పిలిచినా పలకని 108

ABN , First Publish Date - 2020-08-04T10:51:41+05:30 IST

ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన 108 అంబులెన్సులు గంటలు గడిచినా రావడం లేదు.

పిలిచినా పలకని 108

ఆస్పత్రులకు వెళ్ళడానికి గంటల తరబడీ నిరీక్షణ 


తిరుపతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన 108 అంబులెన్సులు గంటలు గడిచినా రావడం లేదు. దీంతో ప్రభుత్వాస్పత్రులకు వెళ్ళాల్సిన కొవిడ్‌ బాధితులకు గంటల తరబడీ నిరీక్షణ తప్పడం లేదు.కరోనా పాజిటివ్‌ అనగానే చుట్టుపక్కల వారు సాయం చేసేందుకు ముఖం చాటేస్తున్నారు. ఆటో సహా అద్దె వాహనాలు సైతం దొరకడం లేదు.


ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో విలవిల్లాడిపోయే లక్షణాలున్న  కరోనా బాధితులను చూడలేక కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు.  అత్యవసర సమయాల్లో అసలే మానసిక ఆందోళనతో వుండే బాధితుల కుటుంబీకులను ప్రైవేటు అంబులెన్సు ఆపరేటర్లు నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారు. ఆపరేటర్లందరూ ఒక్కటై స్వల్ప దూరాలకు కూడా కళ్ళు బైర్లు కమ్మే మొత్తాలను అద్దెల కింద వసూలు చేస్తున్నారు. ఇక దూరాభారాలైతే సామాన్యులు భరించలేనంత ఽఅద్దెలు చెబుతున్నారు. అధికార యంత్రాంగం ఈ అంబులెన్సు సర్వీసులను ఏమాత్రం నియంత్రించలేకపోతోంది.


తొట్టంబేడు మండలం రామచంద్రాపురంలో 50 ఏళ్ళ వ్యక్తికి కరోనా సోకింది.అతడికి సమాచారమిచ్చిన అధికారులు రెండురోజులకు కూడా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయలేదు. అంబులెన్సు కోసం నిరీక్షించి విసిగి వేసారిపోయిన బాధితుడు చివరికి సొంత ద్విచక్ర వాహనంలో ఆశా వర్కర్‌ను వెంటబెట్టుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి వెళ్ళాడు.

 

శాంతిపురం మండలం నలపరెడ్డి ఊరు గ్రామంలో ఓ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ రెండు వారాల క్రితం స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో  చేరారు. రెండురోజులైనా జ్వరం తగ్గకపోవడంతో కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నారు. అక్కడా ఫలితం లేకపోవడంతో కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి వెళ్ళగా కరోనా టెస్టు సిఫారసు చేశారు. మరుసటి రోజుకు పాజిటివ్‌ అని తేలడంతో తిరుపతి పద్మావతీ ఆస్పత్రికి వెళ్ళాలని సూచించారు.ఆ రోజంతా ఎదురుచూసినా అంబులెన్సు రాలేదు. దీంతో బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబీకులు ప్రైవేటు అంబులెన్సు మాట్లాడుకుని తిరుపతి తరలించారు. అయితే దీనికి చేతిచమురు చాలానే వదిలించుకోవాల్సివచ్చింది. 

 

చిత్తూరులో నివాసముంటున్న ఓ మాజీ ఎమ్మెల్యే దంపతులకు కరోనా సోకింది. మాజీ ఎమ్మెల్యే మెరుగైన వైద్యం కోసం తిరుపతి పద్మావతీ ఆస్పత్రి నుంచీ చెన్నై అపోలోకు వెళ్ళాలని నిర్ణయించుకుని ప్రైవేటు అంబులెన్సు మాట్లాడుకున్నారు. తిరుపతి నుంచీ చెన్నై వెళ్ళడానికి అంబులెన్సు ఆపరేటర్‌ రూ. 56 వేలు వసూలు చేశారు. ఇక ఆయన సతీమణి తాను హోమ్‌ క్వారంటైన్‌లో వుంటానంటూ తిరుపతి నుంచీ చిత్తూరు వెళ్ళేందుకు ప్రైవేటు అంబులెన్సు కుదుర్చుకోగా రూ. 26 వేలు వసూలు చేశారు.

 

77 ప్రభుత్వ అంబులెన్సులున్నా....

జిల్లాలో అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 సర్వీసు కింద 77 అంబులెన్సులు వున్నాయి. వీటిలో పాత వాహనాలు 37 వుండగా ఇటీవల కొత్తగా కేటాయించినవి 40 వున్నాయి. వీటిలో మండలానికి ఒకటి చొప్పున 65 వాహనాలు కేటాయించగా మిగిలిన 12 వాహనాలను కేవలం కొవిడ్‌ బాధితుల తరలింపు కోసమే కేటాయించారు. 66 రెవిన్యూ మండలాల పరిధిలో రోజుకు కనిష్టంగా 200కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న జిల్లాలో 12 అంబులెన్సులతో వందలాదిమంది బాధితులను ఎలా ఆస్పత్రులకు, కొవిడ్‌ సెంటర్లకు చేర్చుతారన్నది ప్రశ్న.


ఆస్పత్రులకు, కొవిడ్‌ సెంటర్లకు తరలించడంలో జాప్యం వల్ల సీరియస్‌ కండిషన్‌లో వున్న బాధితులు ప్రాణాపాయానికి లోనవుతుండగా, సాధారణ బాధితుల వల్ల ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం తలెత్తుతోంది.ఈ విషయంలో నగరి మండల అధికారులు చొరవ తీసుకుని రెండు మినీ బస్సులను ఏర్పాటు చేసుకున్నారు. బాధితుల తరలింపునకు వాటిని వినియోగిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆ దిశగా చొరవ తీసుకుని ప్రైవేటు వాహనాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసుకుంటే బాధితుల తరలింపులో జాప్యం వుండదు.


Updated Date - 2020-08-04T10:51:41+05:30 IST