసం’ కార్యక్రమాన్ని తీగలవలస సర్పంచ్‌ పాంగి బేసు ప్రారంభించారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు హెచ్‌ఎం శెట్టి పూర్ణచంద్రరావు తెలిపారు.


చింతపల్లిలో.. 

చింతపల్లి, జనవరి 20:  స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో ‘గిరి అభ్యాసం’ కార్యక్రమాన్ని ఏటీడబ్ల్యూవో చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు నెల రోజుల కిందట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించారని చెప్పారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ‘గిరి అభ్యాసం’ కార్యక్రమానికి రూపకల్పన చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోరాబు రాజేశ్వరి, ఉపాఽ ద్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-21T06:08:42+05:30 IST