యూపీఏ హయాంలో 11 బిల్లులు హడావిడిగా ఆమోదించారు: నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2021-08-06T21:16:08+05:30 IST

పార్లమెంటులో ఎలాటి చర్చలు లేకుండానే వివిధ బిల్లులను ప్రభుత్వం హడావిడిగా..

యూపీఏ హయాంలో 11 బిల్లులు హడావిడిగా ఆమోదించారు: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ:  పార్లమెంటులో ఎలాటి చర్చలు లేకుండానే వివిధ బిల్లులను ప్రభుత్వం హడావిడిగా ఆమోదిస్తోందంటూ విపక్షాలు కేంద్రంపై చేస్తున్న ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 11 బిల్లులను హడావిడిగా ఆమోదించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ స్వయంగా ఈ విషయం అంగీకరించారని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆమె అన్నారు.



''ప్రభుత్వం హడావిడిగా బిల్లులు ఆమోదిస్తున్నట్టు విపక్షాలు మట్లాడుతున్నాయి. 2007, 2011లో హడావిడిగా రాజ్యాంగ బిల్లులతో సహా 11 బిల్లులను యూపీఏ సర్కార్ ఆమోదించింది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబ్బల్ ఈ విషయాన్ని అంగికరించారు. మేము విపక్షాలను సభలో చర్చించమని అంటున్నాం. అయినప్పటికీ వాళ్లు నిరాధార క్లెయిమ్స్ చేస్తున్నారు'' అని నిర్మలా సీతారామన్ అన్నారు.


పార్లమెంటులో బిల్లులను కేంద్రం హడావిడిగా ఆమోదిస్తూ పోతుండటంపై టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ఇటీవల అభ్యంతరం తెలిపారు. మోదీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పది రోజుల్లో మోదీ-షాలు 12 బిల్లులు హడావిడిగా ఆమోదించారని, 'పాప్రి చాట్' చుట్టేసినట్టు ఒక్కో బిల్లు కేవలం ఏడు నిమిషాల్లోనే ఆమోదించేసారని ఈనెల 1న డెరిక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు. ఉభయసభల్లోనూ పెగాసస్ ప్రాజెక్టుపై విపక్షాల ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ  ప్రభుత్వం మాత్రం బిల్లులను ఆమోదించుకుంటూ పోతోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2021-08-06T21:16:08+05:30 IST