ఎమ్మెల్సీ బరిలో 11 మంది

ABN , First Publish Date - 2021-11-24T06:40:29+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది అభ్యర్థులు చివరి రోజు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్సీ బరిలో 11 మంది
నల్లగొండలో కలెక్టర్‌ పీజే పాటిల్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, చిత్రంలో మంత్రి జగదీష్‌రెడ్డి, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌

చివరి రోజు నామినేషన్ల దాఖలు 

మంత్రి జగదీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో కోటిరెడ్డి నామినేషన్‌ 

కాంగ్రెస్‌, బీజేపీ పోటీకి దూరంఫ ముగిసిన నామినేషన్ల పర్వం

నల్లగొండ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది అభ్యర్థులు చివరి రోజు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి ఎంసీ కోటిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేయగా, మిగిలిన వారంతా స్వతంత్రులే. కాంగ్రె స్‌కు కంచుకోటగా, ఉద్దండులు ఉన్న జిల్లాగా ముద్రవేసుకున్నా, సుమారు 200 మంది ఓటర్లు కాంగ్రెస్‌ ఖాతాలో ఉన్నా, ఆ పార్టీ పోటీకి దూరంగా ఉంది. మరో ప్రధాన పార్టీ బీజేపీ సైతం ఈ ఎన్నికలో పోటీ చేయడంలేదు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే, తాజా జడ్పీటీసీ కుడుదుల నగేష్‌, నల్లగొండ జడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య ఇరువురు కాంగ్రెస్‌ నేతలే కాగా, వారు స్వతంత్రులుగా బరిలో దిగారు. జడ్పీటీసీల హక్కుల కోసం తాము పోటీలో ఉన్నట్టు వారు ప్రకటించారు. మరో 8 మంది ఎంపీటీసీలు సైతం నామినేషన్లు దాఖలుచేశారు. 


ఏకగ్రీవం లేనట్టేనా?

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డికి మంత్రి జగదీ్‌షరెడ్డి స్వయంగా బీ-ఫాం అందజేసి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మూడు సెట్ల నామినేషన్లను నల్లగొండ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం దాఖలు చేయించారు. తొలి సెట్‌ను మంత్రి జగదీ్‌షరెడ్డి, రెండో సెట్‌ను ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విప్‌ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్మన్‌ దీపికాయుగంధర్‌రావు, మూడో సెట్‌ను ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్‌ దాఖలు చేశారు. అయితే కోటిరెడ్డి ఏకగ్రీవ ఎన్నికపై అధికార పార్టీ అంచనాలు తప్పాయి. బీజేపీ ముందే చేతులెత్తేయగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సైతం పోటీకీ దూరంగా ఉంది. కాగా, అనూహ్యంగా పది మంది స్వతంత్రులు బరిలో దిగడం టీఆర్‌ఎ్‌సకు ఊహించని పరిణామం. ఒకరో ఇద్దరో పోటీలో ఉంటే వారిని ఏదో రకంగా విరమింపజేయవచ్చని పార్టీ పెద్దలు ఆలోచించారు. అయితే అంచనాకు మించి స్వతంత్రులు రంగంలోకి దిగారు. అందులో కాంగ్రెస్‌ నేతలు ఆలేరు జడ్పీటీసీ నగేష్‌, నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఉన్నారు. మిగిలిన 8 మంది స్వతంత్రుల్లో కాంగ్రెస్‌ వారే అధికం కాగా, సీపీఎం పార్టీకి చెందిన ఎంపీటీసీ పాదూరి గోవర్దిని సైతం ఉన్నారు. బరిలో నిలిచిన స్వతంత్రులు పార్టీ పెద్దలకు సమాచారం లేకుండానే పోటీకి సిద్ధం కావడం గమనార్హం. ఈనెల 24 నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ఉంది. 26న సాయంత్రానికి ఎన్నిక ఏకగ్రీవమా? కాదా? అనేది తేలనుంది.


నామినేషన్లు దాఖలు చేసిన వారు..

