Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయ్యో.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు..!

జీతమొచ్చి 5 నెలలైంది!

ఆర్థిక ఇబ్బందుల్లో 104, 108 ఉద్యోగులు 

అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న వైనం 

ఏజెన్సీలకు బిల్లులివ్వని రాష్ట్ర ప్రభుత్వం.. చేతులెత్తేసిన ఏజెన్సీలు, జీవీకే సంస్థ  

నెలలుగా మరమ్మతుల్లేని 108 వాహనాలు.. మరోవైపు వేధిస్తున్న సిబ్బంది కొరత 


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అత్యవసర సర్వీసులైన 104, 108లలో పనిచేసే వైద్య సిబ్బందికి ఐదు మాసాలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. చేసిన అప్పులు తీర్చలేని తమకు ఇక అప్పు పుట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదని వాపోతున్నారు. వారికి జీతాలిచ్చే అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు, జీవీకే సంస్థకు ప్రభుత్వం నెలల తరబడి బిల్లులివ్వడం లేదు. దీంతో అవి కూడా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. సర్కారు నుంచి బిల్లులు వస్తేనే జీతాలిస్తామని తెగేసి చెబుతున్నాయి. 104లో పనిచేసే వారికి ఈ ఏడాది మే వరకు మాత్రమే జీతాలు అందాయి. వీరి వేతనాలను తొలుత రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏజెన్సీ ద్వారా చెల్లించేవారు. దాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం జిల్లాల వారీగా ప్రైవేటు ఏజెన్సీలకు వేతనాల బాధ్యతలను అప్పగించారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉండే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలకు అప్పగించారు.


అయితే, ప్రభుత్వం నుంచి నెలల తరబడి బిల్లులు రావడం లేదని, అందువల్లే సకాలంలో జీతాలివ్వలేకపోతున్నామని అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. 104 వాహనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది సిబ్బంది అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. ఒక 104 వాహనం కింద ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సెక్యూరిటీ గార్డు పని చేస్తారు. ప్రస్తుతం వీరి వేతనాలు రూ.12 వేల నుంచి రూ.17500 మధ్య ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహనాల్లో పని చేసే డ్రైవర్లు, ఎమర్జ్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్లకు 3 నెలలుగా జీవీకే సంస్థ వేతనాలు చెల్లించడం లేదు. వేతనాల గురించి గట్టిగా ప్రశ్నించే పరిస్థితి లేదని, అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. దశాబ్ద కాలంగా పని చేస్తున్న వారికీ రూ.18 వేలలోపే ఇస్తున్నారని అంటున్నారు.


షెడ్లలోనే వాహనాలు 

రాష్ట్రంలో ప్రస్తుతం 108 అంబులెన్స్‌లు 440 ఉన్నాయి. ఇందులో రోజూ కనీసం 420 వర్కింగ్‌లో ఉండాలి. కానీ, ఇందులో చాలా వరకు రోడ్లపైకి రావడం లేదు. సర్కారు పర్యవేక్షణ సరిగా లేక షెడ్డుకు చేరుకుంటున్నాయి. వాహనాలకు మరమ్మతులు చేయించడం లేదు. 108లో సుమారు 1800 మంది వరకు పని చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 1468 మంది ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సీనియర్లకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి వస్తోందనే భావనతో వారిని పక్కన పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు రూ.18 వేల జీతం ఇస్తారని, అదీ నాలుగైదు నెలలు పెండింగ్‌ పెడుతున్నారని డ్రైవర్లు వాపోతున్నారు.


అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సివస్తోందని, గట్టిగా జీతాలడిగే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ నుంచి తమకు జీతాలు ఆపేశారని 104 వాహనాల సిబ్బంది వాపోతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలు ఇస్తామంటున్నారే తప్ప ఇంకా ఇవ్వలేదని చెబుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంట్లో ఉన్న వస్తువులను అమ్ముకోవాల్సి వస్తోందంటున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement