పేదలకు 10 కిలోలే

ABN , First Publish Date - 2020-07-05T06:57:22+05:30 IST

ఆహార భద్రత కార్డుదారుల్లో పేర్లు నమోదైన ఒక్కొక్కరికి నెలకు 10 కిలోల బియ్యాన్ని ఐదునెలల పాటు ఉచితంగా పంపిణీ

పేదలకు 10 కిలోలే

  • ఇప్పటిదాకా 12 కిలోలు.. 2 కిలోలు తగ్గింపు
  • 87 లక్షల కార్డుల్లో 2.8 కోట్ల మందికి లబ్ధి 
  • జూలై నుంచి నవంబరు దాకా పంపిణీ 
  • కేంద్రం ఇచ్చే 5 కిలోలకు రాష్ట్రం మరో 5 కిలోలు
  • ఈ-పాస్‌ సాఫ్ట్‌వేర్‌ మళ్లీ అప్‌డేట్‌
  • నేటి నుంచే ఆహార భద్రత బియ్యం పంపిణీ 
  • రూ.250 కోట్ల అదనపు భారం: గంగుల

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఆహార భద్రత కార్డుదారుల్లో పేర్లు నమోదైన ఒక్కొక్కరికి నెలకు 10 కిలోల బియ్యాన్ని ఐదునెలల పాటు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలలుగా జాతీయ ఆహారభద్రత కార్డులు కలిగిన పేదలకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. దీన్ని మరో 5 నెలలపాటు అంటే జూలై నుంచి నవంబరు దాకా పొడిగిస్తూ ప్రధాని మోదీ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొంది. కేంద్రం ఇచ్చినట్లే జూలై నుంచి నవంబరు వరకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేంద్రం ఇచ్చే 5 కిలోలు, రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు కలిపి ఒక్కో లబ్ధిదారునికి నెలకు 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేయనున్నారు. ఈ మేరకు ఆదివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.


87.55 లక్షల ఆహార భద్రత కార్డుల్లోని 2.79 కోట్ల మందికి నెలకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందనుంది. సాధారణ రోజుల్లో ఆహార భద్రత కార్డున్న లబ్ధిదారుడికి కిలోకు రూపాయి ధరతో నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తారు. అయితే, కొవిడ్‌-19 ప్యాకేజీ కింద ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ప్రతి లబ్ధిదారునికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, ఇందులో 53.3 లక్షల కార్డులు కేంద్రం జారీచేసిన జాతీయ ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డులున్న వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. వీరికి అదనంగా 7 కిలోల చొప్పున ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ అయింది. మిగిలిన 34.25 లక్షల రాష్ట్ర ఆహార భద్రత కార్డులున్న లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత బియ్యం పంపిణీ చేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌- 19 అదుపులోకి రాకపోవటం, ఉద్యోగ, ఉపాధి రంగాలు దెబ్బతినటంతో పరిస్థితులు మెరుగుపడలేదు.


నిరుపేదల ఇబ్బందులు, జూలై 5 తేదీ నుంచి వరుసగా ప్రారంభమయ్యే పండగులను దృష్టిలో ఉంచుకొని ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని మరో 5 నెలలు పొడగించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలపాటు కొవిడ్‌-19ప్యాకేజీని అమలుచేసి, జూలై నుంచి సాధారణ రోజుల్లో పథకాన్ని అమలుచేసినట్లుగానే రూపాయికి కిలో చొప్పున ప్రతి లబ్ధిదారునికి 6 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రేషన్‌ డీలర్లతో డీడీలు కూడా అదే లెక్కన తీయించింది. కొవిడ్‌-19 ప్యాకేజీకి కోసం 12 కిలోలు ఉచిత పంపిణీ చేసేలా అప్‌డేట్‌ చేసి ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కిలో రూపాయికి పంపిణీ చేసేందుకు వీలుగా అప్‌డేట్‌ చేసింది. ఇప్పుడు మళ్లీ ఒక్కో లబ్ధిదారునికి 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీచేసేలా సాఫ్ట్‌వేర్‌ను తిరిగి అప్‌డేట్‌ చేయిస్తోంది. కాగా డీలర్లు ఇప్పటికే తీసిన డీడీలు వెనక్కి తిరిగి ఇవ్వనున్నారు. ఉచిత పంపిణీ కావటంతో ఎలాంటి డీడీలు చెల్లించకుండానే బియ్యం కోటా కేటాయిస్తారు. 


రాష్ట్రవ్యాప్తంగా 2.79 కోట్ల మందికి లబ్ధి 

కేంద్రం సర్దుబాటుచేసిన కోటాతో కలిపి ఏప్రిల్‌లో 3.18 లక్షల టన్నులు, మే నెలలో 3.26 లక్షల టన్నులు, జూన్‌లో 3.25 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి నెల ఒకటో తేదీలోపే బియ్యం రేషన్‌ షాపులకే చేరితే, ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తుంటారు. అయితే ఈ నెల మాత్రం ఆలస్యం జరుగుతోంది. చౌకడిపోలకు పూర్తిస్థాయిలో బియ్యం చేరటానికి మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రతి నెల 95,800 టన్నుల బియ్యం రాష్ట్రానికి వస్తోంది. 53.3 లక్షల కార్డులపై 5 నెలలకు 4.79 లక్షల   టన్నుల బియ్యం కేంద్రం నుంచి రానుంది. మిగిలిన బియ్యం రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. మొత్తం 2.79 కోట్ల లబ్ధిదారులకు 2.79 లక్షల టన్నుల బియ్యం ప్రతినెలా పంపిణీ కానుంది. 


ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ..: గంగుల

ఐదు నెలల పాటు నెలకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీతో 2.79 కోట్ల మంది లబ్ధి పొందుతారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఆదివారం కరీంనగర్‌లో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ పేదలు పస్తులుండకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఈ ఉచిత బియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతినెలా అదనంగా రూ. 50 కోట్ల చొప్పున ఐదు మాసాల్లో కలిపి రూ. 250కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు.  

Updated Date - 2020-07-05T06:57:22+05:30 IST