బ్రాంచ్‌                         చిరునామా పార్టీ

మక్కెన కోటిరెడ్డి బోయగూడెం, తిరుమలగిరి(సాగర్‌)     టీఆర్‌ఎస్‌

కాసర్ల వెంకటేశ్వర్లు గుమ్మడవెల్లి, కొండమల్లేపల్లి        స్వతంత్రుడు

రామ్‌సింగ్‌ కొర్ర కొర్రతండా, దేవరకొండ        స్వతంత్రుడు

బెజ్జం సైదులు దిలావర్‌పూర్‌, దామరచర్ల        స్వతంత్రుడు

బడుగుల రవీందర్‌ భీమారం, కేతేపల్లి        స్వతంత్రుడు

పాదూరి గోవర్దిని మొల్కపట్నం, వేములపల్లి        స్వతంత్రుడు

తండు సైదులు బాబన్‌సాహెబ్‌గూడెం, నకిరేకల్‌        స్వతంత్రుడు

ఏర్పుల శ్రీశైలం లెంకెలపల్లి, మర్రిగూడెం        స్వతంత్రుడు

కుడుదుల నగేష్‌ రాఘవాపురం, ఆలేరు        స్వతంత్రుడు

వంగూరి లక్ష్మయ్య గుండ్లపల్లి, నల్లగొండ        స్వతంత్రుడు

దాచేపల్లి నాగేశ్వర్‌రావు చీకటిగూడెం, కేతేపల్లి        స్వతంత్రుడు


సమస్యల పరిష్కారం కోసమే పార్టీలకతీతంగా పోటీ

ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యల పరిష్కారంకోసమే పార్టీలకతీతంగా తాను ఎమ్మెల్సీ ఎన్నికలబరిలో నిలిచినట్లు ఆలేరు మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కుడుదుల నగేష్‌ తెలిపారు. నామినేషన్ల చివరి రోజైన మంగళవారం కలెక్టరేట్‌లో తన నామినేషన్‌ పత్రాలను దాఖలుచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నిసార్లు పోరాడినా స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. అందుకే తాను బరిలో నిలిచినట్లు తెలిపారు. తనకు కాంగ్రెస్‌, బీజేపీ మద్దతు తెలిపి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ఏవిధంగా అయితే పోరాడానే అదేవిధంగా పోరాటం చేసి స్థానిక సంస్థలకు నిధులను సాధిస్తానన్నారు. తాను ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, అదే పంథాలో ముందుకు సాగుతానన్నారు.  


అభ్యర్థిని పెట్టలేని దుస్థితిలో విపక్షాలు : మంత్రి జగదీష్‌రెడ్డి

అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితికి ఉమ్మడి జిల్లాలో విపక్ష పార్టీలు చేరాయని మంత్రి జగదీ్‌షరెడ్డి ఎద్దేవా చేశారు. ఎంసీ కోటిరెడ్డి నామినేషన్‌ దాఖలు అనంతరం కలెక్టరేట్‌ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనమేనని, కోటిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని అన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, అందుకు సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, కోటిరెడ్డిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. అభ్యర్థి కోటిరెడ్డి మాట్లాడుతూ, తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులకు రుణపడి ఉంటానన్నారు. పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని, ఆయన నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి,  భాస్కరావు, భగత్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, సందీ్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


బరిలో నిలవని కాంగ్రెస్‌

‘మా నాయకులు ఎన్నికల్లో పోటీచేస్తే మేం ఇల్లు, సంసారం వదిలి నోటిఫికేషన్‌ మొదలు ఓటింగ్‌ వరకు అప్పగించిన ప్రాంతాల్లోని ఉండి మెజారిటీ కోసం గుడ్డలు చించుకుంటాం.. ఓటర్ల కాళ్లు, గడ్డాలు పట్టుకొని బతిమలాడాం.. చేతనైనంత లక్ష నుంచి రూ.10లక్షల వరకు ఖర్చుచేశాం.. ఇప్పుడు అవకాశం వచ్చింది నిలబడతాం అంటే నాయకులు ఎవరూ చడీచప్పుడు చేయడం లేదు.. ఒకరికొకరు మాట్లాడుకోరు.. అంతా సీఎంస్థాయి నాయకులే.. బీ-ఫాం ఇచ్చి నామినేషన్‌ రోజు నిలబడి, తలా ఓ చేయి వేస్తే ఊపొస్తుందని ఎంత మొత్తుకున్నా మా గురించి వారికి పట్టదు’ ఇది ఓ ద్వితీయశ్రేణి కాంగ్రెస్‌ నేత ఆవేదన. ‘మీరు పోటీలో ఉంటేనే మాకు విలువ ఉంటది.. లేదంటే పలకరించేటోడే ఉండడు’ అంటూ అధికార పార్టీకి చెందిన ఓటర్లే కాంగ్రెస్‌ నేతలకు వాట్సాప్‌ మెసేజ్‌లు చేశారు. చివరికి కాంగ్రెస్‌ బరిలో లేదని తెలియగానే ‘అంతా భ్రాంతియేనా..’ అనే పాటను అధికార పార్టీకి చెందిన ఓటర్లు కాంగ్రెస్‌ ఆశావహులకు ఆడియో మెసేజ్‌లు పంపి నిరాశ వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 1271 ఓట్లు ఉండగా, కాంగ్రె్‌సకు చెందినవి కనీసంగా 200 వరకు ఉన్నాయి. బరిలో దిగి, ఎంతో కొంత ముట్టచెబితే 400 వరకు ఓట్లు వచ్చే అవకాశం ఏర్పడి, టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తి ఉందని రుజువు చేసే అవకాశం ఉంది. అంతేగాక కాంగ్రె్‌సకు కొత్త ఊపు వస్తుందన్నది ద్వితీయ శ్రేణి నేతల ఆలోచన. ఆమేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివరి రెండు రోజులు కొంత ప్రయత్నం చేసి ఎంపీ ఉత్తమ్‌తో సంప్రదించినట్టు సమాచారం. తలా కొంత నగదు సమకూరిస్తే సరిపోతుందనుకున్నారు. అయితే జానా, దామోదరరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మిగిలిన నేతలు ఏ మాత్రం ఆసక్తిగా లేకపోవడంతో ఆ ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడినట్టు తెలిసింది. ఫలితం కాంగ్రె్‌సకు కంచుకోట, దిగ్గజాల ఖిల్లాగా ముద్రవేసుకున్న జిల్లాలో ఆ పార్టీ పోటీచేయలేని దయనీయ పరిస్థితికి దిగజారింది. ఈ పరిణామాలతో ఆశావహులు నిరాశకు గురయ్యారు. 

Updated Date - 2021-11-24T06:40:29+05:30 IST