సత్తా చాటిన 11 భారత కంపెనీలు

ABN , First Publish Date - 2021-01-13T06:27:59+05:30 IST

కష్టకాలంలోనూ కొన్ని దేశీయ కంపెనీలు వృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మంచి పనితీరుతో తమ వాల్యుయేషన్‌ పెంచుకుంటున్నాయి. దీంతో 2020

సత్తా చాటిన   11 భారత  కంపెనీలు

  • హురున్‌ గ్లోబల్‌ 500 జాబితాలో చోటు 
  •  ఈ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.60 లక్షల కోట్లు
  • అగ్రస్థానంలో రిలయన్స్‌  


ముంబై: కష్టకాలంలోనూ కొన్ని దేశీయ కంపెనీలు వృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మంచి పనితీరుతో తమ వాల్యుయేషన్‌ పెంచుకుంటున్నాయి. దీంతో 2020 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అత్యంత విలువైన 500 అగ్రశ్రేణి కంపెనీల జాబితాలో 11 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. హురున్‌ అనే అంతర్జాతీయ సంస్థ ‘హురున్‌ గ్లోబల్‌ 500’ పేరుతో ఈ జాబితా రూపొందించింది. గత ఏడాది ఈ 11 కంపెనీల మార్కెట్‌ విలువ 14 శాతం పెరిగి 80,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.59.57 లక్షల కోట్లు) చేరింది. ఇది ప్రస్తుత భారత జీడీపీలో మూడో వంతుకు సమానం. 


‘రిలయన్సే’ టాప్‌:

‘హురున్‌ గ్లోబల్‌ 500’లో చోటు సంపాదించిన 11 భారత కంపెనీల్లో ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబరు 1 నాటికి ఈ కంపెనీ మార్కెట్‌ విలువ 20.5 శాతం పెరిగి 16,880 కోట్ల డాలర్లకు చేరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో 54వ స్థానంలో ఉంది.


ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టీసీఎస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ ఉన్నాయి. గత ఏడాది టీసీఎస్‌ విలువ 30 శాతం పెరిగి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 73వ స్థానానికి చేరింది. టాప్‌-500 జాబితాలో చోటు దక్కినా గత ఏడాది ఐటీసీ లిమిటెడ్‌ విలువ 22 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ విలువ అర శాతం పడిపోయాయి. కాగా భారతి ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా ఈ జాబితాలో  చోటు దక్కించుకున్నాయి.


‘యాపిల్‌’దే అగ్రస్థానం:

విలువపరంగా చూస్తే ‘హురున్‌ గ్లోబల్‌ 500’ జాబితాల్లో యాపిల్‌ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబరు 1 నాటికి ఈ టెక్‌ దిగ్గజం విలువ 2.1 లక్షల కోట్ల డాలర్లు. ప్రస్తుత డాలర్‌-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది సుమారు రూ.155.4 లక్షల కోట్లకు సమానం.

మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల్లో 242 కంపెనీలు అగ్రరాజ్యం అమెరికావే కావడం విశేషం. చైనా (51), జపాన్‌ (30) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్‌ మాత్రం 11 కంపెనీలతో పదో స్థానంలో ఉంది.




ముంబైలోనే ఎక్కువ కంపెనీలు

హురున్‌ గ్లోబల్‌ జాబితాలో చోటు సంపాదించిన 11 భారత కంపెనీల్లో ఏడు కంపెనీలు ముంబై కేంద్రంగా పని చేస్తున్నాయి. పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీల్లో ఒక్కో కంపెనీ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. దేశీయ కంపెనీలకు తోడు ‘హురున్‌ గ్లోబల్‌ 500’ జాబితాలోని 239 విదేశీ కంపెనీలు తమ భారతీయ ప్రధాన కార్యాలయాల్ని ముంబైలోనే ఏర్పాటు చేయడం విశేషం. 






హురున్‌ గ్లోబల్‌ 500’లోని భారత కంపెనీలు


కంపెనీ పేరు                        విలువ (కోట్ల డాలర్లలో)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 16,880   

టీసీఎస్‌ 13,900

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 10,750

హెచ్‌యూఎల్‌ 6,820

ఇన్ఫోసిస్‌ 6,600

హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌ 5,640

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 5,060

ఐసీఐసీఐ బ్యాంక్‌ 4,560

ఐటీసీ 3,260


Updated Date - 2021-01-13T06:27:59+05:30 IST