కరోనా బారిన పడి 11 మంది భారతీయులు మృతి

ABN , First Publish Date - 2020-04-09T21:40:08+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 4 లక్షలు దాటగా, మృతిచెందిన వారి సంఖ్య దాదాపు

కరోనా బారిన పడి 11 మంది భారతీయులు మృతి

న్యూయార్క్: అమెరికాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 4 లక్షలు దాటగా, మృతిచెందిన వారి సంఖ్య దాదాపు 15వేలకు చేరింది. అమెరికన్లతో పాటు వివిధ దేశాలకు చెందిన అనేక మంది కరోనా కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా కనీసం 11 మంది భారతీయులు కరోనా సోకి మృతిచెందినట్టు తెలుస్తోంది. మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ రావడంతో వారందరూ క్వారంటైన్‌లో ఉన్నారు. చనిపోయిన భారతీయులందరూ పురుషులేనని అధికారులు వెల్లడించారు. వీరిలో పది మంది న్యూయార్క్, న్యూజెర్సీలకు చెందిన వారిగా గుర్తించారు. మిగతా వారు ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్‌లో నివసించే వారని అధికారులు పేర్కొన్నారు. 


న్యూయార్క్‌కు చెందిన వారిలో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లగా పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. న్యూయార్క్ నగరం కరోనాకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లో ఎటుచూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో మార్చురీలు కూడా ఖాళీ లేకపోవడంతో.. ఆసుపత్రుల బయటే మొబైల్ మార్చురీలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీని బట్టి న్యూయార్క్‌లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క విమాన రాకపోకలు నిలిచిపోవడంతో.. చనిపోయిన వారి అంత్యక్రియలు స్థానిక అధికారులే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2020-04-09T21:40:08+05:30 IST